నాది పసుపు రక్తం.. ఎప్పటికయినా టీడీపీ నుంచే పోటీ చేస్తా..

ABN , First Publish Date - 2020-02-03T23:03:47+05:30 IST

ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా... సినీరంగంలో అనేక పాత్రలు పోషించిన అశోక్‌కుమార్‌ పేరు వినగానే ‘ఒసేయ్‌ రాములమ్మ’లో దొర గుర్తుకొస్తాడు. తెరపై డిఫరెంట్‌ విలనిజాన్ని పండించిన ఆయన

నాది పసుపు రక్తం.. ఎప్పటికయినా టీడీపీ నుంచే పోటీ చేస్తా..

చంద్రబాబు పిలిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..

ఇతర పార్టీలు కూడా ఆఫర్ ఇచ్చాయి.. కానీ వాటిని కాదనుకున్నా..

2014లోనే పోటీ చేద్దామనుకున్నా.. కానీ ఆయన వద్దన్నారు..

2019లో పోటీ చేస్తే 12 ఏళ్లు పవర్‌లో ఉంటావని చెప్పారు..

రాములమ్మ సినిమా తర్వాత మహిళలు కొట్టడానికొచ్చేవారు..

చేయి చూసి జాతకం నాకు చెప్పడం వచ్చు..

భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసేవారి చేతులు మృదువుగా ఉంటాయి..

చేతి వేళ్లు ఇలా ఉంటే కచ్చితంగా హత్య చేస్తారు.. సినీ నటుల్లో అలాంటోళ్లను చూశా..

మీరు ఏం అడిగినా నాకు తెలీదని చెప్పు.. అని నా భార్య చెప్పింది..

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో నటుడు, నిర్మాత అశోక్‌కుమార్


ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా... సినీరంగంలో అనేక పాత్రలు పోషించిన అశోక్‌కుమార్‌ పేరు వినగానే ‘ఒసేయ్‌ రాములమ్మ’లో దొర గుర్తుకొస్తాడు. తెరపై డిఫరెంట్‌ విలనిజాన్ని పండించిన ఆయన చాలాకాలంగా సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆధ్మాత్మిక చింతనలో అంతగా ఎలా మునిగారు? గతంలో టీడీపీ టికెట్‌ ఇస్తానన్నా ఎందుకు పోటీ చేయలేదు? ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ 13-10-2018న నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలే ఇవి...

 

వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌! నమస్తే అశోక్‌గారూ...

నమస్కారమండీ!


ఒకప్పుడు అశోక్‌ అనగానే పెద్ద పెద్ద జులపాలు, గడ్డంతో భయపెట్టేవారు. ‘రాములమ్మ’ సినిమా తరువాత దొర అంటే ఇలానే ఉంటారు కాబోలు అనుకున్నారు. ఇప్పుడేమో సాధువులా మారిపోయారు. ఏంటి ఇంత మార్పు?

ఏం లేదు. అప్పుడు ఉడుకు రక్తం. నేను అవుట్‌స్పోకెనండీ. ఏదీ మనసులో దాచుకోను. ఉన్నది ఉన్నట్లు చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడిన ఫీలింగ్‌ వస్తుంది. ఇప్పుడు వయసు పెరిగింది. బాధ్యతలు పెరిగాయి. అనుభవం వచ్చింది. మనం అలా మాట్లాడి వాళ్లను బాధపెట్టే బదులు, సైలెంట్‌గా ఉండటం మంచిది కదా అనుకున్నాను.

 

సినిమాల్లో వేషాలు ఎందుకు తగ్గించేసుకున్నారు?

ముందు నుంచి నాకు సినిమాల పట్ల ఆసక్తి తక్కువే. అనుకోకుండా కోడిరామకృష్ణ గారు చేయమంటే చేశాను. నిజానికి ఇండస్ట్రీలో దెబ్బతిన్న తరువాత అది నాకు ఉపయోగపడింది. ప్రొడ్యూసర్‌గా, బిజినె్‌సమ్యాన్‌గా వెళ్లాలనే ఇంట్రెస్ట్‌. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మోకాలి నొప్పి మొదలయింది. మనం ఫిట్‌గా లేకుండా వేషం వేసి వాళ్లను బాధపెట్టడం ఎందుకు అని ఒకటి. అలాగే ఇండస్ట్రీ ఇంతకుముందులా లేదు. మనం ఇమడలేము అన్న దానితో దూరమయ్యా.

