అస్సాం శాసన సభ ఎన్నికలు... హోం గార్డుల హెచ్చరిక...

ABN , First Publish Date - 2021-03-31T19:57:49+05:30 IST

అస్సాం శాసన సభ ఎన్నికల విధుల నిర్వహణ పట్ల హోం గార్డులు నిరాసక్తత

అస్సాం శాసన సభ ఎన్నికలు... హోం గార్డుల హెచ్చరిక...

గౌహతి : అస్సాం శాసన సభ ఎన్నికల విధుల నిర్వహణ పట్ల హోం గార్డులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. తమకు అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదని, వేతనం కూడా తక్కువగా చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని హెచ్చరిస్తున్నారు. 


కొందరు హోం గార్డులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, అస్సాం శాసన సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ గురువారం జరుగుతుంది. దాదాపు 1500 మంది హోం గార్డులు ఇతర ప్రాంతాల నుంచి బారక్ లోయలోని కచర్ జిల్లాకు వచ్చారు. వీరు సిల్చార్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళడానికి వాహనాలను ఏర్పాటు చేయకుండా మంగళవారం సాయంత్రం దాదాపు ఐదు కిలోమీటర్లు నడిపించారు. మూడు రోజులపాటు విధులు నిర్వహిస్తే రూ.5,100 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. కానీ కచర్ జిల్లా అధికారులు కేవలం రూ.900 చొప్పున మాత్రమే ఇచ్చారు. మరోవైపు సరైన ఆహారం, తాగునీరు, ఆశ్రయం కల్పించలేదు. 


స్థానిక అధికార యంత్రాంగం తమను చులకనగా చూస్తోందని, రూ.900 తమకు దేనికి సరిపోతాయని హోం గార్డులు ప్రశ్నిస్తున్నారు. తొలి దశ పోలింగ్ కోసం తాము బిశ్వనాథ్ జిల్లాకు వెళ్ళామని, అక్కడి స్థానిక అధికార యంత్రాంగం తమకు రూ.5,100 చొప్పున చెల్లించిందని తెలిపారు. తాము రెగ్యులర్ రోల్స్‌లో లేనందువల్ల తమకు ఈ సొమ్ము మినహా జీతాలు ఉండవని చెప్పారు. రూ.900తో మూడు, నాలుగు రోజులపాటు ఎలా జీవించగలమని ప్రశ్నిస్తున్నారు. 


కచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను, అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించేందుకు తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని హోం గార్డులు చెప్పారు. తాము తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోదామనుకుంటున్నామని తెలిపారు. 


పోలింగ్‌కు ఆటంకం లేదు

ఇదిలావుండగా, కచర్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి మాట్లాడుతూ, హోం గార్డులు నిరసన తెలిపినప్పటికీ, శాసన సభ ఎన్నికల్లో తదుపరి దశల పోలింగ్‌కు ఎటువంటి ఆటంకాలు ఉండబోవని చెప్పారు. 


కచర్‌లో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 10,86,090 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా దళాలను ఎన్నికల విధుల కోసం నియమించారు. 




Updated Date - 2021-03-31T19:57:49+05:30 IST