రోడ్‌ డాక్టర్‌ భార్యగా అది నా బాధ్యత!

ABN , First Publish Date - 2021-07-21T05:30:00+05:30 IST

ఆయనకు ఎండా, వానా... ఏవీ పట్టవు. రోడ్డు మీద గుంతలు కనిపిస్తే చాలు. వాటిని పూడ్చేవరకూ నిద్రపోరు. ఉద్యోగానికి తయారై వెళ్లినట్టు, ప్రతి రోజూ ఉదయాన్నే బయల్దేరి వెళ్లి, సాయంత్రానికి తిరిగొస్తూ ఉంటారు.

రోడ్‌ డాక్టర్‌ భార్యగా అది నా బాధ్యత!

రిటైర్‌ అయ్యాక, హాయిగా ఇంటిపట్టున కాలు మీద కాలేసుకుని కాలక్షేపం చేయవలసిన ముది వయసులో....ఎండనకా, వాననకా రోడ్ల మీద గుంతలు పూడుస్తూ, డస్సిపోయి ఇంటికొస్తున్న భర్తను చూసి ఆమె మనసు విలవిల్లాడిపోయేది. ఆయన ఆరోగ్యం ఎక్కడ కుదేలవుతుందోననే ఆందోళనే తప్ప, పింఛను సొమ్మంతా రోడ్ల పాలు చేస్తున్నారని ఆమె ఇసుమంతైనా బాధ పడలేదు. అందరికీ మేలు జరగాలని తపించే భర్త కష్టంలో తానూ భాగస్వామిగా మారి, రోడ్‌ డాక్టర్‌ కాట్నం గంగాధర్‌ తిలక్‌కు తగిన భార్యగా భేష్‌ అనిపించుకున్నారు  కాట్నం వెంకటేశ్వరి. ఆవిడ నవ్యతో చెప్పిన కబుర్లివి!


యనకు ఎండా, వానా... ఏవీ పట్టవు. రోడ్డు మీద గుంతలు కనిపిస్తే చాలు. వాటిని పూడ్చేవరకూ నిద్రపోరు. ఉద్యోగానికి తయారై వెళ్లినట్టు, ప్రతి రోజూ ఉదయాన్నే బయల్దేరి వెళ్లి, సాయంత్రానికి తిరిగొస్తూ ఉంటారు. ఒకటా, రెండా... 11 ఏళ్లుగా ఆయన తన జీవితాన్ని తాను నమ్మిన సిద్ధాంతానికే అంకితం చేశారు. ఆయనకు దాతృత్వం ఎక్కువ. కష్టంలో ఉన్నవాళ్లకు ఆర్థిక సాయం చేసిన సందర్భాలు బోలెడు. రోడ్‌ డాక్టర్‌గా పేరు తెచ్చుకోక మునుపు, మా పెళ్లైనప్పటి నుంచీ ఎంతో మందికి డబ్బు సహాయం చేయడం నేను చూశాను. వాళ్లు డబ్బు తిరిగిచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయినా సరే! తన అలవాటు మానుకునేవారు కాదు. ప్రారంభంలో పిల్లల భవిష్యత్తు గురించి కొంత కంగారుపడేదాన్ని. క్రమేపీ అలవాటైపోయింది. 


ఆయన వృత్తిగా మారింది!

