ఇమ్రాన్‌ఖాన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్

ABN , First Publish Date - 2021-03-07T01:36:39+05:30 IST

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. నరేంద్రమోదీ స్టేడియంలో

ఇమ్రాన్‌ఖాన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్

అహ్మదాబాద్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. నరేంద్రమోదీ స్టేడియంలో తాజాగా ముగిసిన చివరి టెస్టులో అశ్విన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్‌లో 3, రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.


సిరీస్ ఆసాంతం అత్యద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. టెస్టుల్లో అశ్విన్‌కు ఇది ఎనిమిదో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఫలితంగా పాక్ లెజండరీ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ సరసన చేరాడు. ఇమ్రాన్ తన టెస్టు కెరియర్‌లో 8సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు.  


ఈ సిరీస్‌లో అశ్విన్ 181 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అలాగే, మొత్తంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను మూడుసార్లు తీసుకున్నాడు. టెస్టుల్లో అత్యధికసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను అందుకున్న బౌలర్లలో శ్రీలంక లెజండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ముందు వరుసలో ఉన్నాడు. 61 సిరీస్‌లలో 11సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు కైవసం చేసుకున్నాడు.


రెండో స్థానంలో దక్షిణాఫ్రికా గ్రేట్ కలిస్ ఉన్నాడు. 61 సిరీస్‌లలో కలిస్ 9సార్లు ఈ ఘనత సాధించాడు. ఇమ్రాన్‌ఖాన్ 28 సిరీస్‌లలో 8సార్లు ఈ అవార్డు అందుకోగా, అశ్విన్ తన 30వ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకుని ఇమ్రాన్ సరసన చేరాడు.  

Updated Date - 2021-03-07T01:36:39+05:30 IST