దుబాయ్‌లో చోరీ అయిన Maradona హెరిటేజ్ వాచ్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-11T17:47:48+05:30 IST

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు డియెగో మారడోనాకు చెందిన లగ్జరీ హెరిటేజ్ వాచ్‌ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసిన ఘటన సంచలనం...

దుబాయ్‌లో చోరీ అయిన Maradona హెరిటేజ్ వాచ్‌ స్వాధీనం

అసోంలో నిందితుడి అరెస్ట్ 

గౌహతి: అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు డియెగో మారడోనాకు చెందిన లగ్జరీ హెరిటేజ్ వాచ్‌ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసిన ఘటన సంచలనం రేపింది. అసోం పోలీసులు, దుబాయ్ పోలీసుల సమన్వయంతో దివంగత డియెగో మారడోనాకు చెందిన చోరీ అయిన లగ్జరీ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఈ కేసులో వాజిద్ హుస్సేన్ అనే నిందితుడిని అసోంలో అరెస్టు చేశామని,అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.


అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు డియెగో మారడోనాకు చెందిన హెరిటేజ్ హుబ్లాట్ వాచ్‌ను తిరిగి పొందేందుకు అసోం పోలీసులు ఇండియన్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ద్వారా దుబాయ్ పోలీసులతో సమన్వయం చేశారని సీఎం చెప్పారు.దుబాయ్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న అసోం పోలీసులు నిందితుడిని శివసాగర్‌లోని అతని నివాసం నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ తెలిపారు.దుబాయ్‌లో దివంగత ఫుట్‌బాల్ ప్లేయర్ వస్తువులను భద్రపరిచే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసినప్పుడు మారడోనా సంతకం చేసిన హబ్లాట్ వాచ్‌ను నిందితుడు దొంగిలించాడు. 


ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టులో అసోంకు పారిపోయి వచ్చినట్లు తెలుస్తోంది.‘‘రహస్య సమాచారం ఆధారంగా తాము గత రాత్రి ఆపరేషన్ ప్రారంభించాం, వాజిద్ హుసేన్ అత్తమామల ఇంటి నుంచి నిందితుడిని పట్టుకున్నాం. మేం అతని వద్ద నుంచి హెరిటేజ్ హబ్లాట్ వాచ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం. విచారణ కొనసాగుతోంది.’’ అని శివసాగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రౌషన్ వివరించారు. 


Updated Date - 2021-12-11T17:47:48+05:30 IST