‘వంతెన’ంత కష్టం!

ABN , First Publish Date - 2021-12-09T05:08:02+05:30 IST

కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కలిపే రేణిగుంట-ముద్దనూరు వయా కడప, కమలాపురం, ఎర్రగుంట్ల జాతీయ రహదారి-716 ఇది. కడప-కమలాపురం మధ్య పాపాఘ్ని నదిపై 533.24 మీటర్ల పొడవు, 7.50 మీటర్ల వెడల్పుతో వంతెన 1977లో నిర్మించారు.

‘వంతెన’ంత కష్టం!
పాపాఘ్ని నదిపై వంతన కూలడంతో కమలాపురం రైల్వే బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు, ప్రజలు

వరదకు కూలిన పాపాఘ్ని బ్రిడ్జి

కడప-కమలాపురం మధ్య నిలిచిపోయిన రవాణా

నది దాటాలంటే రైల్వే బ్రిడ్జి శరణ్యం

విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణులకు తప్పని అవస్థలు

20 రోజులైనా ప్రత్యామ్నాయం చూపని అధికారులు

బడి, ఆస్పత్రులకు వెళ్లాలంటే 8-12 కి.మీలు నడవాల్సిందే

ఖాజీపేట మీదుగా వెళ్లాలంటే 45 కి.మీలకు పైగా ప్రయాణం


 వరద ఉధృతికి పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెన కూలి కడప-కమలాపురం, ఎర్రగుంట్ల మధ్య రాకపోకలు ఆగిపోయి ఇరవై రోజులు కావస్తున్నా ప్రత్యామ్నాయం చూపకపోవడంతో నది దాటేందుకు జనం రైల్వే బ్రిడ్జిని ఆశ్రయిస్తున్నారు. రైల్వే వంతెనపై నది దాటి స్వగ్రామాలకు చేరాలంటే 8-12 కి.మీలకు పైగా నడక తప్పడం లేదు. పైగా నదితీరంలో అడవిలో నడవాలి. వల్లూరు మోడల్‌ స్కూల్‌లో చదివే కమలాపురం ప్రాంత విద్యార్థులు, కమలాపురంలో డిగ్రీ, ఇంటర్‌ చదివే వల్లూరు మండల విద్యార్థులు, కడప నుంచి కమలాపురానికి విధులకు వెళ్లే ఉద్యోగులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులకు నది దాటాలంటే ‘వంతెన’ంత కష్టాలు తప్పడం లేదు. కూలిన బ్రిడ్జి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నడిచేందుకైనా అవకాశం కల్పించాలని జనం విన్నవిస్తున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కలిపే రేణిగుంట-ముద్దనూరు వయా కడప, కమలాపురం, ఎర్రగుంట్ల జాతీయ రహదారి-716 ఇది. కడప-కమలాపురం మధ్య పాపాఘ్ని నదిపై 533.24 మీటర్ల పొడవు, 7.50 మీటర్ల వెడల్పుతో వంతెన 1977లో నిర్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి ప్రాంతాలు సహా కడప జిల్లాలో కమలాపురం, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కొండాపురం, ముద్దునూరు, మైలవరం, పెద్దముడియం ప్రాంతాలకు చెందిన జనం పాపాఘ్ని నదిపై బ్రిడ్జి దాటాల్సిందే. గత నెల 16 నుంచి 19వ తేది వరకు కురిసిన జవాద్‌ తుఫానతో వరద పోటెత్తడంతో ఈ బ్రిడ్జి 13 వెంట్స్‌ (ద్వారాలు) కూలిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి.


పాపాఘ్ని దాటాలంటే రైల్వే బ్రిడ్జి ఎక్కాల్సిందే

కమలాపురం, ఎర్రగుంట్ల ప్రాంత ప్రజలు ఏ అవసరం వచ్చినా కడపకు రావాల్సిందే. ఆ మండలాల్లో పని చేసే మెజార్టీ మండల, సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కడప నగరంలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. వల్లూరు మండలానికి చెందిన వల్లూరు, గోటూరు, తప్పెట్ల, లేబాక, పెద్దపుత్త, దుగ్గాయపల్లె గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులు కమలాపురంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదువుతున్నారు. అలాగే.. కమలాపురం, చిన్నచెప్పలి, పెద్ద చెప్పలి, ఎర్రగుంట్ల, చదిపిరాళ్ల, మాచిరెడ్డిపల్లె గ్రామాలకు నుంచి 125 మంది విద్యార్థులకుపైగా వల్లూరు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో  చదువుతున్నారు. విద్యకోసం విద్యార్థులు, వివిధ పనులతో ప్రజలు, వైద్యం కోసం రోగులు కడప, కమలాపురం వెళ్లాలంటే ప్రమాదం అని తెలిసినా రైల్వేవంతనపై నుంచి పాపాఘ్ని దాటుతున్నారు. బ్రిడ్జి మధ్యలో వెళ్తున్నప్పుడు రైళ్లు వస్తే వంతెనను ఆనుకొని భయంతో వణికిపోతున్నారు. రోజూ 10-12 కి.మీలు కాలినడక తప్పడం లేదు. రైల్వే బ్రిడ్జి దిగువన ఉద్యోగుల వాహనాలతో పార్కింగ్‌ స్థలంగా మారింది. కూలిపోయిన బ్రిడ్జి దగ్గర తాతాల్కిక మరమ్మతులు చేసి నడిచేందుకైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.


