ఐపీఎల్ జరిగే ఛాన్స్‌లు వందశాతం ఉన్నాయి.. కానీ..: నెహ్రా

ABN , First Publish Date - 2020-04-08T22:08:20+05:30 IST

కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి కారణంగా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, యూఈఎఫ్‌ఏ యూరో వంటి పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు

ఐపీఎల్ జరిగే ఛాన్స్‌లు వందశాతం ఉన్నాయి.. కానీ..: నెహ్రా

ముంబై: కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి కారణంగా ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, యూఈఎఫ్‌ఏ యూరో వంటి పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఇష్టపడే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఈ ఏడాది జరుగుతుందా.. లేదా.. అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే టీం ఇండియా మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా మాత్రం ఐపీఎల్ జరిగే ఛాన్స్‌లు వందశాతం ఉన్నాయని అంటున్నారు. కానీ, కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తేనే.. అది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.


ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సింది. కానీ, కరోనా ప్రభావం పెరిగిపోవడంతో.. టోర్నీని ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్ కూడా ఇదే రోజున ముగియనుంది. కానీ, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తుందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా ఐపీఎల్ ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. 


టోర్నమెంట్‌ను మే లేదా జూన్ నెలలో నిర్వహించాలనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే కరోనా వైరస్ పరిస్థితుల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారు. కానీ, నెహ్రా మాత్రం ఆక్టోబర్ నెలాఖరులలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని అప్పటివరకూ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ‘‘ఆగస్టులో కూడా ఐపీఎల్ జరిగే అవకాశాలు చాలా తక్కువ.. ఎందుకంటే ఆ నెలలో వర్షాలు కురిసి చాలా మ్యాచ్‌లు రద్దవుతాయి. కాబట్టి ఆక్టోబర్ నెలాఖరులో టోర్నీ జరగడానికి 100 శాతం అవకాశాలు ఉన్నాయి’’ అని నెహ్రా పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-08T22:08:20+05:30 IST