అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే!

ABN , First Publish Date - 2021-02-24T04:46:49+05:30 IST

సంక్షేమం పేరుతో అధికార పార్టీ వందల వేల కోట్లు పంచిపెడుతున్నా.. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని వలంటీర్ల ద్వారా బెదిరించినా, పోలీసు కేసుల పేరుతో ప్రతిపక్ష నాయకులను భయాందోళనకు గురిచేసినా... ఓట్లపరంగా అధికార పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదనే తెలుస్తోంది.

అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే!

కనిపించని సంక్షేమ పథకాల ప్రభావం

అధికార పార్టీకి పెరగని ఓట్ల శాతం

పోరాట పటిమ చూపిన టీడీపీ

ప్రతికూలతను అధిగమించిన తెలుగు తమ్ముళ్లు

నిక్కచ్ఛిగా ఓటేసిన పల్లెవాసులు

అసెంబ్లీ, పంచాయతీ ఓట్ల విశ్లేషణ


నెల్లూరు (ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 23 : సంక్షేమం పేరుతో అధికార పార్టీ వందల వేల కోట్లు పంచిపెడుతున్నా.. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని వలంటీర్ల ద్వారా బెదిరించినా, పోలీసు కేసుల పేరుతో ప్రతిపక్ష నాయకులను భయాందోళనకు గురిచేసినా... ఓట్లపరంగా అధికార పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదనే తెలుస్తోంది. ఓటు విషయంలో సంక్షేమ పథకాల ప్రభావం ఆశించినంత ఉండదని, అణచివేత ధోరణికి నాయకులు భయపడతారే తప్ప ఓటర్లు జంకరనే విషయం పంచాయతీ ఎన్నికల ఓటింగ్‌ సరళి రుజువు చేసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పంచాయతీ ఎన్నికల ఓట్ల సరళిని గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఏడు శాతం ఓట్లు పెరిగాయి. అది కూడా మంత్రి సొంత మండలం మర్రిపాడులో 70 శాతం ఓట్లు అధికార పార్టీ బలపరచిన అభ్యర్థులకు దక్కడం మూలాన ఈ పెరుగుదల కనిపించింది. మిగిలిన నియోజక వర్గాల్లో గడిచిన రెండేళ్ల సంక్షేమ ప్రభుత్వంలో అధికార పార్టీ పెద్దగా జనాన్ని ఆకర్షించలేదనే నిజం అర్థమవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ స్థాయిలో ఉందో ఇప్పుడూ అదేస్థాయిలో ఉన్నట్లు ఓట్ల సరళి చెబుతోంది. అంటే ఈ 20 నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కుంగిపోయారేప్ప ఓటర్లు మాత్రం నిబ్బరంగానే ఉన్నారనిపిస్తోంది. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో (మద్దతు అభ్యర్థులకు) వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే.. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గం సూళ్లూరుపేట. టీడీపీకి బలమైన పట్టు కలిగిన ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి వచ్చిన భారీ మెజారిటీ అందరినీ విస్మయానికి గురిచేశాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఆ మెజారిటీ తగ్గడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు 61.99 శాతం ఓట్లు పడ్డాయి. అదే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు  54.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ 20 నెలల కాలంలో 7.5 శాతం ఓట్లు నష్టపోయింది. నిజంగా సంక్షేమ పథకాలే పని చేసుంటే ఓట్ల శాతం ఇలా తగ్గడానికి ఆస్కారం ఉందా అనేది ప్రశ్న. టీడీపీ గతానికి ఇప్పటికి 2.5  శాతం ఓట్లు పెరిగాయి. అధికార పార్టీలో అసమ్మతి పోరు, టీడీపీలో మారిన నాయకత్వం దీనికి కారణాలుగా చెబుతున్నారు. సూళ్లూరుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, నాయుడుపేటలలో టీడీపీ బలంగా కనిపించింది. తడ, ఓజిలి మండలాల్లో వైసీపీ పూర్వ బలాన్ని యధాతథం నిలుపుకోగలిగింది. 

వెంకటగిరిలో అధికార పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదని ఫలితాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికల్లో కేవలం 1.5 శాతం ఓట్లు మాత్రమే పెరిగాయి. బలమైన నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో ఇంత స్పల్పంగా తేడా కనిపించడం విశేషం. అంటే ఇక్కడ కూడా  సంక్షేమం ప్రభావం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. వైసీపీకి డక్కిలిలో 82 శాతం. బాలయ్యపల్లి, రాపూరు మండలాల్లో 63 నుంచి 66 శాతం పడ్డాయి. వెంకటగిరి, సైదాపురం మండలాల్లో 40 శాతానికి పరిమితమైంది. అలాగని టీడీపీ బలపడింది లేదు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇప్పుడు 12 శాతం ఓట్లు తగ్గాయి  టీడీపీకి వెంకటగిరి, బాలయ్యపల్లిలో మాత్రమే 31 శాతం ఓట్లు పడ్డాయి. మిగిలిన అన్ని మండలాల్లో 20 నుంచి 25 శాతం లోపే పడ్డాయి. ఈ నియోజకవర్గంలో 16 శాతం ఓట్లు ఇతరులకు పడటం గమనార్హం. 

