అరకొరత వేతనాలతో ‘ఆశా’..నిరాశ

ABN , First Publish Date - 2021-05-17T04:36:02+05:30 IST

పనిని బట్టి పారితోషికమని ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అమలు చేయకపోవడంతో ఆశా కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

అరకొరత వేతనాలతో ‘ఆశా’..నిరాశ
రోగులకు మందులు పంపిణీ చేస్తున్న ఆశా కార్యకర్త

- క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశాలకు తప్పని నిరాశ

- ఆర్థిక ఇబ్బందులతో సతమతం

- గర్భం దాల్చిన నుంచి డెలివరీ వరకు సేవలు

- వివిధ సర్వేల్లోనూ వినియోగం

బెజ్జూరు, మే 16: పనిని బట్టి పారితోషికమని ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అమలు చేయకపోవడంతో ఆశా కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం మొదలుకుని రాత్రి, పగలు అనకుండా సేవలు చేస్తుంటారు. పురిటినొప్పులతో బాధపడుతున్న సమాచారం అందితే వెంటనే 108వాహనానికి సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తారు. కరోనా సమయంలోనూ వారి విధులను సక్రమంగా నిర్వహించిన ఆశాలకు వేతనాల్లో నిరాశే మిగిలుతోంది. గర్భిణులను గుర్తించి వారి వెంట ఆస్పత్రులకు వెళ్తారు. ఇలా ఒక్కరికి నాలుగు దఫాలుగా వైద్య పరీక్షలు చేయిస్తారు. కాన్పు అయ్యే వరకు వెంట ఉండి సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగితేనే ఒక్కరికైనా, నలుగురికైనా రూ.7500మించకుండా పారితోషికం అందజేస్తారు. ఒకవేళ వారు పనిచేసే ప్రాంతంలో ఆ నెలలో గర్భిణుల ప్రసవాలు లేనట్లయితే రూ.5వేల నుంచి 6వేల లోపు అందిస్తారు.

కొవిడ్‌ సమయంలోనూ..

గతేడాది నుంచి కొవిడ్‌ తీవ్రత మొదలై ప్రస్తుతం కేసుల తీవ్రత విపరీతంగా ఉన్నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకొచ్చి సేవలు అందిస్తున్నారు. వైరస్‌కు గురైన వారి ఇళ్ల వద్దకు వెళ్లి మందులు అందించి జాగ్రత్తలు చెబుతున్నారు. ఇంటింటికి వెళ్లి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేపడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇంట్లో చిన్న పిల్లలకు, కుటుంబానికి దూరం ఉంటూ సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ సేవలు అందిస్తున్నా ప్రత్యేక పారితోషికం ఇవ్వడం లేదని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వేలన్నింటికీ వారే..

జిల్లాలోని 15మండలాల పరిధిలో 803 ఆశా కార్యకర్తల పోస్టులు మంజూరు ఉండగా 761మంది  పని చేస్తున్నారు. ఇంకా 42మంది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ సర్వేలు నిర్వహించినా మొదట చేపట్టేది ఆశాలే. మలేరియా, కుష్టు, క్షయ, బీపీ, మదుమేహం, క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధులకు సంబంధించిన సర్వేలు నిర్వహిస్తుంటారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేసే సమయంలోనూ ఆరోగ్య సహాయకురాలికి అందుబాటులో ఉండి సహకరిస్తారు. డ్వాక్రా, ఇతర సమావేశాలకు హాజరై ఆరోగ్య సలహాలిచ్చి అవగాహన కల్పిస్తారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా డెంగీ, సీజనల్‌ వ్యాధులపై అవగాహన పెంచడానికి ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారితో ఉండి సహకరిస్తారు. దోమలు వృద్ధి చెందకుండా, నీటి నిల్వ ఉండకుండా వారానికోసారి నీటిని పారపోసేలా ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగిస్తారు. అయినా ఆశాల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాలకు నెలకు రూ.10వేల వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆరోగ్యపరంగా ఎన్ని సర్వేలు అప్పచెబుతున్నా అన్నీ చేస్తున్నామని అయినా తమపై కనికరం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ పంజా విసురుతున్న సమయంలోనూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సేవలందిస్తున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ వేతనాలు పెంచాలని కోరుతున్నారు.

వేతనం పెంచాలి..

- ఆత్రం సరోజన, ఆశా కార్యకర్త

ప్రసవాలు జరిగితేనే రూ.7500 పారితోషికం అందుతుంది. లేనట్లయితే రూ.5నుంచి 6వేల మధ్యలో పారితోషికం అందుతుంది. పనిని కుదించి రూ.10వేల వరకు వచ్చేలా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ సమయంలో విధులు నిర్వహిస్తున్న తమకు ప్రత్యేక పారితోషికం చెల్లించాలి. కొవిడ్‌ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సేవలందిస్తున్నాం. తమ సేవలు గుర్తించి తగిన వేతనం ఇవ్వాలి.

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం..

- డాక్టర్‌ బాలు, జిల్లా వైద్యాధికారి, ఆసిఫాబాద్‌

ఆశా కార్యకర్తలపై పనిభారం పెరిగింది వాస్తవమే. గర్భిణులకు సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేస్తున్నారు. వారి శ్రమను గుర్తించాం. ప్రస్తుతం కొవిడ్‌ సేవలు అందించడంలో ముందుంటున్నారు. వారి వేతనాల పెంపుకోసం గతంలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఆశాల సమస్యల పరిష్కారం కోసం మరోసారి ప్రభుత్వానికి విన్నవిస్తాం.

Updated Date - 2021-05-17T04:36:02+05:30 IST