పారిశ్రామికవాడలో దుమ్మురేపిన కారు

ABN , First Publish Date - 2020-12-05T06:14:33+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం(ఆర్సీపురం), భారతీనగర్‌, పటాన్‌చెరు డివిజన్ల ఓట్ల లెక్కింపును చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియంలో నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపును ప్రారంభమైంది.

పారిశ్రామికవాడలో దుమ్మురేపిన కారు
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటి వద్ద మహిళల సంబరాలు

3 గులాబీ ఖాతాలోకే

రికార్డు మెజార్టీతో పటాన్‌చెరు డివిజన్‌లో మెట్టు కుమార్‌ విజయం

ఆర్సీపురంలో పుష్ప, భారతీనగర్‌లో సింధు జయకేతనం


పటాన్‌చెరు/రామచంద్రాపురం, డిసెంబరు 4 : జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం(ఆర్సీపురం), భారతీనగర్‌, పటాన్‌చెరు డివిజన్ల ఓట్ల లెక్కింపును చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియంలో నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపును ప్రారంభమైంది. రెండు రౌండ్లుగా ఓట్ల లెక్కింపును నిర్వహించగా తొలి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రామచంద్రాపురం మొదటి రౌండ్‌ ఫలితం రాగా తరువాత భారతీనగర్‌, పటాన్‌చెరు ఫలితాలను వెల్లడించారు. మూడు డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. 


చక్రం తిప్పిన ఎన్నికల మాంత్రికుడు హరీశ్‌రావు

మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ సాధించిన విజయంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. మూడు డివిజన్ల ఇన్‌చార్జిగా వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావుకు దుబ్బాక ఎన్నికల తరువాత వెనువెంటనే వచ్చిన గ్రేటర్‌ ఎన్నికలు సవాలుగా నిలిచాయి. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లను గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. దుబ్బాక విజయంతో దూకుడు మీద ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో భారీ అంచనాలతో అధికార పార్టీకి సవాలు విసిరారు. ఎన్నికల మాంత్రికుడిగా పేరున్న హరీశ్‌రావు అటు క్లాస్‌, ఇటు మాస్‌ ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయం సాఽధించారు. బీజేపీ అభ్యర్థులు, నాయకులు సైతం ఫలితాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ప్రచార నిర్వహణ, ఓటర్లను ఆకట్టుకోవడంలో తడబడ్డారు. టీఆర్‌ఎస్‌ ఏ ఒక్క చిన్న అవకాశం వదలకుండా మంత్రి ఆదేశాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు ఏకమై పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని సాగించారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు పదే పదే చేసిన సూచనలు ఫలించాయి. గ్రేటర్‌లోనే అన్ని డివిజన్ల కన్నా పోలింగ్‌ అధిక శాతం నమోదు చేసి అగ్రభాగాన నిలిచారు. దీంతో భారీ మెజార్టీతో ముగ్గురు అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ దరిదాపులో సైతం లేదని రుజువు చేశారు.  మొదట బీజేపీ దూకుడు ప్రదర్శించి టీఆర్‌ఎ్‌సకు సవాలు విసిరారు. దీంతో ఎన్నికలు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నంతగా ప్రచారం సాగింది. తటస్థ ఓటర్లు సైతం బీజేపీ వైపు మొగ్గుచూపడంతో పోలింగ్‌ లెక్కలు అంచనాలకు అందలేదు. భారతీనగర్‌, రామచంద్రాపురం డివిజన్లలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేశారు. పటాన్‌చెరు ఫలితంపై సైతం అధికార టీఆర్‌ఎ్‌సలో ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల రోజు ఓట్లు పడిన విధానం విశ్లేషించుకుని మూడు డివిజన్లలో సైతం విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాల వెల్లడి తరువాత ఊహించని విధంగా భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 


పాత ప్రత్యర్థుల్లో సింధూదే పైచేయి

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలోనూ భారతీనగర్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వి.సింధూఆదర్శరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సి.గోదావరిఅంజిరెడ్డి బరిలో నిలిచారు. వారి మధ్య హోరాహోరి పోటి నెలకొనగా చివరకు సింధూ ఆదర్శరెడ్డి గోదావరి అంజిరెడ్డిపై 153 ఓట్లతో గెలుపొందారు. ప్రస్తుతం కూడా ఇదే డివిజన్‌ నుంచి వీరిద్దరూ పోటీ పడ్డారు. అయితే ఈ దఫా కూడ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావించారు. కానీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పెద్దఎత్తున డివిజన్‌లో ప్రచారం చేపట్టడంతో అంచనాలు తలకిందులయ్యాయి. విశ్లేషకుల అంచనాలకు అందని మెజార్టీతో మరోసారి గోదావరి అంజిరెడ్డిపై సింధూఆదర్శరెడ్డి ఘన విజయం సాధించారు. 


