ఆశల వెట్టిచాకిరీ

ABN , First Publish Date - 2021-10-18T04:37:27+05:30 IST

గ్రామస్ధాయిలో ఎలాంటి ఆరోగ్య సేవలు అందాలన్నా ఆశ కార్యకర్తలే ముందుంటారు.

ఆశల వెట్టిచాకిరీ
ఆందోళన కార్యక్రమంలో ఆశలు (ఫైల్‌)

శ్రమ కొండంత- వేతనం గోరంత

వైద్యశాఖలో వీరే కీలకం

క్షేత్రస్ధాయిలో అన్ని పనులు చేయాల్సిందే

షోకాజ్‌ నోటీసులతో సతమతం

భద్రత కల్పించలంటూ వేడుకోలు

పలు డిమాండ్లతో ఉద్యమ బాట


నెల్లూరు (వైద్యం) అక్టోబరు 17 : గ్రామస్ధాయిలో ఎలాంటి ఆరోగ్య సేవలు అందాలన్నా ఆశ కార్యకర్తలే ముందుంటారు. క్షేత్రస్ధాయిలో నిరంతరం పర్యటిస్తూ ప్రజారోగ్యానికి వారు కృషి చేస్తున్నారు.  చేసే పని కొండంత.. వారికి ఇచ్చేది  మాత్రం గోరంతగా ఉంది. కేవలం కేంద్ర కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ఆశ కార్యకర్తలు చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు వీరి చేత కూడా చేయిస్తున్నది పోనీ ఆశలకు మంచి వేతనాలు ఇస్తున్నారని భావించినా వీరి వేతనాలు బెత్తెడే.  నెలకు రూ. 10వేల వేతనాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అందులో కేంద్రం వాటా రూ.7వేల వరకు ఉండగా, రాష్ట్రం చెల్లిస్తుంది రూ. 3వేలే. ఈ వేతనాలు కూడా సకాలంలో వస్తాయన్న నమ్మకం లేదు. కేంద్రం వాటా ఒకసారి చెల్లిస్తే, రాష్ట్రం వాటా మరోసారి చెల్లిస్తోంది. రెండు కలిపి ఏనాడూ చెల్లించరు. అది ప్రతి నెలా వస్తుందని భావించినా పప్పులో కాలేసినట్లే. ప్రతి 3 నెలల బడ్జెట్‌కు ఆధారంగా వీరికి వేతనాల చెల్లింపులు ఉంటాయి. ఇదిలా ఉంటే వారి ఉద్యోగాలకు గ్యారంటీ కూడా ఉండదు. అధికారులు చెప్పిన మాట వినని ఆశ కార్యకర్తలను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.  ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పనిభారం కష్టమో నష్ణమో భరిస్తూ వెట్టి చాకిరీకి గురవుతున్నారు.  ఇకనైనా ప్రభుత్వం వీరి సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. 


కరోనాలోనూ ఎన్నో కష్టాలు 


 ప్రస్తుత కరోనా పరిస్ధితిలోనూ ఆశలకు కష్టాలు తప్పటం లేదు. జిల్లాలో 2280 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇంటింటికి తిరిగి జ్వరపీడితులను గుర్తించారు. వీరికి ఎలాంటి గ్లౌజులు, శానిటైజర్లు, మాస్క్‌లు వంటి కనీస భద్రత కిట్‌లను కూడా వైద్యశాఖ అందచేయలేదు. దీంతో ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాక్సినేషన కార్యక్రమంలోనూ వీరే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక కుటుంబ నియంత్రణ కార్యక్రమాల నుంచి చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయటంలోనూ వీరిపాత్ర ఎంతో ఉంది. అలాగే విషజ్వరాలు ప్రబలకుండా గ్రామ స్ధాయిలో ఆశలు స్ధానికులను చైతన్యం చేయాల్సి ఉంది. గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించటం, ఎలాంటి సమస్యలు లేకుండా చూడటం వంటి బాధ్యతలు వీరు చేపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా ఆయా ప్రాంతాల్లో పర్యటించి సేవలు అందిస్తున్నారు. హోం ఐసోలేషనలో ఉన్న కరోనా బాధితులకు విస్తృత వైద్య సేవలు అందించిన చరిత్ర ఆశలకు ఉంది. ఇటీవల మెగా వాక్సినేషనలో ఉన్న 9 మంది ఆశలు దోమల నివారణ కార్యక్రమంలో పాల్గొన లేదని షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఒకేసారి రెండు పనులు ఎలా చేయాలో అధికారులే చెప్పాల్సి ఉంది. 


ఉద్యమాల దిశగా..


 ప్రస్తుతం ఆశలు అన్ని వైద్య పథకాల అమలులో ఎంతో కష్ట పడుతున్నారు. ఎక్కువభారం వీరిపై వేసి పైస్ధాయి సిబ్బంది తప్పించుకుంటున్నారని తెలిసింది. ఈ నేపధ్యంలో పెరిగిన పనికి తగ్గట్లు తమకు రూ. 21 వేల వేతనాలు చెల్లించాలని ఆశలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం సంక్షేమ పధకాలు ఆశలకు వర్తించకుండా చర్యలు తీసుకుం టున్న నేపధ్యంలో ఈ చర్యలు ఆశలు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు. తాము రెగ్యులర్‌ ఉద్యోగులను కాకపోయినా చివరకు రేషన కార్డు కూడా తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కరోనా కాలంలో ఆశలకు రూ. 50 లక్షల బీమా కల్పించాలని డి మాండ్‌ చేస్తున్నారు. అలాగే రిటైర్మెంట్‌ తరువాత రెగ్యులర్‌ ఉద్యోగుల్లాగా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలన్న డిమాండ్‌ వీరి నుంచి ఎక్కువగా వినిపిస్తున్నది. ఆయా సమస్యల పరి ష్కారం కోసం కొంత కాలంగా రాష్ట్ర స్ధాయి ఉద్యమాలను ఆశలు చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 


రూ. 21వేలు వేతనాలు ఇవ్వాలి 


గ్రామ స్ధాయిలో ఎన్నో వైద్య సేవలు అందిస్తున్నాం అయితే వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారు. ఎప్పటి నుంచో రూ.21 వేల వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం చేసేది లేక ఉద్యమబాట పడుతున్నాం.

 -విజయలక్ష్మి, ఆశ కార్యకర్త, ఇస్కపల్లి



చాకిరీ చాలా ఎక్కువ 


మాకు ఎన్నో పనులు అప్పచెబుతున్నారు. ప్రతి వైద్య ఆరోగ్య కార్యక్రమం మేమే చేయాలని చెబుతున్నారు. గతంలో కొన్ని పనులకు మాత్రమే చేసేలా కార్యాచరణ ఉండేది. ఇపుడలాకాదు. పనిభారం చాలా ఎక్కువయింది.  మా కష్ణాన్ని గుర్తించమని చెబుతున్నాం.

- మధుసూదనమ్మ, ఆశ కార్యకర్త, కోడూరు



డిమాండ్‌ ల పరిష్కారానికి పోరాటం 


మా డిమాండ్‌ పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తొలగించాలని చూడటం మంచి పనికాదు. మాకిచ్చే వేతనాలు చాలా తక్కువ. ఇక రేషన కార్డు వంటివి తొలగిస్తే ఇంకెలా బతకాలి. రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కల్పించాలి. 

-భాగ్యరేఖ ఆశ కార్యకర్త, నెల్లూరు

Updated Date - 2021-10-18T04:37:27+05:30 IST