మిజోరాం, అస్సాం చర్చలు... గస్తీపై అంగీకారం...

ABN , First Publish Date - 2021-08-05T22:54:34+05:30 IST

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని అస్సాం,

మిజోరాం, అస్సాం చర్చలు... గస్తీపై అంగీకారం...

గువాహటి : అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని అస్సాం, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో గస్తీ కోసం దళాలను పంపించరాదని నిర్ణయించాయి. చర్చల అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించాయి. 


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అస్సాం, మిజోరాం ముఖ్యమంత్రులు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు చేపట్టిన చర్యలను మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించినట్లు ఈ సంయుక్త ప్రకటన తెలిపింది. మిజోరాంకు ప్రయాణాలపై జారీ చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకునేందుకు అస్సాం ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించింది. 


అంతకుముందు అస్సాం మంత్రులు అశోక్, అతుల్ బోరా, మిజోరాం మంత్రులు లాల్చమ్లియానా, లాల్రువాట్కిమా, హోం శాఖ కార్యదర్శి వన్లాల్నంగైహ్‌సాకా ఐజ్వాల్‌లో చర్చలు జరిపారు. 


తమ భూభాగంలో అక్రమంగా రోడ్డును మిజోరాం నిర్మిస్తోందని అస్సాం ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఈ నేపథ్యంలో జూలై 26న ఇరు రాష్ట్రాల దళాలు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కాల్పులకు దిగాయి.  ఈ ఘర్షణల్లో ఆరుగురు అస్సాం పోలీసులు, ఓ సాధారణ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. 


Updated Date - 2021-08-05T22:54:34+05:30 IST