వ్యయ ప్రయాసలెన్నో

కమలాపురం, ఎర్రగుంట్ల ప్రాంతాల జనం పాపాఘ్ని వంతెన దాటి కడప, వల్లూరుకు వెళ్లాలంటే గతంలో అరగంట నుంచి గంట సమయం, రూ.20-30లకు మించి చార్జి లేదు. ఇప్పుడు అటు నుంచి ఏటూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప, వల్లూరుకు రావాలన్నా.. ఇటు వైపు నుంచి నది అవలి వైపు గ్రామాలకు వెళ్లాలన్నా 45-50 కి.మీలు చుట్టు తిరిగి వెళ్లాలి. రవాణాకు గంటన్నర నుంచి రెండు గంటల సమయం, చార్జీలు రాను పోను రూ.100కు పైగా ఉంటుంది. అయినా సకాలంలో బస్సులు ఉండడం లేదు. దీంతో ప్రమాదం అని తెలిసినా రైల్వే బ్రిడ్జిపైన రాకపోకలు సాగిస్తున్నారు.


ఇలా చేస్తే..

బ్రిడ్జి వంద మీటర్లు (13 వెంట్స్‌) కూలిపోయింది. వచ్చే ఏడాది మే, జూన వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం తక్కువ. దీంతో కమలాపురం వైపున కూలిపోయిన 100 మీటర్ల వంతెనను ఎర్రమట్టి (గరుసు)తో పూర్తిగా నింపేసి.. దానిపై తాతాల్కిక రోడ్డును ఏర్పాటు చేస్తే కాలినడక, ఆటో, ద్విచక్ర వాహనాలు, కార్లు రాకపోకలు సాగించవచ్చని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిధులిస్తే ఒకట్రెండు రోజుల్లో కూలిన వంతెన భాగం పూడ్చివేసి తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయవచ్చు. ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి, తక్షణ పనులు చేసేందుకు నిధులు కావాలి. కూలిన బ్రిడ్జి దిగువన పైపులు వేసి తాత్కాలిక వంతెన నిర్మించ వచ్చని ఇంజనీర్లు అంటున్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు చేపడితే పాపాఘ్ని నది ఇరువైపుల ఉన్న వివిధ గ్రామాల వాసులకు కొంతైనా రవాణా కష్టాలు తీరుతాయి. 


తాత్కాలిక వంతెనకు టెండరు పిలిచాం

- విజయభాస్కరరెడ్డి, డీఈఈ, నేషనల్‌ హైవే, కడప

పాపాఘ్ని నది వంతెన వరదకు వంద మీటర్లకు పైగా కూలిపోయింది. ఆ బ్రిడ్జి రవాణాకు అనుకూలంగా లేదు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా పైపులు వేసి తాత్కాలిక వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లతో టెండర్లు పలిచాం. శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి రూ.40-50 కోట్లతో డీపీఆర్‌ తయారు చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. 


ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం

- డి.దినే్‌షరెడ్డి, ఇంటర్‌ సీఈసీ, ఏపీ మోడల్‌ స్కూల్‌, వల్లూరు 

మాది కమలాపురం. వల్లూరు ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ సీఈసీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నా. పాపాఘ్ని నదిపై వంతెన కూలిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. కళాశాలకు వెళ్లాలంటే నది దాటాల్సిందే. రైల్వే బ్రిడ్జిపైన నది దాటి 8 కి.మీలు నడిచి కాలేజీకి వెళ్లాల్సి వస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. 


నాన్న తోడు వస్తున్నారు

- సాయిలక్ష్మి, 9వ తరగతి, ఏపీ మోడల్‌ స్కూల్‌, వల్లూరు 

వల్లూరు ఏపీ మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాను. కమలాపురం నుంచి వెళ్లి వచ్చేవాళ్లం. వంతెన తెగిపోవడం వల్ల 15 రోజులు బడికి వెళ్లలేదు. హాజరు తగ్గుతోంది. లెసన కూడా మిస్‌ అవుతున్నాను. ప్రమాదమని తెలిసి కూడా రైల్వే బ్రిడ్జిపై నది దాటుతున్నాం. నాన్న తోడుగా వస్తున్నారు.


వంతెన కష్టాలు తీర్చాలి

- సుకన్య, బీఎస్సీ-ఎంపీసీఎస్‌, కమలాపురం 

వల్లూరు మండలం పెద్దపుత్త స్వగ్రామం. కమలాపురంలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నా. రోడ్డు వంతెన కూలిపోవడంతో పాపాఘ్ని నది దాటలేని పరిస్థితి. కాలేజీకి వెళ్లాలంటే రైల్వే బ్రిడ్జిపై నుంచి నది దాటుతున్నాం. బస్సులో రావాలంటే 50 కి.మీలు రెండు గంటలు ప్రయాణించాలి. రానుపోనూ 100 కి.మీలు అవుతుంది. రూ.200 చార్జీ వస్తుంది. తాత్కాలిక మరమ్మతులు చేసి మాకు ఈ కష్టాల నుంచి విముక్తి కలిగించాలి. 


కూతురిని పిలుచుకు రావడానికి వెళ్తున్నా

- నడిపెన్న, లేబాక గ్రామం, వల్లూరు మండలం 

ఎర్రగుంట్ల మండలం ఎరువులపాటి గ్రామంలో నా కూతురు ఉంది. పిలుచుకు రావడానికి వెళ్తున్నాను. వంతెన తెగిపోవడం వల్ల కడప, ఖాజీపేట, ఏటూరు, కమలాపురం మీదుగా సుమారు 50 కి.మీలు వెళ్లి రావాల్సి ఉంది. చార్జీలు కూడా రూ.వందల్లో ఉంటుంది. రైల్వే వంతెన మీదుగా నది దాటితే అరగంటలో చేరుకుంటాం. తప్పని పరిస్థితుల్లో రైల్వే బ్రిడ్జిపైన నడక సాగిస్తున్నాం.



Updated Date - 2021-12-09T05:08:02+05:30 IST