అస్లాంది హత్యా?

ABN , First Publish Date - 2022-01-21T06:31:22+05:30 IST

అంచెలంచెలుగా ఎదిగాడు. వ్యాపారవేత్తగా మారాడు.

అస్లాంది హత్యా?

వివాదాస్పదమవుతున్న మరణం

ఓ కార్పొరేటర్‌ ప్రధాన అనుచరుడిపై ఆరోపణలు

రెండో భార్య ఫిర్యాదుతో బలపడుతున్న అనుమానాలు

ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు.. రిపోర్టుకు మరో వారం


  విజయవాడ / చిట్టినగర్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : అంచెలంచెలుగా ఎదిగాడు. వ్యాపారవేత్తగా మారాడు. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. వ్యాపార కార్యకలాపాలు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ వన్‌టౌన్‌ మహంతిపురంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. ఎపిసోడ్‌లోకి కొత్తకొత్త పేర్లు వస్తున్నాయి. మహంతిపురం టీఎస్పీ వీధికి చెందిన సయ్యద్‌ అస్లాం ఎంకే ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీన తన నివాసంలో అస్లాం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అస్లాం రెండో భార్య షేక్‌ కరీమున్నీసా చేసిన ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అస్లాంది అనుమానాస్పద మరణం కాదని, హత్య అని ఆరోపిస్తూ ఆమె కొత్తపేట పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో అస్లాం మొదటి భార్య సయ్యద్‌ నసీమా పేరును ప్రస్తావించింది. అస్లాం విగతజీవిగా పడి ఉన్నది నసీమా ఇంట్లోనే కావడంతో అనుమానాలు తలెత్తాయి. కరీమున్నీసా చేసిన ఫిర్యాదుతో అస్లాం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. వన్‌టౌన్‌లోని తారాపేటలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలో అస్లాం భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఇక్కడ గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు పోస్టుమార్టం చేశారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు చెందిన డాక్టర్‌ శివరామిరెడ్డి, డాక్టర్‌ దేవీచంద్‌, కొత్తపేట స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రెడ్డి పోస్టుమార్టంను నిర్వహించారు. అస్లాం శరీరం నుంచి కొన్ని భాగాల్లో నమూనాలను సేకరించారు. వాటిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో విశ్లేషించి నివేదికను ఇస్తారు. వారంలో నివేదిక వచ్చే అకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


ఎవరు ఆ అనుచరుడు?

 అస్లాం మొదటి భార్య నసీమాపై రెండో భార్య కరీమున్నీసా అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, మొత్తం వ్యవహారంలో మరో కొత్త వ్యక్తి పేరు బలంగా వినిపిస్తోంది. వన్‌టౌన్‌లోని ఓ కార్పొరేటర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న వ్యక్తి పైనా ఆరోపణలు వస్తున్నాయి. 14వ తేదీన అస్లాం కొంత నగదుతో మొదటి భార్య నసీమా ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. తర్వాత కార్పొరేటర్‌ అనుచరుడు ఆ ఇంటికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. అప్పటి వరకు అక్కడ పనిచేసిన సీసీ కెమెరాలు ఆ రోజు నుంచి పనిచేయడం మానేశాయని కరీమున్నీసా తదితరులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు రాత్రి ఇంట్లో వివాదం జరిగిందని వారు చెబుతున్నారు. మర్నాడు 15వ తేదీ ఉదయానికి అస్లాం ఊపిరి ఆగిపోయింది. ముందు రోజు రాత్రి ఆయన తీసుకొచ్చిన నగదు అక్కడి నుంచి మాయమైందని కరీమున్నీసా ఆరోపిస్తోంది. అప్పటి వరకు అస్లాంది సహజ మరణమే అనుకుని మత సంప్రదాయం ప్రకారం అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ తర్వాత కరీమున్నీసా చేసిన ఫిర్యాదుతో మొత్తం కథ మారిపోయింది. కార్పొరేటర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆ వ్యక్తి ముందు అస్లాంతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత అస్లాం కుటుంబ సభ్యుల్లో ఓ మహిళతో సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడని సమాచారం. ఈ కేసులో రెండో భార్య కరీమున్నీసా వేళ్లన్నీ నసీమా వైపు చూపిస్తుండగా, మూడో వ్యక్తి చుట్టూ చిక్కు ముడులు అల్లుకుంటున్నాయి. కార్పొరేటర్‌ అనుచరుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం. అస్లాంది సహజ మరణమా? లేక హత్యా? అనేది ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక వస్తేగానీ తెలిసే అవకాశం లేదు.

Updated Date - 2022-01-21T06:31:22+05:30 IST