డిఫెన్స్‌ కారిడార్‌ కేటాయించండి

ABN , First Publish Date - 2022-01-18T08:57:06+05:30 IST

హైదరాబాద్‌లో రక్షణ సంబంధిత స్థావరాలున్నా..

డిఫెన్స్‌ కారిడార్‌ కేటాయించండి

  • హైదరాబాద్‌లో డిఫెన్స్‌ స్థావరాలుండగా..
  • బుందేల్‌ఖండ్‌కు కారిడార్‌ను కేటాయించారు
  • కేంద్రం నుంచి ఆర్థిక సహకారం సరిగా లేదు
  • ప్రగతిశీల తెలంగాణ అభివృద్ధికి సహకరించండి
  • పీఎం గతిశక్తి సదస్సులో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రక్షణ సంబంధిత స్థావరాలున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం డిఫెన్స్‌ కారిడార్‌ను తెలంగాణకు ఇవ్వలేదంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారు. ఎటువంటి డిఫెన్స్‌ స్థావరాలు లేని బుందేల్‌ఖండ్‌కు మాత్రం కారిడార్‌ను కేటాయించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణకు డిఫెన్స్‌ కారిడార్‌ను కేటాయించాలని కోరారు. తద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి, పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం సౌత్‌ జోన్‌ పీఎం-గతిశక్తిపై జరిగిన ఆన్‌లైన్‌ సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు, ప్రాజెక్టులపై చర్చించడానికి ఈ సదస్సు నిర్వహించింది.


రాష్ట్రం తరఫున ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ట్రమని తెలిపారు. తయారీ రంగం, ఫార్మాస్యూటికల్‌, చేనేత, జౌళి, విద్యుత్తు, బొగ్గు రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన కరోనా వ్యాక్సిన్లలో 35 శాతం హైదరాబాద్‌ నుంచే కావడం తమకు గర్వంగా ఉందన్నారు. దేశంలో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. అనతికాలంలోనే తనకున్న సహజ వనరులతో ప్రగతి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోందని పేర్కొన్నారు. 


కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహకారం తగిన విధంగా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తగిన స్థాయిలో సహకరించాలని కోరారు. హైదరాబాద్‌ సముద్ర తీర ప్రాంత నగరం కానందున.. తాము డ్రై పోర్టులను జాతీయ రహదారుల వెంట అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. లాజిస్టిక్‌ రంగంలో కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తే తెలంగాణ తగిన మేరకు చర్యలు చేపడుతుందన్నారు. రైల్వే శాఖ తరచూ రైళ్లను రద్దు చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్‌ రంగంలోని వ్యాపారులు ఇతర మార్గాల ద్వారా రవాణా చేయించుకుంటున్నారని, దాంతో అధిక వ్యయం వెచ్చించాల్సి వస్తోందని వివరించారు. సరకుల రవాణాకు రెళ్లను పెంచాలని కోరారు. నార్త్‌-సౌత్‌ ట్రావెల్‌ కారిడార్‌ తెలంగాణలో హైదరాబాద్‌ను అనుసంధానించకుండా ఉందని పేర్కొన్నారు.  లాజిస్టిక్‌ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఈ అంశంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పుదుచ్ఛేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీ్‌పల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T08:57:06+05:30 IST