దాబాలో దర్జాగా !

ABN , First Publish Date - 2022-01-18T04:59:04+05:30 IST

జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవున మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. హైవేపై దాబాల్లో నిబందనలకు విరుద్ధంగా మద్యం సిట్టింగ్‌ చేయిస్తున్నారు.

దాబాలో దర్జాగా !
పొందుర్తి సమీపంలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలు

- దాబాల్లో మద్యం సిట్టింగ్‌లు

- దొంగచాటున మద్యాన్ని సరఫరా చేస్తున్న వైన్స్‌ నిర్వాహకులు

- విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్‌ షాపులు

- జిల్లాలో ప్రధాన రహదారుల వెంబడి 100కి పైగా దాబాలు

- మద్యం మత్తులో గొడవలకు దిగుతున్న మందుబాబులు

- పొందుర్తిలోని ఓ దాబాలో మద్యం మత్తులో ఓ రౌడీ షీటర్‌ గన్‌తో హల్‌చల్‌

- మద్యం తాగి హైవేపై వాహనాలు నడుపుతున్న వైనం.. అతివేగంతో ప్రమాదాలు

- దాబాలపై కానరాని సంబంధిత శాఖ అధికారుల దాడులు

- మామూళ్ల మత్తులో పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు


కామారెడ్డి, జనవరి 17(ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవున మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. హైవేపై దాబాల్లో నిబందనలకు విరుద్ధంగా మద్యం సిట్టింగ్‌ చేయిస్తున్నారు. పీకల లోతు వరకు మద్యం తాగి ఆ మద్యం మత్తులో గొడవలకు దిగుతున్నారు. తాజాగా కామారెడ్డి మండలం పొందుర్తి హైవే వద్ద ఉన్న ఓ దాబాలో మద్యం మత్తులో గన్‌తో హల్‌చల్‌ చేసి పలువురికి గన్‌ గురిపెట్టి  బెదిరింపులకు పాల్పడ్డాడు. వాహనదారులు సైతం ఈ మద్యాన్ని తాగుతూ అతివేగంగా వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెళ్లడవుతోంది. దాబాల్లో అడపాదడపగా పోలీసులు తనిఖీలు చేయడం నిర్వాహకులు ఇచ్చే మామూళ్ల మత్తులో చూసీ చూడనట్లుగా ఉంటున్నట్లు విమర్శలు వెలువెతుత్తున్నాయి. జిల్లా పరిధిలో సుమారు 200 కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారి విస్తరించి ఉంది. భిక్కనూరు మండలం బస్వాపూర్‌ నుంచి మొదలుకొని దగ్గి జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా నిజాంసాగర్‌ నుంచి మద్నూర్‌ వరకు ఆరు లైన్ల జాతీయ రహదారులు ఉండడంతో భారీ వాహనాలతో పాటు చిన్న వాహనాలు అతి వేగంగా వెళ్తుంటాయి. ఈ రహదారుల వెంబడి సుమారు 100 వరకు దాబాలతో పాటు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ మధ్య కాలంలో హైవే దారి పొడవునా బెల్ట్‌ షాపులు వెలిశాయి. 

దాబాల్లో జోరుగా మద్యం సిట్టింగులు

బస్వాపూర్‌ నుంచి దగ్గి వరకు, నిజాంసాగర్‌ నుంచి మద్నూర్‌ వరకు, రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉండే దాబాల్లో జోరుగా మద్యం సిట్టింగులు కొనసాగుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కామారెడ్డి జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలే దాబాల్లో మద్యం సిట్టింగ్‌ కు కారణమని ఆరోపణలు ఉన్నాయి. దాబాల్లో మద్యం తాగాడానికి ఎలాంటి అనుమతులు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యాన్ని దాబాల్లో పూర్తిగా నిషేధించారు. ఈ మధ్యకాలంలో దాబాల్లో మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాబాల్లోని కొందరు నిర్వాహకులు స్థానిక గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి మద్యాన్ని తీసుకోస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొంత మంది వాహనదారులు మద్యం బాటిళ్లను బయట నుంచి తెచ్చుకొని తాగుతున్నారు. మద్యం మత్తులో వాహనాలను వాహనదారులు అతి వేగంతో జాతీయ రహదారిపై నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరగడమే కాకుండా అనేక మంది క్షతగ్రాతులు అవుతున్నారు.

మద్యం మత్తులో తగదాలు

జిల్లాలోని పలు దాబాల్లో జోరుగా మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ శివారులతో పాటు ఆయా మండల కేంద్రాలకు సమీపంలో ఉండే జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట రహదారులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ దాబాల్లో గ్రూపులు, గ్రూపులుగా సిట్టింగ్‌లు వేస్తూ మందుబాబులు పీకల్లోతుదాక మద్యం తాగుతున్నారు. దాబా నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతూ సిట్టింగ్‌లు చేయిస్తున్నారు. మందు బాబులు పీకల్లోతు వరకు తాగి గొడవలకు దిగుతున్నారు. కొన్ని సందర్భాలలో మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి పొందుర్తి వద్ద ఓ దాబాలో మద్యం సిట్టింగ్‌ వేసిన రెండు గ్రూపులు గొడవకు దిగాయి. ఇందులో ఓ రౌడీషీటర్‌ రివాల్వర్‌తో కొంతమంది తలపై ఎక్కుపెట్టి బెదిరించిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. సదరు రౌడీ షీటర్‌ ఎలాంటి లైసెన్స్‌లేని గన్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అడపాదడపగా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల తనిఖీలు

జాతీయ రహదారికి ఇరువైపుల ఉండే దాబాలపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. దాబాల్లో మద్యం సిట్టింగ్‌లు కాని, మద్యం అమ్మకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. కానీ జిల్లా పరిధిలో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఉన్న దాబాల్లో పోలీసు, ఎక్సైజ్‌ అఽధికారులు అడపాదడపగా తనిఖీలు చేస్తున్నారు. దాబాల్లోకి పోలీసులు కానీ, ఎక్సైజ్‌ అధికారులు కానీ తనిఖీలకు వెళ్తే ముందస్తుగానే సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీంతో దాబాల నిర్వాహకులు అప్రమత్తం అవుతున్నారు. రాత్రి సమయంలో మద్యం సిట్టింగ్‌లను దాబాల నిర్వాహకులు చేయిస్తున్నట్లు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దాబాల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు ఆయా శాఖల అధికారులు తలొగ్గుతూ సక్రమంగా తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ దాబాల్లో మద్యంలో తాగి వాహనదారులు అతివేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2022-01-18T04:59:04+05:30 IST