 

‘రాములమ్మ’లో విలన్‌ వేషం తరువాత బయటకు వెళితే ఆడవాళ్లు తిట్టడం జరిగిందట కదా..!

నా ముందు కాదు గానీ పక్కకెళ్లి తిట్టుకునే వాళ్లు. ఈటీవీలో సీరియల్‌ చేసిన తరువాత అది తగ్గిపోయింది. నెమ్మదిగా ఆడవాళ్లు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు.

 

మీరు రామానాయుడు మేనల్లుడు, బావమరిది. సినిమాల్లోకి ఎలా ఎంటరయ్యారు?

కాలేజ్‌ సమయంలోనే నాకు వ్యాపారంపైన ఆసక్తి. అప్పుడే సినిమాలు తీసుకోవడం, ఎగ్జిబిటర్‌గా చేశాను. తరువాత డిస్ట్రిబ్యూటర్‌ అయ్యాను. ఆ తరువాత ప్రొడ్యూసర్‌ అయ్యాను. అలా వచ్చాను. థియేటర్‌ను నాలుగేళ్లు సక్సెస్‌ఫుల్‌గా నడిపించాను. డిస్ట్రిబ్యూటర్‌గా మారిన తరువాత రామానాయుడు గారిని కలిశాను. అప్పుడాయన బాలకృష్ణతో ‘కథానాయకుడు’ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా ఇవ్వమని అడిగాను. ఆయనకు ఇవ్వడం ఇష్టంలేదు. ఎందుకంటే ఒక్కోసారి నష్టం వస్తుంది. నష్టం వస్తే మళ్లీ మనదగ్గరికే వస్తాడు. మనమే ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకని ఆయన దూరం పెట్టేవాడు. మనకు ఇదంతా తెలియదు. నాకెందుకు ఇవ్వరు? అని చిన్న కోపం ఉండేది. అదే టైంలో రెండు సినిమాలు వేరేవి తీసుకున్నాను.


అవి బాగా సక్సెస్‌ అయ్యాయి. అప్పుడు బాలకృష్ణ మార్కెట్‌ మూడున్నర లక్షలుండేది. ఒక్కజిల్లాకు. నేను వెళ్లి అడిగితే ఐదన్నాడు. సరే అని ఓ వారం తరువాత డబ్బులు పట్టుకుని వెళితే ఆరున్నర అన్నాడు. ఆ తరువాత ఏడు, తొమ్మిది అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ ‘వీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర’ సినిమా వచ్చింది. కోపంలో ఆ సినిమా కొన్నాను. ఒక్కజిల్లాకు 23 లక్షలు. చాలా పెద్ద అమౌంట్‌. నాయుడుగారికి షాక్‌. అంత రేటు పెట్టి ఎలా కొన్నాడు అని. ఆ సినిమాకు మినిమమ్‌ లాభంతో బయటపడ్డాను. ఆ తరువాత నాయుడుగారు యాక్సెప్ట్‌ చేశారు. ఆ నెక్ట్స్‌ ఒకేవారంలో మూడు సినిమాలు కొన్నాను.


టోటల్‌ లాస్‌. చిరంజీవి ‘చంటబ్బాయి’తో 14 లక్షలు పోయింది. నా లైఫ్‌లో అప్‌ అండ్‌ డౌన్స్‌ చాలా ఎక్కువ. కొన్నాళ్లు పోయాక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నా. వెంకటేశ్‌ ‘కలియుగ పాండవులు’ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. మామయ్య దగ్గరకు వెళ్లి అడ్వాన్స్‌ ఇచ్చా. నెక్ట్స్‌ సినిమా అశోక్‌ తీస్తున్నాడని అనౌన్స్‌ కూడా చేశాడు. కానీ తొమ్మిదో సినిమాగా రిలీజ్‌ అయింది. అది ‘రక్తతిలకం’ సినిమా. సినిమా బాగా కలెక్ట్‌ చేసింది. తరువాత ఆరునెలలకే మళ్లీ వెంకటేశ్‌తో ‘ధృవనక్షత్రం’ చేశాను. ఆ సినిమా బాగా హిట్టయింది. అప్పటి నుంచి గణపతిశాస్త్రిగారిని నమ్మడం మొదలయింది. ఆయనే కంచి స్వాముల వారి దగ్గరకు తీసుకెళ్లేవారు.


ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా?

100 శాతం జరుగుతాయి అనడం కరెక్ట్‌ కాదు. 80 శాతం వరకు నా విషయంలో జరిగాయి. ఆయన దగ్గరకు పెద్ద వాళ్లు వచ్చేవారు. సిటీలో పెద్ద వాళ్లంతా అక్కడికి వచ్చేవారు. అయితే కొన్నాళ్ల తరువాత నేనే దూరమయ్యాను. ఆ సమయంలోనే ఇవీవీతో ‘చెవిలో పువ్వు’ తీశాను. ఆ సినిమాతో మళ్లీ టేబుల్‌ టర్న్‌. ఫ్యాక్టరీలో కూడా లాస్‌ వచ్చింది. ఆ సమయంలో కెమెరామెన్‌ బిపిన్‌దాస్‌ పరిచయమయ్యారు. ఆయన ఒక కాయిన్‌ ఇచ్చారు. ఇప్పటికీ అది నా జేబులో ఉంది. ఆయన శ్రీకాళహస్తి టెంపుల్‌ వెళ్లమన్నారు. వెళ్లొచ్చాను. తరువాత మామయ్య దగ్గరికెళ్లి హైదరాబాద్‌ షిప్ట్‌ అయిపోతున్నాను అని చెప్పాను. ఒకసారి మీ అంకుల్‌ కాళ్లకు దండం పెట్టుకో అని విపిన్‌దాస్‌ అన్నాడు. నేను పెట్టలేదు. నాలుగు రోజులు ఆయన దగ్గరకు వెళ్లాను. వచ్చేశాను. బ్లెస్సింగ్స్‌ మాత్రం తీసుకోవడం లేదు. నాకు మనస్సు ఒప్పుకోవడం లేదు. చివరగా ఓ రోజు ‘మామయ్యా! నేను మద్రాసు వదిలి హైదరాబాద్‌ వెళ్లిపోతున్నాను అని కాళ్లకు దండం పెట్టాను. కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆయనకు కూడా కళ్లలో నీళ్లొచ్చాయి.


‘లేరా..లే’ అని లేపి చేతిలో డబ్బులు పెట్టి పంపించాడు. హైదరాబాద్‌ వచ్చాక రెంట్‌ కట్టడానికి డబ్బులు లేవు. ఫ్యామిలీని చీరాలలో పెట్టా. షిర్డీ వెళ్లొచ్చాక ‘మైనాడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ అని ఒక కంపెనీ ఉంది. మా ఫ్రెండ్స్‌ కంపెనీ అది. వాళ్ల పార్ట్స్‌ సేల్స్‌ చేస్తే కొంత డబ్బు వచ్చింది. తరువాత ఒక ఫ్లాట్‌ కొన్నాను. నెమ్మదిగా ఆర్థికంగా కోలుకున్నాను. తరువాత చాలా కంపెనీలు మొదలుపెట్టడం, లాస్‌ రావడం, అమ్మేయడం జరిగింది. చివరకు రియల్‌ ఎస్టేట్‌లో బాగా కలిసొచ్చింది.

 

నిర్మాత సి.కల్యాణ్‌ ఒక ప్రశ్న అడుగుతారట.

సి. కల్యాణ్‌ (ఫోన్‌లో) : ప్రభాస్‌ హీరోగా పెట్టి ‘ఈశ్వర్‌’ సినిమా తీశావు. ఆ తరువాత మళ్లీ సినిమాలు తీయడం లేదు. ఎందుకని? సినిమాల మీద విరక్తి వచ్చిందా? సినిమా ఇండస్ట్రీ మీద కోపమా? స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌గా ఉండాలని మాకు నేర్పావు. ఒక ఇష్యూ మీద స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌గా ఫైట్‌ చేసేటప్పుడు మాత్రం వాళ్ల కర్మకు వాళ్లను వదిలేస్తావు. ఇది ఎంతవరకు న్యాయం?

