Advertisement

27 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయిన Aryan Khan.. తీసుకెళ్లడానికి ఎవరు వచ్చారంటే..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 రోజుల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంట్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు ఈ శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యాడు. వాస్తవానికి గురువారమే ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత పేపర్ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పట్టింది. శుక్రవారం సాయంత్రం అయినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. కోర్టు ఆర్డర్లు జైలు అధికారులు చేరలేదు. దీంతో శుక్రవారం ఆర్యన్ ఖాన్‌ విడుదల ప్రక్రియ జరగలేదు. శనివారం తెల్లవారుజామున 5.30గంటల సమయంలో జైలు తలుపులను ఓపెన్ చేయడంతో.. బెయిల్ ఆర్డర్ పేపర్లు అధికారులకు చేరాయి. దీంతో తెల్లవారుజామునే ఆర్యన్ ఖాన్‌ను జైలు  నుంచి బయటకు పంపించారు.

తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ఇంటికి తీసుకొచ్చుకునేందుకు స్వయంగా షారూఖ్ ఖాన్ ప్రత్యేకంగా కారులో వెళ్లారు. వాస్తవానికి కొడుకును తీసుకురావడానికి తల్లి గౌరీఖాన్ కూడా వస్తారని వార్తలు వచ్చాయి. ఆమె కూడా రావడానికి సిద్ధపడినా.. సెక్యూరిటీ కారణాల వల్ల వద్దని షారూఖ్ వారించినట్టు తెలుస్తోంది. దీంతో షారూఖ్ ఒక్కరే జైలు వద్దకు వెళ్లారు. సరిగ్గా జైలు గేట్ల వద్దే కారును నిలిపి.. ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చిన వెంటనే కారులోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇన్ని రోజుల తర్వాత తనయుడు ఇంటికి చేరుకోవడంతో షారూఖ్ ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. షారూఖ్ ఇంటి వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో అభిమానులు షారూఖ్ ఇంటి వద్దకు చేరుకుని తమ ఆనందాన్ని పంచుకోవడం గమనార్హం.

Advertisement

Bollywoodమరిన్ని...