Aug 3 2021 @ 00:28AM

చిరంజీవి చెప్పడంతో నటనపై దృష్టి పెట్టాను!

‘‘ఒకరోజు చిరంజీవిగారు ‘నువ్వు నటుడిగా పనికొస్తావు. ఆ విధంగా ముందుకెళ్లు’ అని చెప్పడంతో నటనపై దృష్టి పెట్టాను. మోహన్‌ ఈ చిత్రకథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. వెంటనే ‘మీరు నటించాలి’ అన్నాడు. సినిమాలో అతనికి తండ్రిగా నటించా. అప్పట్నుంచీ మామధ్య తండ్రీతనయుల అనుబంధం ఉంది’’ అని కోటి అన్నారు. డా. మోహన్‌, నవీన్‌చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1997’. శ్రీకాంత్‌ అడ్డాల ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నటన, నిర్మాణం, దర్శకత్వం... అన్ని పనులు చేయడం కష్టం. మోహన్‌గారు తొలి చిత్రానికి ఇవన్నీ చేశారంటే గ్రేట్‌. కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. సినిమా తప్పకుండా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశాననే తృప్తి కలిగింది’’ అని నవీన్‌ చంద్ర చెప్పారు. ‘‘బర్నింగ్‌ ఇష్యూను తీసుకుని సినిమా చేశా’’ అని మోహన్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, నిర్మాణం: మీనాక్షీ రమావత్‌.