నిజానికి నేను ప్రభాస్‌తో సినిమా చేస్తానని అనుకోలేదు. ‘ప్రేమంటే ఇదేరా!’ అయిపోయిన తరువాత తరుణ్‌తో చేద్దామనుకున్నాను. రోజారమణి దగ్గరకు వెళ్లి అడిగితే చేద్దాం చేద్దామంటున్నారు. కానీ ఏదీ చెప్పడం లేదు. ఆ సిట్యుయేషన్‌లో ‘జయంత్‌ మీ అబ్బాయిని పెట్టి చేస్తాను’ అన్నాడు. అప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. సినిమా అంటే చదువుపోతుంది. నాకిష్టంలేదు. అప్పుడే ఎవరో చెప్పారు సూర్యనారాయణరాజు అబ్బాయి ప్రభాస్‌ ఉన్నాడు అని. ఒకరోజు వెళ్లి కలిసాం. జయంత్‌ కూడా ఓకే అన్నాడు. అదే సమయంలో అల్లుఅరవింద్‌ అబ్బాయి అల్లు అర్జున్‌ శిక్షణ తీసుకుంటున్నాడని తెలిసింది. ఆయన ఫొటోలు కూడా తీసుకున్నాం. పేపర్‌లో ప్రకటన ఇచ్చి మరికొందరిని చూశాం. ఫైనల్‌గా అందరినీ కూర్చోబెట్టి ఎవరిని తీసుకుందామని అడిగాను. జయంత్‌, పరుచూరి బ్రదర్స్‌ ప్రభాస్‌నే సజెస్ట్‌ చేశారు. సినిమా తీశాం. బాగా ఆడింది. అప్పుడే ప్రభాస్‌ నెక్ట్స్‌ సినిమా మనమే చేద్దాం? అన్నారు. ఇప్పుడు కాదు నాలుగో సినిమా చేద్దాం! అని చెప్పా. ఆ తరువాత ప్రభాస్‌ మళ్లీ సినిమా గురించి నన్ను అడగలేదు. నేనూ అడగలేదు.

 

మీకెంత మంది గురువులండీ?

హ్హహ్హా... గురువులు కాదు. ఒక్కో దాంట్లో ఒక్కో ఎక్స్‌పర్ట్‌.


సో... అందర్నీ అలా పెట్టుకున్నారు. అయినా మీకు కష్టాలు తప్పలేదు!

తప్పదు సార్‌. విధి రాతను ఎవరూ తప్పించలేదు. దానికి తోడు నేను ముక్కుసూటి మనిషిని. నిర్మాతల మండలిలో గానీ, ఫిలిం ఛాంబర్‌లో గానీ... ఎక్కడున్నా స్ట్రయిట్‌ ఫార్వార్డే. ఎవర్నీ కేర్‌ చేయను. నిబంధనల ప్రకారం వెళతా. అక్కడే చిన్న క్లాష్‌. ప్రభాస్‌తో సినిమా చేద్దామని చంటి, రాజమౌళి అప్పుడు నా దగ్గరకు వచ్చారు. ఏదో డిస్ప్యూట్‌ వస్తే... నిబంధనల ప్రకారం తీర్పు ఇచ్చా. ఆ తీర్పు ఇవ్వద్దని నాకు చాలా మంది చెప్పారు. నాకు వీళ్లూ చుట్టం కాదు... వాళ్లూ చుట్టం కాదు. దాంతో కొన్ని రోజులు నాతో కూడా మాటలు కట్‌ అయ్యాయి. దానివల్ల నాకేం పోయేది లేదు. ఎందుకంటే ఐ యామ్‌ నాట్‌ ఎక్స్‌పెక్టింగ్‌ ఫ్రమ్‌ ఎనీబడీ! ఇలా ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల చాలామందితో శత్రుత్వం వస్తుంది. సురేశ్‌బాబు కూడా చెప్పాడు... ‘ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వేమన్నా ఆపితే ఆగుతుందా? ఏదీ ఆగదు’ అని!

 

ఇప్పటికన్నా మీలో ఏదన్నా మార్పు వచ్చిందా?

లేదు సార్‌. అయితే మాట్లాడటం మానేశాను. ఇప్పుడు ఇండస్ర్టీకి దాదాపు దూరమైపోయినట్టే. ఫార్మాసూటికల్స్‌ బిజినెస్‌లోకి వెళ్లిపోయా. ఆ లైన్‌ బాగుంది. మంచి ఎక్స్‌పోర్ట్స్‌ చేస్తున్నాం. అయితే కొన్ని ఆబ్లికేషన్స్‌ ఉన్నప్పుడు సినిమా చేస్తూనే ఉన్నా. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి అబ్బాయితో సినిమా (జయదేవ్‌) తీశాను. కేవలం స్నేహం కోసమే!