కావలిలోనూ అధికార పార్టీ అంతంత మాత్రంగానే బలపడింది. అసెంబ్లీ ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికల్లో కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే పెరిగాయి. ఈ పెరుగుదలకు కూడా ప్రధాన ప్రతిపక్షంలో నాయకత్వ సంక్షోభం, ఆర్థిక వనరుల లోటు.. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. వైసీపీకి దగదర్తి, అల్లూరు, కావలి మండలాల్లో 52, బోగోలు 48 శాతం ఓట్లు పడ్డాయి. టీడీపీ బోగోలులో చాలా తక్కువ 24.2. అల్లూరులో 38.శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విశేషమేమంటే ఈ నియోజకవర్గం పరిధిలో ఇతరులకు 10శాతం ఓట్లు పడ్డాయి. 

ప్రచారంలో ఉన్నట్లే ఉదయగిరిలో అధికార పార్టీకి మైనస్‌ మార్కులు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికల్లో ఈ పార్టీకి 57 శాతం ఓట్లు రాగా, పంచాయతీ ఎన్నికల్లో 54 శాతమే వచ్చాయి. అధికార పార్టీ నాయకులపై నెలకొన్న అసంతృప్తి ముందు సంక్షేమ పథకాలు ఏం చేయలేకపోయాయి. ఇక్కడ టీడీపీ పరిస్థితి కాస్త మెరుగుపడింది. 0.5 శాతం ఓట్లు పెరిగాయి. ఈ నియోజకవర్గంలో ఇతరులకు 8 శాతం ఓట్లు పడటం గమనార్హం. 

గూడూరులో అధికార పార్టీ బలపడింది లేకపోగా ఉన్నది కాస్త ఊడిపోతోందని పంచాయతీ ఎన్నికల ఓట్ల శాతం రుజువు చేస్తోంది. అసెంబ్లీతో పోల్చితే ఓటింగ్‌ శాతం పెరగకపోగా కాస్త తగ్గింది. విశేషమేమంటే ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి కూడా మెరుగ్గా కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పంచాయతీ ఎన్నికల్లో 2 శాతం ఓట్లు తగ్గాయి. ఇక్కడా ఇతరులు 7 శాతం ఓట్లు సంపాదించుకున్నారు. 

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రాతనిధ్యం వహిస్తున్న ఆత్మకూరులో 7 శాతం ఓట్లు పెరిగాయి. అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం మంత్రి సొంత మండలం మర్రిపాడులో భారీగా ఓట్లు రావడమే. ఈ మండలంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు 71 శాతం ఓట్లు వచ్చాయి. ఏఎ్‌సపేటలో, చేజర్ల, సంగం మండలాల్లో 60 శాతం ఓట్లు పడ్డాయి. అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లో సైతం 54 నుంచి 56 శాతం ఓట్లు పడ్డాయి. టీడీపీ పరిస్థితి అసెంబ్లీ కన్నా క్షీణించింది.  9 శాతం ఓట్లు తగ్గిపోయాయి. ఈ నియోజకవర్గంలో  ఇతరులకు 7 శాతం ఓట్లు పడ్డాయి. 

కోవూరులో అప్పటికి, ఇప్పటికీ వైసీపీ ఓట్లలో పెద్దగా తేడా కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 56.55 శాతం ఓట్లు రాగా పంచాయతీ ఎన్నికల్లో 56.20 ఓట్లు వచ్చాయి. కోవూరు మండలంలో అత్యధికంగా 71 శాతం ఓట్లు వైసీపీకి పడ్డాయి. విడవలూరులో 54 శాతం, కొడవలూరు, ఇందుకూరుపేటలో 53 శాతం, బుచ్చిలో 40 శాతం ఓట్లు ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పడ్డాయి. టీడీపీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల కన్నా 7 శాతం ఓట్లు తగ్గాయి. విశేషమమంటే ఇక్కడ ఇతరులు 10శాతం ఓట్లు చీల్చుకున్నారు. 

సర్వేపల్లిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే ఈ ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపించింది.  4 శాతం ఓట్లు పెరిగాయి. పొదలకూరులో 57, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరులో 55 శాతం మేర అధికార పార్టీకి ఓట్లు పడ్డాయి. టీడీపీకి  టీపీ గూడూరులో టీడీపీకి 44 శాతం, ముత్తుకూరులో 32,పొదలకూరులో 37,మనుబోలు, వెంకటాచలం మండలాల్లో 26 శాతం  ఓట్లు పడ్డాయి. ఇక్కడా ఇతరులకు 10.50 శాతం ఓట్లు చీల్చుకున్నారు. 

Updated Date - 2021-02-24T04:46:49+05:30 IST