సరిగ్గా తినడు.. నీళ్లు తాగడు

ABN , First Publish Date - 2021-10-14T07:01:12+05:30 IST

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ జైలులో ఎన్నో అవస్థలు పడుతున్నాడు.

సరిగ్గా తినడు.. నీళ్లు తాగడు

  • తిని, తాగితే టాయిలెట్‌ వెళ్లాల్సి వస్తుందని భయం
  • జైలులో ఆర్యన్‌ ఖాన్‌ అవస్థలు 
  • డ్రగ్స్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌ నేటికి వాయిదా


న్యూఢిల్లీ, అక్టోబరు 13: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ జైలులో ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్‌ అనుభవించిన ఆర్యన్‌ ఖాన్‌ జైలు జీవితాన్ని భరించలేకపోతున్నాడు. అతడు సరిగ్గా భోజనం చేయట్లేడని, నీరు కూడా కావాల్సినంతగా తాగట్లేడని జైలు అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. భోజనం, నీరు తీసుకుంటే జైలు టాయిలెట్‌ వాడాల్సి వస్తుందని ఆర్యన్‌ ఖాన్‌ భయపడుతున్నాడట. భోజనం, నీరు తీసుకోవాలని, టాయిలెట్‌ను వాడుకోవాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ వారి మాటను ఆర్యన్‌ ఖాన్‌ వినడం లేదు. తనకు ఆకలి వేయడం లేదని చెబుతున్నాడు. అలాగే, జైలులో ఆర్యన్‌ ఖాన్‌ నాలుగు రోజులుగా స్నానం చేయలేదు. ఆర్యన్‌ ఖాన్‌ గురించి షారుఖ్‌ జైలు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. ఆర్యన్‌ ఆరోగ్యం గురించి షారుక్‌ ఆందోళన చెందుతున్నారు. 


ముంబై తీరంలో ఇటీవల షిప్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగం వ్యవహారంలో విచారణ జరుపుతోన్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబై కేంద్ర కారాగారంలో ఉంటోన్న ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం ముంబైలోని ఓ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే, బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. అంతకుముందు, డ్రగ్స్‌ వ్యవహారంలో ఆర్యన్‌ ఖాన్‌ పాత్ర ఉందని విచారణలో తేలిందని కోర్టుకు ఎన్సీబీ తెలిపింది.


అర్బాజ్‌ ఖాన్‌తో పాటు అతడికి తెలిసిన పలువురి నుంచి ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కొనేవాడని పేర్కొంది. ఎన్సీబీ దాడులు జరిపిన సమయంలో అర్బాజ్‌ ఖాన్‌ బూట్ల నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఆర్యన్‌ ఖాన్‌ వద్ద డ్రగ్స్‌ కొనడానికి డబ్బు లేదని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకోలేదని.. అతడి వద్ద డ్రగ్స్‌ లేవని.. అతడు డ్రగ్స్‌ విక్రయించలేదని అన్నారు. అతడికి బెయిల్‌ ఇవ్వాలని కోరారు. 


డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖానే కీలకం

బెయిల్‌ ఇవ్వొద్దు: ఎన్‌సీబీ కౌంటర్‌

మాదకద్రవ్యాల అక్రమ సేకరణ, వినియోగానికి సంబంధించిన కుట్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో బయటపడిందని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) వెల్లడించింది. ఆర్యన్‌ఖాన్‌ తరఫు న్యాయవాదులు దాఖలుచేసిన బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ముంబైలోని నార్కోటిక్స్‌ వ్యవహారాల ప్రత్యేక కోర్టుని కోరింది. తొలిసారి వేసిన ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు గతవారం కొట్టివేయగా, ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. ముంబైనుంచి గోవాకు వెళుతున్న ప్రత్యేక నౌకలో రేవ్‌పార్టీ చేసుకున్న కేసులో ఈ నెల మూడోతేదీన ఆర్యన్‌ ఖాన్‌ సహా 20 మందిని డ్రగ్స్‌తో సహా ఎన్‌సీబీ అరెస్టుచేసిన విషయం తెలిసిందే. వీరంతా ప్రముఖ సినీ, వ్యాపార కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందులో ఆర్యన్‌ఖాన్‌ని ప్రధాన నిందితునిగా (ఏ-1) చూపించారు. 


ఈ కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న పిటిషన్‌పై బుధవారం ఎన్‌సీబీ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. ‘‘అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాకు చెందిన కొందరు వ్యక్తులతో ఆర్యన్‌కు నేరుగా సంబంధాలు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముంబైకు డ్రగ్స్‌ రావడంలో అతడే కీలకంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల్లోనే జరగడంపై మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నాం’’ అని వివరించారు. నిందితుల్లో ఎవరినీ వేరుగానూ, వ్యక్తిగతంగానూ చూడటానికి వీల్లేదని, ఆర్యన్‌ సహా అరెస్టు అయిన అందరికీ డ్రగ్స్‌ దందాతో ఏదోమేరకు సంబంఽధమూ, కుమ్మక్కూ ఉన్నాయని వాదించారు. ‘‘అర్జబ్‌ ఖాన్‌ (ఏ-2) నుంచి ఆర్యన్‌ డ్రగ్స్‌ను సేకరించాడు. అరెస్టు సమయంలో అర్జబ్‌ వద్ద ఆరు గ్రాముల చరాస్‌ రకం మాదకద్రవ్యం లభ్యమైంది. అతడికి వాటిని ఆచిత్‌ కుమార్‌, శివరాజ్‌ హరిజన్‌ అందించారు’’ అని వివరించారు. మొత్తం వ్యవహారంలో అతిలోతైన, తీవ్రమైన నేరానికి ఆర్యన్‌ఖాన్‌ పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-14T07:01:12+05:30 IST