 

ఆ సినిమా వల్ల మీకు, గంటా వాళ్లబ్బాయికీ వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. డబ్బు తీసుకెళ్లి గంగలో పోసినట్టయింది కదా!

అవునండీ! అయితే ఆ కుర్రాడితో సినిమా చేద్దామని గంటా గారు ఇండస్ర్టీలో చాలామందితో ప్రయత్నించారు. కాలేదు. దీంతో తమిళ్‌లో సూపర్‌హిట్‌ సినిమా రీమేక్‌ తీసుకుని అతనితో నేనే చేశాను. లాభాలు రాకపోయినా కనీసం నా డబ్బులు నాకు వస్తాయనుకున్నా. కానీ అవీ పోయాయి.

 

సురేశ్‌బాబు గారు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతారుట!

సురేశ్‌ (ఫోన్‌లో): చిన్నప్పుడు కారంచేడులోని రైస్‌ మిల్లు దగ్గర మనం ఏం చేశామో గుర్తుందా?

బేసిగ్గా... మా నాన్న వద్దన్నది చేసినప్పుడల్లా నాకు ఎదురు దెబ్బలే తగిలాయి. కారంచేడులో మా నాన్నదే తొలి రైస్‌ మిల్లు. అలాగే జిల్లాలోనే మొట్టమొదటి ట్రాక్టర్‌ డీలర్‌షిప్‌ ఆయనదే. ఇలా మా నాన్న ప్రతిదీ కొత్త కొత్త బిజినె్‌సలు చేసేవాళ్లు. సో... ఆ రైస్‌ మిల్లు ఉన్నప్పుడు వేసవిలో అంతా ఎంజాయ్‌ చేసేవాళ్లం. అక్కడ ఓ టూరింగ్‌ టాకీస్‌ కట్టారు. నాన్న వెళ్లద్దన్నారు. మేం వినలేదు. అంతా సినిమా చూసి, మిల్లు వెనకాల నుంచి వస్తున్నాం. అక్కడ అంతకముందే వేస్ట్‌గా ఉన్న ఊకను తగులబెట్టారు. అదంతా ఆరిపోయి... పైకి బూడిద కనిపిస్తోంది. నేను షార్ట్‌ కట్‌లో వెళదామని వచ్చేసి ఆ బూడిదలో అడుగులేస్తే... రెండు కాళ్లు పూర్తిగా కాలిపోయాయి. కేకలు... బొబ్బలు! అప్పుడు నా వయసు సుమారు ఎనిమిదేళ్లనుకుంటా (నవ్వు)!


మీ స్నేహితుడు బూరుగుపల్లి శివరామకృష్ణ గారు మీతో మాట్లాడతారుట!

బూరుగుపల్లి: మీరు రాజకీయాల్లోకి వస్తే, ప్రజలకు మంచి సేవ చేస్తారన్న నమ్మకం ఉంది. అది ఎప్పుడు?

రామానాయుడు గారు (టీడీపీ తరపున) ఎంపీగా నిలబడ్డప్పుడు సురేశ్‌ నన్ను పరుచూరు నుంచి పోటీ చేయమన్నాడు. అప్పుడే నాకు అప్పులన్నీ తీరి రూ.60 లక్షల క్యాష్‌ చేతిలో ఉంది. పిల్లలు చిన్నవారు. నా భార్య కూడా వద్దనడంతో నిలబడలేదు. అప్పుడు నాయుడు గారికి చీరాల ఇన్‌చార్జిగా ఉన్నా. ఆయన ఎవరికీ రికమండ్‌ చేసేవారు కాదు. దీంతో వాళ్లందరూ నా దగ్గరికి వచ్చేవాళ్లు. ఆ పనులన్నీ నా పర్సనల్‌ సర్కిల్‌ ద్వారా చేసుకుంటూ వచ్చాను. అలా ర్యాపో పెరిగింది. ఆ తరువాత కూడా రకరకాల కారణాలతో పోటీ చేద్దామన్నా కుదరలేదు. గత ఎన్నికల్లో నిలబడదామనుకున్నా. కానీ... మా జ్యోతిషుడు వద్దన్నారు. తరువాతి ఎలక్షన్స్‌లో చేస్తే పన్నెండేళ్లు పదవిలో ఉంటావన్నారు. అందుకే ఈసారి చంద్రబాబు గారు సీటు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగని నేను ఎవరి దగ్గరికీ వెళ్లి ప్రయత్నం చేయడం లేదు.