మరోసారి ఆర్సీపురం కార్పొరేటర్‌గా పుష్ప

జీహెచ్‌ఎంసీ ఏర్పడిన సమయంలో రామచంద్రాపురం ఒకే డివిజన్‌ ఉండేది అప్పట్లో పుష్పానగేశ్‌ రామచంద్రాపురం తొలి కార్పొరేటర్‌గా గెలుపొందారు. తరువాత ఈ డివిజన్‌ భారతీనగర్‌, రామచంద్రాపురం డివిజన్లుగా విభజింపబడింది. గత ఎన్నికల్లో పుష్పకు కార్పొరేటర్‌గా నిలుచునేందుకు పార్టీ అవకాశం కల్పించలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ గెలుపునకు సహకరించారు. అంజయ్యయాదవ్‌ గత ఎన్నికల్లో 5 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్‌ కార్పొరేట్‌ను కాదని టీఆర్‌ఎస్‌ పార్టీ పుష్పనే బరిలోకి దించింది. ప్రస్తుతం ఆమె గత రికార్డును బ్రేక్‌ చేస్తూ 5,769 మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొంది రికార్డు సాధించింది.


కార్యకర్తల సమష్టి కృషితోనే అఖండ విజయం

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

పటాన్‌చెరు, డిసెంబరు 4 : పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ సాఽధించిన అఖండ విజయానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన కృషి ప్రధాన కారణమన్నారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి మూడు డివిజన్ల విజయం కోసం శ్రమించామని చెప్పారు. ఐదేళ్లలో మూడు డివిజన్ల పరిధిలో జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాలుగా టీఆర్‌ఎ్‌సపై దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచి పెట్టుబడులకు స్వర్గధామంలా తయారు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. తెలంగాణాకు గుండెకాయలాంటి నగరంలో చిచ్చుపెట్టేందుకు చూసిన శక్తులకు తావులేదన్నారు. మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఽధన్యవాదాలు తెలిపారు. 


ఎంపీ ఇన్‌చార్జి డివిజన్‌లో అత్యధిక మెజార్టీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు 4 : ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న పటాన్‌చెరు డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెట్టు కుమార్‌యాదవ్‌కు 6,082 ఓట్ల భారీ మెజార్టీ లభించింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఓటమి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవమే మిగిల్చింది. అయితే వెంటనే తేరుకున్న ఆయన మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో డివిజన్‌లో పార్టీ అభ్యర్థి కుమార్‌ యాదవ్‌ విజయం కోసం శ్రమించారు. కార్యకర్తలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులతో తరచూ మాట్లాడి, భరోసా నింపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందిన ఈ డివిజన్‌ను ఈసారి టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంలో సఫలీకృతుడయ్యారు. 


అభివృద్ధి, సంక్షేమంతోనే అద్భుతమైన గెలుపు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, డిసెంబరు 4 : సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోనే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మూడు డివిజన్లలో అద్భుతమైన మెజార్టీతో గెలుపొందడం సాధ్యమైందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఫలితాలను ముందుగానే ఊహించామన్నారు. తప్పుడు ప్రచారాలు, గోబెల్స్‌ పుకార్ల వల్ల ప్రజలను మార్చలేమని కొందరు తెలుసుకోవాలని హితువు పలికారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రజలను చీల్చేందుకు చేసిన కుట్రలను పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు వమ్ము చేశారన్నారు. మూడు డివిజన్లలో విజయం కోసం అనుక్షణం పాటుపడిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మూడు డివిజన్ల అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌తో పాటు విజయానికి బాటలు వేసిన ప్రజానాయకుడు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూక్‌హుస్సేన్‌, అటవీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింత ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



Updated Date - 2020-12-05T06:14:33+05:30 IST