అంతరిక్షం నుంచి వచ్చిన వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు తలెత్తుతాయంటే..

ABN , First Publish Date - 2022-01-18T15:58:02+05:30 IST

అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత..

అంతరిక్షం నుంచి వచ్చిన వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు తలెత్తుతాయంటే..

అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు తలెత్తుతాయో శాస్త్రవేత్తలు తెలియజేశారు. వ్యోమగాములు తమ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫలితంగా వారి శరీరంలో రక్తహీనత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సాధారణ మానవునిలో ప్రతి సెకనుకు ఒక మిలియన్ ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తుల శరీరంలో ప్రతీ సెకెనుకు 3 మిలియన్ల ఎర్ర రక్త కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఇక్కడే శరీరంలో మార్పులు మొదలవుతాయి. డైలీ మెయిల్ తెలిపిన వివరాల ప్రకారం కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వ్యోమగామి శరీరంలో ఎంత మార్పు వస్తుందనే దానిపై పరిశోధన చేశారు.


 భూమిపై నివసించే వారితో పోలిస్తే వ్యోమగాముల శరీరంలో ఎర్రరక్తకణాలు దాదాపు 54 శాతం తగ్గాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒట్టావా యూనివర్శిటీ పరిశోధకుడు డాక్టర్ గై ట్రూడెల్ మాట్లాడుతూ అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన వ్యక్తుల శరీరంపై తొలి ప్రభావం రక్తహీనత రూపంలో కనిపిస్తుంది. 14 మంది వ్యోమగాములపై ​​ఈ పరిశోధన చేశామన్నారు. ఇది పరిశోధన సమయంలో కూడా నిర్ధారితమయ్యింది. ఈ పరిశోధనల కోసం వ్యోమగాముల రక్తం, శ్వాస నమూనాలను సేకరించినట్లు పరిశోధకులు తెలిపారు. వారు భూమిపైకి వచ్చిన తర్వాత వారి శరీరంలో రక్తహీనత కనిపించింది. దీంతోవారు బలహీనంగామారి, అలసిపోయినట్లు కనిపించారు. అంతేకాకుండా కండరాలు కూడా మునుపటిలా దృఢంగా ఉండవని డాక్టర్ ట్రూడాల్ చెప్పారు. ఇటువంటి సమయంలో వారు వ్యాయామం కూడా చేయలేరన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన కారణంగా రక్తాన్ని కోల్పోవడాన్ని ‘స్పేస్ అనీమియా’ అని అంటారు. ఇది ఎందుకు చోటుచేసుకుంటుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవి ఫలప్రదమైతే వ్యోమగాములకు సహాయం చేయవచ్చని వారు నమ్ముతున్నారు.



Updated Date - 2022-01-18T15:58:02+05:30 IST