 

సో... మీ పిల్లలేమో అమెరికా వదిలి రామంటున్నారు. కనీసం మీరు ఇంత కష్టపడి పెట్టుకున్న వ్యవస్థను మీ తరువాత నడిపించడానికైనా వారికి ఆసక్తి ఉందా లేదా?

ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటున్నారు. మూడోవాడు, వాడి వైఫ్‌ డాక్టర్లు. సో... వాళ్లకి నా అవసరం లేదు. నా బాధ్యతలు అయిపోయాయి. పెద్దవాడు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వాడిని ఫార్మాసూటికల్స్‌ బిజినెస్‌ తీసుకోమంటున్నా.

 

మీకు చిత్రవిచిత్రమైన కలలు వస్తుంటాయనుకుంటా!

నాకు ఇదివరకు కలలు వచ్చేవి. ఏ కల వచ్చినా నెల లోపల అది నిజమవుతుండేది. అలా నాలుగైదు సంఘటనల తరువాత అవే రిపీట్‌ అయ్యేవి. అప్పట్లో నాకు జాతకాల పిచ్చి. చేతిలో సాల్మన్‌ రింగ్‌, సెకండ్‌ లైఫ్‌లైన్‌ ఉన్నాయని చెప్పారు. దాన్ని సాధన చెయ్యమన్నారు. ‘చెవిలో పువ్వు’ సినిమా సమయంలో గణపతి శాస్త్రి గారు... ‘టైమ్‌ బాలేదు. వద్ద’ని అన్నారు. అయితే కాకినాడలో కశ్మీరీ పండిట్‌ కౌల్‌ ‘దీనికి గౌహతీ వెళ్లి, అక్కడ రెమెడీ చేద్దాం’ అన్నారు. దీంతో సినిమా రిలీజ్‌ చేశాం. తరువాత గౌహతీలోని నీలాచల్‌ కొండపైనున్న కామాక్షి అమ్మవారి గుడికి వెళ్లాం. పవర్‌ఫుల్‌. అక్కడ విపరీతంగా ఆయసం వచ్చింది. ఆయన కమండలంలో నీళ్లు నా మీద చల్లగానే నార్మల్‌కు వచ్చేశా. తరువాత కంచి స్వామి వద్దకు తీసుకువెళ్లారు. అలా అందరినీ కలిశా. నాకు వాళ్లు చెప్పినవి జరిగాయి. నాకు నమ్మకాలు బాగా ఎక్కువ. నేను చెయ్యి చూసి మనిషి క్యారెక్టర్‌ కూడా చెప్పగలను. ఇలా చాలామందికి చెప్పినవి జరిగాయి.

 

మీకు ఎమ్మెల్యే అయ్యే యోగముందని మీ గురువులెవరూ చెప్పలేదా?

‘నీకు జీవో ఇచ్చే పవర్‌ ఉంది. చరిత్ర బాగా చదువు’ అని గతంలో మా గురువు శివానంద మూర్తి గారు చెప్పారు. అదే సమయంలో ‘నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే ఎన్నో జన్మలు నువ్వు నరకం అనుభవించాల్సి వస్తుంది’ అని కూడా అన్నారు. ఏదైనా యోగం ఉంటే వస్తుంది.

 

ఓకే... అశోక్‌కుమార్‌ భవిష్యత్తులో ఎమ్మెల్యేగా, కుదిరితే మంత్రి కావాలని ఆశిస్తూ థ్యాంక్యూ వెరీమచ్‌!

థ్యాంక్యూ సార్‌. ‘నేను ఒకవేళ ఎమ్మెల్యేనైతే ఏ తప్పూ చేయకుండా నన్ను నడిపించాల్సిన బాధ్యత మీదే’ అని మా గురువు గారి ఆశీస్సులు తీసుకున్నాను.

Updated Date - 2020-02-03T23:03:47+05:30 IST