రైల్వేస్‌లో 35 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా రిటైర్‌ అయ్యారాయన. అయినప్పటికీ ఖాళీగా కూర్చోకుండా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అయితే ఓ రోజు హఠాత్తుగా ఆ ఉద్యోగం కూడా మానేశారు. ఇక ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంటారులే అనుకున్నాను. కానీ మరుసటి రోజు నుంచీ ఆఫీసుకి వేళకు ఇంటి నుంచి బయల్దేరి వెళ్తూ, సాయంత్రానికి అలసిపోయి ఇల్లు చేరుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారని ఆరా తీస్తే, అసలు విషయం చెప్పుకొచ్చారు. అసలే పెద్ద వయసు, పైగా అలవాటు లేని పని. ఆయన ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా కాంగారు పడేదాన్ని. వద్దని కూడా వారించేదాన్ని. కానీ రోడ్ల గుంతల కారణంగా జరిగే ఆక్సిడెంట్లను ఆయన కళ్లారా చూసిన వైనాన్ని నాకు వివరించేవారు. నిజమే! అలా గుంతలు పూడ్చడం ద్వారా కొంతమేరకైనా యాక్సిడెంట్లను తగ్గించినవాళ్లం అవుతాం. కానీ అందుకోసం ఆయన అంతలా కష్టపడడం నాకు నచ్చేది కాదు. నా మాట వినడం లేదని, అమెరికా నుంచి మా అబ్బాయిని పిలిపించాను. ఆయనకు నెమ్మదిగా నచ్చజెప్పమని అబ్బాయికి చెప్పి, ఆయనతో పాటు పంపించాను. దార్లో గుంత కనిపించగానే ఆయన కారు దిగేసి దాన్ని పూడ్చే పనికి పూనుకోవడంతో బాబు ఆయనతో ఘర్షణ పడ్డాడు. కానీ అదే సమయానికి స్కూటర్‌ మీద వెళ్తూ, అదే గుంతలో జారి పడి ఓ వ్యక్తి దెబ్బలు తగిలించుకోవడంతో, మా బాబు మారు మాట్లాడలేకపోయాడు. తండ్రి చేత పని మాన్పిద్దామని వెళ్లిన మా అబ్బాయి, చివరకు ఆయనకు పనిలో సహాయపడ్డాడు. ఇంటికొచ్చి నాకు విషయం చెప్పడంతో, మా వారి పనికి అడ్డుపడడం సబబు కాదని అనిపించింది. 


ఆయనతో పాటే నేనూ...

గుంతలు పూడ్చే పనిలో ఉంటే ఆయనకు సమయం తెలిసేది కాదు. ఉదయం వెళ్తే, సాయంత్రానికి తిరిగొచ్చేవారు. గుంతలు పూడ్చడం కోసం దూరదూరాలు ప్రయాణం చేసేవారు. కాబట్టి ఆయనకు భోజనం వెంట పంపడం మంచిది అని నిర్ణయించుకున్నాను. క్యారీజీతో పాటు, బిస్కెట్లు, కాఫీ లాంటివీ ఇచ్చి పంపుతూ ఉంటాను. అయినప్పటికీ ఒక్కోసారి వాటినీ తినకుండా వెనక్కి తెస్తూ ఉంటారు. పనిలో పడితే ఆయనకు ఆకలిదప్పులు ఉండవు. రాళ్లు పగిలే మే ఎండల్లో కూడా ఇదే తంతు. కనీసం ఎండా కాలంలోనైనా ఉదయం 11 గంటలకంతా పని ముగించుకుని ఇంటికి వచ్చేయమని చెబుతూ ఉండేదాన్ని. కానీ వినే వారు కాదు. మిట్టమధ్యాహ్నం ఎండ వేడి గుంతలు పూడ్చడానికి అనువైనదనీ, ఆ వేడికి తారు చక్కగా అంటుకుని, గుంత మెరుగ్గా పూడుకుంటుందనీ అనేవారు. అలా ఒక్కరే  కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక, సమయానికి ఆయనకు భోజనం, నీళ్లు అందించడం కోసం వెంట వెళ్లడం మొదలుపెట్టాను. అలా ఆయనతో పాటు వెళ్తూ, సంచులు అందిస్తూ చేతనైనంత సాయం చేయడం మొదలుపెట్టాను. కార్లో భోజనం క్యారేజీతో పాటు, తారు కలిపిన హాట్‌ మిక్స్‌ బస్తాలు, పలుగు, పార పనిముట్లు ఎప్పుడూ ఉండేవి. ఆయన గుంతలు పూడ్చే లక్ష్యం కేవలం సిటీకే పరిమితం కాదు. ఆఖరుకు పని మీద ఏదైనా ఊరు వెళ్తున్నా, దార్లో గుంత కనిపించిందంటే కారుకు బ్రేకులు పడిపోయేవి. ప్రయాణం ఆలస్యమవుతుందేమో? అంటే వినే వారు కాదు. 


