దళితులు కాంగ్రెస్‌వైపు నిలవడంతోనే వైసీపీకి ఓటమి భయం

ABN , First Publish Date - 2021-04-12T08:36:23+05:30 IST

ఆయన ఆరు పర్యాయాలు ఎంపీ..

దళితులు కాంగ్రెస్‌వైపు నిలవడంతోనే వైసీపీకి ఓటమి భయం
చింతా మోహన్‌

కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ చింతా మోహన్‌


తిరుపతి(ఆంధ్రజ్యోతి): ఆయన ఆరు పర్యాయాలు ఎంపీ.. ఒకసారి కేంద్ర మంత్రి. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా పదోసారి మళ్లీ బరిలో నిలిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినా హంగూ, అర్భాటాలు లేకుండా అతడే ఒకసైన్యంలా ప్రచారాలు సాగిస్తున్న డాక్టర్‌ చింతా మోహన్‌ ఆంధ్రజ్యోతితో ‘ఫటాఫట్‌’గా మాట్లాడారు. 


ఉప ఎన్నిక గెలుపుపై వైసీపీ కలవరపడటానికి కారణం?   

45 రోజులుగా ప్రచారంలో ఉన్నా. గతంలో వలే దళితులు కాంగ్రెస్‌కు దగ్గరైపోయారు. కరపత్రంలో ఇందిరమ్మ ఫొటో, చేయి గుర్తును చూసి కళ్లకు అద్దుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి రావడం వల్ల దళిత వర్గాల్లో అంతర్గతంగా ఆందోళన నెలకొంది. కాంగ్రెస్‌ ఉన్నప్పుడు మా గళానికి బలం ఉండేదని వారు భావిస్తున్నారు. అందుకే వైసీపీ కలవరపడుతోంది. 


కాంగ్రెస్‌ గెలిస్తే తిరుపతిని రాజధాని చేస్తామంటున్నారు. ఈ హామీ కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందా?

తిరుపతి అంటే నాకు చాలా ఇష్టం. కేంద్రమంత్రిగా, ఎంపీగా చాలా చేశాను. ఇంకా చేస్తాను. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే తిరుపతిని రాజధానిగా ప్రకటింపచేస్తా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం భెల్‌ పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవులను తీసుకొచ్చి తీరుతా. 


తిరుపతి అభివృద్ధిపై మీలాగా ఇతర ఎంపీలు ముద్ర వేసుకోలేక పోవడానికి కారణం?

నేను ఎంపీగా ఉన్నప్పుడు ఉండే ప్రధానిమంత్రులందరితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఆ పరిచయాలే నా నియోజకవర్గ అభివృద్ధికి పనికొచ్చాయి. 


కాంగ్రెస్‌ పనైపోయిందని ప్రచారం చేసేవారికి మీ సమాధానం?

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. విభజన గాయాన్ని బూచిగా చూపించి కాంగ్రెస్‌ పనైపోయిందని కొందరు కుహనా మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. ఇలాంటివారికి త్వరలోనే సమాధానం దొరుకుతుంది. నరేంద్ర మోదీని త్వరలోనే ఇంటికి పంపుతాం. 


9 సార్లు పోటీచేసిన మీరు ఈసారి గడప గడపకు తొక్కాలని ఎందుకు అనుకున్నారు?

భారతదేశానికి ప్రత్యామ్నాయం అవసరం. దేశం కోసం నా పోరాటం తప్పదు. నేను చూడని పదవులు కాదు. కాంగ్రెస్‌ పార్టీలోని కార్యకర్తలను భావితరాల నాయకులుగా తీర్చిదిద్దుతాం. 


తిరుపతి పార్లమెంట్‌ ప్రజా నాడి ఏవిధంగా ఉంది?

ప్రజల్లో ఆర్థిక ఒత్తిడి పెరిగిపోయింది. ఎర్రగడ్డలు తప్ప తక్కినవన్నీ పెరిగిపోయాయి. ఖర్చులు రెట్టింపయ్యాయి. మోయలేని పన్నుల బాదుడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు. మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అంటున్నారు. 


ధర్మయుద్ధం చేస్తే మేమే గెలుస్తామంటున్నారు. అది జరుగుతుందంటారా?

ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మ యుద్ధం చేయనివ్వను. స్థానిక ఎన్నికల్లో చేసిన అరాచకాలు ఉప ఎన్నికల్లోనూ చేయాలని చూస్తే కుదరదు. ఒక వేళ చేయాలని ప్రయత్నించినా తగిన మూల్యం చెల్లించుకుంటారు.

Updated Date - 2021-04-12T08:36:23+05:30 IST