అస్సాం ఉప ఎన్నికలు : భబానీ పూర్‌లో బీజేపీ ఘన విజయం

ABN , First Publish Date - 2021-11-02T20:28:30+05:30 IST

అస్సాంలో ఐదు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన

అస్సాం ఉప ఎన్నికలు : భబానీ పూర్‌లో బీజేపీ ఘన విజయం

న్యూఢిల్లీ : అస్సాంలో ఐదు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. భబానీపూర్‌లో 25 వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఫణిధర్ తాలూక్‌దార్ విజయం సాధించారు. మరియానీలో రూప్‌జ్యోతి కుర్మి(బీజేపీ), తౌరాలో సుశాంత బోర్గోహెయిన్ (బీజేపీ) కూడా గెలిచే అవకాశం కనిపిస్తోంది. 


ఈ శాసన సభ నియోజకవర్గాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫణిధర్ తాలూక్‌దార్ భబానీపూర్‌లో తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్థి శైలేంద్ర నాథ్ దాస్‌పై దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రూప్‌జ్యోతి కుర్మి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్థి లుహిట్ కొన్వర్‌పై 26 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బొర్గోహెయిన్ తన సమీప ప్రత్యర్థి ధైజ్య కొన్వర్‌పై 16 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 


ఈ ముగ్గురు బీజేపీ నేతలు ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. అయితే వీరు తమ పార్టీలకు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 


బీజేపీ మిత్ర పక్షం యూపీపీఎల్ అభ్యర్థులు జిరోన్ బసుమటరీ, జోలెన్ డైమరీ కూడా ఈ ఉప ఎన్నికల్లో విజయం దిశగా పయనిస్తున్నారు. బసుమటరీ తన సమీప ప్రత్యర్థిపై 22 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. డైమరీ తన సమీప ప్రత్యర్థి కన్నా 24 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 


Updated Date - 2021-11-02T20:28:30+05:30 IST