గుట్కా, పేకాట స్థావరాలపై దాడులు

ABN , First Publish Date - 2021-06-14T05:59:20+05:30 IST

అర్బన్‌ జిల్లా పరిధిలో నిషేధిత గుట్కాలు, పాన్‌ మషాలాలు, గంజాయి, అక్రమ మద్యం, రేషన్‌ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ హెచ్చరించారు.

గుట్కా, పేకాట స్థావరాలపై దాడులు
పాన్‌ షాపులో తనిఖీలు నిర్వహిస్తున్న అరండల్‌పేట మహిళా ఎస్‌ఐ తరంగిణి

గుంటూరు, జూన్‌ 13 : అర్బన్‌ జిల్లా పరిధిలో నిషేధిత గుట్కాలు, పాన్‌ మషాలాలు, గంజాయి, అక్రమ మద్యం, రేషన్‌ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అర్బన్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆయా దుకాణాలు, పేకాట స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. పెద్దఎత్తున నిషేధిత గుట్కాలను సీజ్‌ చేశారు. పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలోని ఆర్టీసీ కాలనీ, కార్పొరేట్‌ స్కూలు వద్ద, మూడు పాన్‌షాపుల్లో పెద్దఎత్తున నిషేధిత గుట్కాలను సీఐ వాసు ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేరేచర్ల సెంటరులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాలను సీజ్‌ చేశారు. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుజ్జనగుండ్ల సెంటరు, పలకలూరు రోడ్డులో గుట్కాలు విక్రయిస్తున్న షేక్‌ సుభానిని ఎస్‌ఐ కె.విజయకుమార్‌ అరెస్టు చేసి గుట్కా ప్యాకెట్లను సీజ్‌ చేశారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మస్తాన్‌ దర్గా సెంటరులో ఓ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని గుట్కా ప్యాకెట్లు సీజ్‌ చేశారు. తాడేపల్లి స్టేషన్‌ పరిధిలోని నులకపేటలో ఓ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని గుట్కాలను సీజ్‌ చేశారు.

ఇదిలావుంటే చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శేకూరు గ్రామ శివారులో పేకాడుతున్న పది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.84,800 నగదు సీజ్‌ చేశారు. ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఈదులపాలెం గ్రామ శివారు ప్రాంతంలో పేకాడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రకాష్‌నగర్‌ రైల్వే ట్రాక్‌ పక్కన పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి నగదు సీజ్‌ చేశారు. మేడికొండూరు పరిధిలోని పేరేచర్ల పెద్ద మసీదు సెంటరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి 14 మద్యం బాటిళ్లను సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమరావతి రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం పక్కన గుట్కా విక్రయిస్తున్న పండరీపురం 3వ లైనుకు చెందిన వలివేటి హనుమంత్‌శాస్ర్తిని అరెస్టు చేశారు. అలాగే బ్రాడీపేట 5/7లో నిషేధిత గుట్కాలు విక్రయిస్తున్న నెహ్రూనగర్‌ 3వ లైనుకు చెందిన సూర్యనారాయణను, అలాగే కొరిటెపాడు పార్కు సెంటరులో గుట్కాలు విక్రయిస్తున్న స్వర్ణభారతినగర్‌ 16వ లైనుకు చెందిన మండల్‌ భీమల్‌ను మహిళా ఎస్‌ఐ తరంగిణి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు, గంజాయి, పేకాట, మద్యం, రేషన్‌ బియ్యం, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ప్రతిరోజు దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. పదే పదే పట్టుబడే వారిపై షీట్లు తెరిచి కఠినచర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2021-06-14T05:59:20+05:30 IST