రైతన్నకు దక్కేనా భరోసా..

ABN , First Publish Date - 2020-10-16T06:37:08+05:30 IST

భారీవర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ ఆశాజనకంగానే

రైతన్నకు దక్కేనా భరోసా..

భారీ వర్షాలతో ఇరుజిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం 

ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూపు 

నష్టం అంచనాలో అధికారయంత్రాంగం బిజీబిజీ


ఖమ్మం /కొత్తగూడెం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : భారీవర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ ఆశాజనకంగానే ప్రారంభమైనా.. ఆ తర్వాత అంచనాలను మించి వానలు పడటంతో రైతుల ఆశలు నీటిపాలయ్యాయి. మూడురోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడిఖమ్మం జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఖమ్మం జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం రూ.50కోట్లు, భద్రాద్రి జిల్లాలో రూ.20కోట్లకుపైనే నష్టం ఉంటుందని అంచనా. ఖమ్మం జిల్లాలో ఇటీవల వానలకు 75,364 ఎకరాల్లో,  భద్రాద్రి జిల్లాలో 8,313 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జూన్‌ నుంచి ఇప్పటి వరకు పలుసార్లు భారీ వర్షాలు పడి.. సుమారు సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారంపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ మూడు రోజుల క్రితం పడిన వానకు జరిగిన నష్టం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. 


పొట్టదశలో వరి.. 

ఖమ్మం జిల్లాలో వరి 3,911 ఎకరాలు, పత్తి 37,227 ఎకరాలు, కంది 20వేల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో వరి 7,212ఎకరాలు,  పత్తి 686ఎకరాలు, వేరుశనగ 155ఎకరాలు,  మిరప 260ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం వరి పొట్దశలో ఉండగా వర్షాలకు నేలమట్టం కావడం రైతులను మరింత కుంగదీసింది. ఈ నెలాఖరుకు సత్తుపల్లి నియోజకవర్గంలో వరికోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. భారీవర్షం నిరాశను మిగిల్చింది. 


పత్తి రైతులపై పిడుగు..

పత్తి కూడా మొదటి తీత ప్రారంభమవగా వర్షాలతో పత్తి రైతులపై పిడుగుపడినట్టుయ్యింది.  తొలిరోజుల్లో పడిన వానలకు పంట ఏపుగా పెరగడంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ మొదటితీత దశకు వచ్చిన తర్వాత పడుతున్న వానలకు పంటచేలోనే నల్లబడి కారిపోతోంది. ఫలితంగా ఎకరానికి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కాయ నల్లబడటం, కుళ్లిపోవడం, పురుగుపడుతుండటంతో రెండోవిడతపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. ఒకవేళ పంట వచ్చినా అది నాణ్యత ఉండదని చెబుతున్నారు. 


ప్రభుత్వ ఆస్తులకూ నష్టం..

భారీవర్షాల కారణంగా ప్రభుత్వ ఆస్తులకు కూడా భారీ నష్టమే జరిగింది. ఖమ్మం జిల్లాలో 168 విద్యుత్‌ స్తంభాలు, 46 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా విద్యుత్‌శాఖకు రూ.25లక్షలపైనే నష్టం జరిగినట్టు అంచనా. భద్రాద్రి జిల్లాలో 24స్తంభాలు నేలకూలాయి. దీంతో పాటు ఇరుజిల్లాల్లో నీటిపారుదలశాఖ పరిధిలోని కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. కట్టలు కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారులు, చప్టాలు కూడా పలు చోట్ల కొట్టుకుపోయాయి. వీటన్నిటిపై ఆయా శాఖల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. 


ప్రాణనష్టం గురించి పట్టింపేదీ?

వర్షాల కారణంగా ఇరుజిల్లాల్లో నలుగురు మృతిచెందారు. అయితే వారి కుటంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందించే విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మల్లెల రవి అనే రైతు చెరువు గండి పడి కొట్టుకుపోయి మృతిచెందాడు. కల్లూరు మండలంలో సీహెచ్‌ సూర్యనారాయణ అనే వ్యక్తి చేపలవేటకు వెళ్లి చెరువుకు గండిపడి కొట్టుకుపోయి మరణించాడు. నేలకొండపల్లి మండలం ఆరెగూడేనికి చెందిన వడ్డె శ్రీదేవి అనే మహిళ వర్షాలకు మరణించింది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముకుందాపురానికి చెందిన కూర నర్సింహారావు చెరువు అలుగుదాటబోయి ప్రమాదవశాత్తు వరదకు కొట్టుకుపోయి కన్నుమూశాడు. వీరి కుటుంబాలకు పరిహారం అందించే విషయమై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఆయా కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లా తల్లాడలో రూ.2లక్షల విలువైన 18గొర్రెలు కూడా మరణించాయి. మూగజీవాలకు సంబంధించి కూడా పరిహారం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-10-16T06:37:08+05:30 IST