జైల్లో Aryan Khan ప్రవర్తన గురించి విస్తుపోయే నిజాలు.. ఆర్యన్‌తోపాటు ఒకే బ్యారక్‌లో ఉండి విడుదలైన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే..

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాటి నుంచి బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వార్తల్లోనే ఉంటున్నాడు. అతడి జైలు జీవితం గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ప్రస్తుతం అతను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ జైలు నుంచి సోమవారం విడుదలైన శ్రావణ్ నాడార్ అనే వ్యక్తి.. జైలులో ఆర్యన్ ప్రవర్తన గురించి మాట్లాడాడు. ఛీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రావణ్ ఆరు నెలలు అదే జైలులో గడిపాడు. శ్రావణ్ ఉన్న బ్యార‌క్‌కే ఆర్యన్ కూడా వెళ్లాడు. సోమవారం విడుదలైన శ్రావణ్.. ఆర్యన్‌కు గురించి వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టం చేశాడు. 


`ఆర్యన్ ఉండే బ్యారక్‌‌ సెల‌్‌లో అతడితో పాటు మరో వంద మంది ఖైదీలు ఉంటారు. అందరికీ కలిపి నాలుగు టాయిలెట్లు ఉంటాయి. రాత్రి అందరూ పక్క పక్కనే నిద్రపోవాలి. నడవడానికి కూడా ఖాళీ ఉండదు. అందరికీ కలిపి 10 ఫ్యాన్లు మాత్రమే ఉంటాయి. నేను ఆ బ్యారక్‌కు ఆహారం సరఫరా చేసేవాడిని. జైలుకు వచ్చిన మొదటి రోజు క్యాంటిన్ నుంచి ఆర్యన్ టీ తీసుకుని తాగాడు. ఆ తర్వాత బిస్కెట్స్, చిప్స్ మాత్రమే తీసుకునే వాడు. నీటిలో ముంచుకుని బిస్కెట్లు తినేవాడు. జైలు ఆహారాన్ని మాత్రం ముట్టుకునే వాడు కాదు. 


ఉదయం, మధ్యాహ్నం, రాత్రి జైలు అధికారుల నుంచి ఆహారం తీసుకుని వేరే ఖైదీలకు ఇచ్చేసేవాడు. నేను, జైలు అధికారులు ఎంత చెప్పినా తినేవాడు కాదు. ఆకలిగా లేదని అనేవాడు. ఇతర ఖైదీల్లాగానే ఆర్యన్‌ కూడా జైలులో సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఎప్పుడూ టెన్షన్‌లో ఉన్నట్టు ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. టీవీ కూడా చూడడు. ఒంటరిగా కూర్చుంటాడు. లేదా నేలపై పడుక్కుని ఉంటాడు. నేను జైలు నుంచి విడుదలవుతున్నానని తెలిసి `కంగ్రాట్స్` చెప్పాడు. `మీరు కూడా త్వరలోనే బయటకు వస్తార`ని అన్నాను` అని శ్రవణ్ చెప్పాడు. కాగా, ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై మరికొద్ది సేపట్లో ముంబై సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Advertisement