Abn logo
Oct 17 2021 @ 23:40PM

అడుగుకో గుంత.. ప్రమాదాల చింత

గుంతలు ఉన్న రోడ్లలో వాహనదారుల ఇక్కట్లు

వాహనదారులను హడలెత్తిస్తున్న నగర రోడ్లు 

కడప(మారుతీనగర్‌), అక్టోబరు 17: నిత్యం వచ్చిపోయే వాహనాలతో ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది. తెల్లారింది మొదలు రాత్రి పదింటిదాకా ఆ రోడ్డు వాహనాల రాకపోకలతో గోలగోలగా ఉంటుంది. ఆ దారి గుండా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం కూడా కడపలో ఉన్న సమయంలో ఆ దారి నుంచి వెళ్లాల్సి వుంటుంది. కానీ అక్కడ ఏర్పడిన గుంతలను పూడ్చడంలో శ్రద్ధ చూపడం లేదు. అదే నగర నడిబొడ్డున ఉన్న సీఎస్‌ఐ పాఠశాల ఎదురుగా ఉన్న రోడ్డు. 

ఈ రోడ్డులో అడుగుకో గుంత ఏర్పడి వాహనదారులను సర్కస్‌ ఫీట్లు చేయిస్తోంది. లక్షల మంది తిరిగే ఈ రోడ్లు ఇలా ఉండడంతో ‘ఇవేమి రోడ్లురా బాబూ’ అంటూ వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడక తప్పదు. ఇదే దారిలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఏదేని అనారోగ్య సమస్యలతో వాహనాల్లో వచ్చే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అంతలా ఆ రోడ్డు అధ్వానంగా తయారైంది. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులకు ఆ గుంతలను బాగుచేద్దామన్న ఆలోచన లేకపోవడంతో నగర వాసులు గగ్గోలు పెడుతున్నారు.