అశోక్‌గజపతికి అవమానం

ABN , First Publish Date - 2021-06-17T13:06:29+05:30 IST

కేంద్ర మాజీమంత్రి, సింహాచల దేవస్థానం..

అశోక్‌గజపతికి అవమానం

మంత్రి వద్దన్నారు.. మర్యాద చేయలేం!

సింహాచలంలో అశోక్‌గజపతికి అవమానం 

కరోనా పేరుతో పూర్ణకుంభ స్వాగతానికీ నో 

ఆలయంలో ఎలాంటి మర్యాదలూ అందని వైనం 

ముఖం చాటేసిన దేవదాయ కమిషనర్‌, ఈవో


సింహాచలం: కేంద్ర మాజీమంత్రి, సింహాచల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు అవమానం ఎదురైంది. బుధవారం ఆయన.. కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుతో కలసి సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎలాంటి మర్యాదలూ అందలేదు. ఆలయ అధికారు లు పూర్ణకుంభ స్వాగతం పలకలేదు. దేవదాయ శాఖ కమిషనర్‌ పడాల అర్జునరావు సింహగిరిపై కాటేజీలో, దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ నగరంలోనే ఉన్నప్పటికీ అశోక్‌ గజపతిరాజును మర్యాద పూర్వకంగానైనా పలకరించలేదు. ఆలయ భోగ మండపం నుంచి అశోక్‌గజపతిరాజు స్వామి వారి దర్శనం చేసుకోగా, అర్చకులు పర్యవేట్టాన్ని చుట్టకపోవడంపై ప్రశ్నించారు.


కరోనా కారణంగా పూర్ణకుంభ స్వాగతం పలకలేదని, తమ శాఖ మంత్రి వద్దని ఆదేశించడంతోనే పర్యవేట్టం చుట్టలేదని ఆలయ అధికారులు బదులిచ్చారు. పాలకమండలి చైర్మన్‌, న్యాయాధీశులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు పర్యవేట్టంగా శేషవస్త్రాన్ని మర్యాదపూర్వకంగా తలకు చుట్టడం ఆలయ ఆచారం. అశోక్‌గజపతిరాజు ప్రశ్నించిన తర్వాత మాత్రమే ఆయనకు పర్యవేట్టం చుట్టారు. అనంతరం అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందువులను బిచ్చగాళ్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. దేవాలయం చిల్లర కొట్టుకాదని, వాటితో వ్యా పారం చేయాలనుకోవడం దారుణమన్నారు.


ఇటీవల అప్పన్న ప్రసాదాల ధరలు పెంచడం సరికాదన్నారు. దేవదాయ శాఖ మంత్రి నోటి వెంట అసభ్యకర పదజాలం రావడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని తమ ఇలవేల్పు పైడితల్లమ్మను ప్రార్థించానన్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చేసిన ప్రకటనపై స్పందిస్తూ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తే ఏ కోర్టులోనైనా ప్రభుత్వం గెలుస్తుందన్నారు. వాహనమిత్ర పథకానికి దేవదాయ శాఖ నుంచి రూ.49లక్షలు మళ్లించడం క్షమార్హం కాదన్నారు.

Updated Date - 2021-06-17T13:06:29+05:30 IST