అమెరికా వెళ్లినా, బాధ్యత మరువలేదు!

గుంతలు పూచ్చే క్రమంలో దుమ్ము గాల్లోకి లేస్తూ ఉంటుంది. ఆ దుమ్ము ఊపిరితిత్తుల్లోకి చేరుకుని ఆయనకు అలర్జీ మొదలైంది. దాంతో ఆరోగ్యం దెబ్బతింది. అయినా గుంతలు పూడ్చడం మానకపోతుంటే, ఇలా కాదని, అమెరికాలో ఉన్న మా అబ్బాయి దగ్గరకు పంపించేశాను. అక్కడికి అయిష్టంగా వెళ్తూ, తన బాధ్యతను మా మరిదికి అప్పగించి వెళ్లారాయన. తాను మొదలుపెట్టిన పని మధ్యలో ఆగకూడదనే తన తమ్ముడికి అప్పజెప్పారు. అమెరికా నుంచి తిరిగొచ్చాక తిరిగి కొనసాగించారు. ఓపిక ఉన్నంతకాలం ఈ పని కొనసాగించాలనేది ఆయన నిర్ణయం. రోడ్‌ డాక్టర్‌ భార్యగా ఆయన్ను అనుసరించడమే నా బాధ్యత!

గోగుమళ్ల కవిత


కాకినాడ దగ్గరున్న ఉప్పాడ మా స్వగ్రామం. మాకొక పాప, బాబు. అమ్మాయి సరళ గృహిణి. బాబు రవి కిరణ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాతో పాటు మా ఇద్దరు పిల్లలూ తండ్రి పనికి మద్దతు పలికారు. రిటైర్మెంట్‌ డబ్బంతా ఈ పనికే ఖర్చయిపోతూ ఉండడంతో కొన్ని సందర్భాల్లో ఇల్లు గడవడం కష్టంగా మారేది. ఎవరైనా రిటైర్మెంట్‌ డబ్బుతో ఇల్లు కొనుక్కుంటారు. కానీ మాకు అలా వీలు పడలేదు. గుంతలు పూడ్చడానికి అవసరమైన హాట్‌ మిక్స్‌ను కొనడం ఒక ఎత్తైతే, దాన్ని మోసుకెళ్లడం మరో ఎత్తుగా మారింది. దాంతో మా అబ్బాయి మాకో ఇల్లు, కారు కొనిపెట్టాడు. దాంతో అద్దె ఖర్చు మిగిలింది, శ్రమ తగ్గింది.


మర్చిపోలేని అనుభవాలు

2015లో ప్రముఖ హిందీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌తో ఓ హిందీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. వేదిక మీద మా వారిని ఆయన నిజమైన హీరోగా పొగిడారు. పెద్ద వయసులో మేం చేస్తున్న నిస్వార్థ సేవకు మమ్మల్ని అభినందించి మారుతి ఆల్టో కారును బహూకరించారు. ఆ సహాయాన్ని కూడా మా వారు స్వీకరించడానికి వెనకాడితే, ‘‘సొంత అన్నయ్య బహుకరించినా ఇలాగే వ్యతిరేకిస్తారా?’’ అంటూ అమితాబ్‌ ఆయన్ను బలవంతంగా ఒప్పించారు. ఈ మధ్యే గవర్నర్‌ తమిళసై స్వయంగా పిలిచి, మా దంపతులను సత్కరించారు. ఇవన్నీ మర్చిపోలేని అనుభవాలు.

Updated Date - 2021-07-21T05:30:00+05:30 IST