కోవిడ్-19: సందిగ్ధంలో ఆసియాకప్ టోర్నమెంట్

ABN , First Publish Date - 2020-03-27T01:01:12+05:30 IST

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో

కోవిడ్-19: సందిగ్ధంలో ఆసియాకప్ టోర్నమెంట్

న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కూడా ఉంది. మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. కరోనా కారణంగా తొలుత ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఐపీఎల్‌ జరుగుతుందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ మరో టోర్నమెంట్‌పై కూడా పడింది. 


ఆసియా క్రికెట్‌ కౌన్సిల్(ఏసీసీ) నిర్వహించే ఆసియా కప్‌-2020పై ఇప్పుడు కరోనా ప్రభావం పడింది. నిజానికి ఈ ఏడాది టోర్నమెంట్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించాలని తొలుత భావించారు. కానీ, భారత క్రికెట్ జట్టు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో పర్యటించేది లేదని తేల్చి చెప్పడంతో వేదికను యూఏఈకి మార్చారు. దీంతో టోర్నమెంట్ సజావుగా సాగుతుందని అంతా భావించారు.


అయితే కరోనా వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యంలో టోర్నమెంట్‌ వేదిక ఎక్కడ నిర్వహించాలనేది సమస్య ప్రధానంగా మారింది. దీనిపై ఏసీసీ కమిటీ సభ్యులు సమావేశం కావాల్సి ఉంది. కానీ వేదిక విషయంలో ఎటువంటి నిర్ణయం  తీసుకోకుండానే ఏసీసీ సమావేశం వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేదికగా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏసీసీ అధికారులు చెబుతున్నారు.


అయితే 2016లో టీ-20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్‌ను కూడా పొట్టి ఫార్మాట్‌లోనే నిర్వహించారు. ఆ తర్వాత 2018లో యధావిథిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్‌ జరిగింది. ఈ రెండు టోర్నమెంట్‌లోనూ ఫైనల్స్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియా వేదికగా టీ-20 ప్రపంచకప్‌ జరుగుతున్న నేపథ్యంలో.. ఆసియా కప్‌ను మళ్లీ టీ-20 ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-03-27T01:01:12+05:30 IST