Abn logo
Sep 19 2021 @ 11:53AM

‘ఆయన పర్యటనకు ఎవరి అనుమతి అవసరం లేదు’

               - బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌


దావణగెరె(కర్ణాటక): రాష్ట్రంలో మాజీ సీఎం యడియూరప్ప పర్యటించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ స్పష్టం చేశారు. పార్టీలో ఎటువంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. జిల్లాకేంద్రమైన దావణగెరెలో శనివారం బీజేపీ కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా సాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై నాయకులు చర్చించారు. అనంతరం అరుణ్‌సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు యడియూరప్ప ఎంతో కృషి చేశారన్నారు. ఆయన పర్యటనకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. ఆయన సలహా సూచనలతో సమష్టి నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేయనున్నట్టు తెలిపారు. యడియూరప్ప మాట్లాడుతూ ఇప్పటికే మైసూరులో పర్యటన ప్రారంభించానని జిల్లాలవారీగా త్వరలో పర్యటిస్తానన్నారు.


చాయాచిత్ర ప్రదర్శనను వీక్షించిన సీఎం 

నగరంలో బీజేపీకి సంబంధించి ఏర్పాటైన చాయాచిత్ర ప్రదర్శనను సీఎం బసవరాజ్‌ బొమ్మై వీక్షించారు. నళిన్‌కుమార్‌ కటీల్‌, మాజీ సీఎం జగదీశ్‌శెట్టర్‌, ఎంపీ జీఎం సిద్దేశ్వర్‌, కేంద్రమాజీ మంత్రి సదానందగౌడ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బైరతి బసవరాజ్‌, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తొలుత భరతమాత చిట్రపటానికి పుష్పాంజలి ఘటించారు.