ఎన్నికలు లేనట్లే

ABN , First Publish Date - 2021-05-05T06:14:16+05:30 IST

సహకార సంఘాల ఎన్నికల విషయంలో కోర్టులో వ్యాజ్యం తేలలేదు. దానికి కరోనా సెకెండ్‌ వేవ్‌ అడ్డంపడింది.

ఎన్నికలు లేనట్లే
కల్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం

  1. సహకార పదవులు కోరుకున్నవారికి నిరాశే
  2. హైకోర్టులో తేలని వ్యాజ్యం 
  3. ముంచుకొచ్చిన కరోనా
  4. సహకార ఎన్నికలకు సిద్ధం కాని ప్రభుత్వం
     

కర్నూలు (అగ్రికల్చర్‌), మే 4: సహకార సంఘాల ఎన్నికల విషయంలో కోర్టులో  వ్యాజ్యం తేలలేదు. దానికి    కరోనా సెకెండ్‌ వేవ్‌ అడ్డంపడింది.  దీంతో ఇప్పటిదాకా  సహకార సంఘాల ఎన్నికల్లో సత్తా చాటి పాలకవర్గ పగ్గాలు  తమ అనుచరులకు అప్పగించాలని  ఎత్తులకు పై ఎత్తులు వేసిన రాజకీయ నాయకులు నిరాశ పాలయ్యారు.   ఎన్నికల నిర్వహణకు సిద్ధం లేనట్లు ఇప్పటికే ప్రభుత్వం  సంకేతాలు ఇస్తోంది. మరోవైపు సహకార సంఘాల్లో పాలన సంస్కరణలు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ కలిసి సహకార సంఘాలకు ఇప్పట్లో  ఎన్నికలు లేనట్లేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు గత జనవరిలో అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను ప్రభుత్వం నియమించింది.  ఈ కమిటీలు వచ్చే జూలై వరకు కొనసాగనున్నాయి. అయితే.. మే, జూన్‌ నెలల్లో రెండు దశలుగా సహకార ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌ను కూడా అధికారులు సిద్ధం  చేశారు.  పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా వీటిని తమ అనుకూల వ్యక్తులకు అప్పజెప్పాలని  ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకని ఎన్నికల కంటే ముందే సంస్కరణలు తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2018 నుంచి సహకార ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వం పాత పాలకవర్గాలనే ఏడాదిన్నర పాటు పొడిగించగా.. ప్రస్తుత జగన్‌ ప్రభుత్వం వాటిని వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా 2019 ఆగస్టులో సహకార సంఘాల్లో  త్రిసభ్యకమిటీలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా మార్కెటింగ్‌ కమిటీలకు ఏడుగురు సభ్యులతో నామినేటెడ్‌ కమిటీలను నియమించింది. వాటి గడువు ఈ ఏడాది జనవరితో ముగిసింది. అదే కమిటీలను మళ్లీ పొడిగించాలని అప్పట్లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. స్థానిక ఎన్నికల కోడ్‌  అమలులో  ఉన్నందువల్ల అధికారేతర కమిటీల కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో ఉన్న 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు జాయింట్‌ కలెక్టరును పర్సన్‌ ఇన్‌చార్జిగా నియమించింది. ఎన్నికల నిర్వహణలో వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ వ్యాజ్యం  హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ  చెప్పాలని సహకార శాఖను ఇటీవల హైకోర్టు వివరణ కోరింది. దీనికి  ప్రభుత్వం   గడువు కోరింది.  సంస్కరణలు తెచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపడానికి అవసరమైతే.. రాష్ట్రస్థాయిలో ఆర్డినెన్స్‌ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతోందని అధికారులు తెలిపారు.   కొవిడ్‌  ఉధృతి  తగ్గేవరకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలపై కోర్టు తీర్పు ఇంకా రాకపోవడంతో అధికార పార్టీ నేతలు ఎన్నికల ఊసెత్తడం లేదు. ఎన్నికలు నిర్వహించడానికి .. కనీసం 45 రోజులు ముందస్తు కసరత్తు చేయాల్సి ఉంటుందని సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  కరోనా తీవ్రత తగ్గకుండా  ఎన్నికలు జరిపే అవకాశం లేదని వారు చెబుతున్నారు. మొత్తంపైన  ఎన్నికల మీద ఆశలు పెంచుకున్న రాజకీయ నాయకులు, వారి అనుచరులు డీలా పడిపోయారు.  





 



Updated Date - 2021-05-05T06:14:16+05:30 IST