Sep 27 2021 @ 16:19PM

Arya: కూతురికి ‘అరియానా’గా నామకరణం చేసిన హీరో ఆర్య.. ఆ పేరుకు అర్థమేంటంటే..

చెన్నై: రాజరాణి చిత్రంలో నటించి తెలుగువారి మన్ననలు పొందిన నటుడు ఆర్య. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ ఆయన తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. భలే భలే మగాడివోయ్ కొలీవుడ్ రీమేక్ అయిన గజీనీకాంత్‌లో ఆర్య, సాయేషా సైగల్  కలిసి నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితం జులైలో వీరికి కుమార్తె జన్మించింది. డాటర్స్‌డే  సందర్భంగా వీరు తమ బిడ్డ పేరును ప్రకటించారు. ఆర్య ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో తమ బిడ్డ పేరును వెల్లడించారు. ఆమెకు అరియానా అని పేరు పెట్టామన్నారు. అరియానా అనే పదం గ్రీకు నుంచి పుట్టింది. చాలా పవిత్రమైనది లేదా స్వచ్ఛమైనది అని ఆ పదం అర్థం.


సాయేషా తల్లి షాహీన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ మనవరాలి పేరును పోస్ట్ చేశారు. ‘‘ నా మనవరాలి వయసు రెండు నెలలు.  స్నేహితులు కూడా నా మనవరాలి పేరును తెలుసుకోవాలి. ఆమెకు అరియానా అని పేరు పెట్టాం. సాయేషా‌కు ఈ పేరు చాలా నచ్చింది. మీ ఆశీస్సులు, దీవెనలు నా మనవరాలికి అందించండి. ఆమె ఫొటోలను త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం ’’ అని సోషల్ మీడియాలో రాశారు.