ప్రజల రక్షణకే ప్రథమ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-06-05T09:44:25+05:30 IST

పోలీసు సబ్‌ డివిజన్‌లో ప్రజల సంరక్షణకు ముఖ్యంగా మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి విధులు నిర్వహిస్తానని ..

ప్రజల రక్షణకే ప్రథమ ప్రాధాన్యం

 నర్సీపట్నంలో తొలి అవకాశం ఆనందంగా ఉంది

ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు

ఏఓబీలో మావోయిస్టుల సమస్యలపై పూర్తి అవగాహన

నర్సీపట్నం నూతన ఎఎస్పీ తుహిన్‌ సిన్హా


నర్సీపట్నం, జూన్‌ 4 : పోలీసు సబ్‌ డివిజన్‌లో ప్రజల సంరక్షణకు ముఖ్యంగా మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి విధులు నిర్వహిస్తానని నర్సీపట్నం నూతన ఏఎస్పీ తుహిన్‌ సిన్హా వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆయన ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో కాసేపు మాట్లాడారు.  రాష్ట్రంలో నర్సీపట్నం వంటి చారిత్రాత్మక పోలీసు సబ్‌ డివిన్‌లో పనిచేసే అవకాశం తొలిసారిగా రావడం ఆనందంగా ఉందన్నారు.


మాదక ద్రవ్యాల నిరోధక చట్టం అమలు, గంజాయి రవాణా నిరోధం, శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ వ్యతిరేక శక్తుల కట్టడి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. గ్రేహౌండ్స్‌ విభాగంలో తిమ్మిది నెలల పాటు పనిచేసినందున ఏఓబీలో మావోయిస్టుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిందన్నారు. యువత మావోయిజం వైపు ఆకర్షితులు కాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సబ్‌ డివిజన్‌లో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా తనను కలవచ్చునన్నారు. 


కుటుంబ నేపథ్యం : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రాంతానికి చెందిన తుహిన్‌ సిన్హా పుణే న్యాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల న్యాయవిద్య అనంతరం 2016లో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2017 బ్యాచ్‌గా ఆంధ్రాకు కేటాయించబడిన ఆయన హైదరాబాద్‌లో శిక్షణ అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో శిక్షణ పొందారు. విశాఖ గ్రేహౌండ్స్‌ విభాగంలో తొమ్మిది నెలల శిక్షణ అనంతరం నర్సీపట్నం ఏఎస్పీగా తొలిపోస్టింగ్‌ పొందారు. తండ్రి రిటైర్డ్‌ జీఎస్టీ అడిషనల్‌ కమిషనర్‌ కాగా, తల్లి గృహిణి. ఇతని సోదరి వివాహం అనంతరం బెంగళూరులో స్థిరపడ్డారు.

Updated Date - 2020-06-05T09:44:25+05:30 IST