ఆయన మాట వినకుండా ఎన్టీఆర్‌తో సినిమా తీశా.. 25 కోట్లు లాస్

ABN , First Publish Date - 2020-02-08T08:06:14+05:30 IST

ఉత్తమాభిరుచి గల నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అశ్వనీదత... నిర్మాత అనే పదానికి స్పష్టమైన నిర్వచనం కూడా.

ఆయన మాట వినకుండా ఎన్టీఆర్‌తో సినిమా తీశా.. 25 కోట్లు లాస్

ఉత్తమాభిరుచి గల నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అశ్వనీదత... నిర్మాత అనే పదానికి స్పష్టమైన నిర్వచనం కూడా. ఎంత భారీగా సినిమా తీశామనేదాని కంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ ప్రేక్షకుడికి పదిరెట్లు ఆనందాన్ని అందించాలనే తపన ఉన్న వ్యక్తి. ‘ఓ సీత కథ’ సినిమాతో 32 ఏళ్ల కిందట మొదలైన సినీ ప్రస్థానంలో తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులను 01-12-2016న జరిగిన ‘ఓపెన్‌ హార్డ్‌ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పంచుకున్నారు.

 

ఆర్కే: నిర్మాతగా నాలుగు దశాబ్దాల ప్రయాణం ఎలా ఉంది?

అశ్వనీదత్: బాగుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు, కారణజన్ములు ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు. వారితో నా కెరీర్‌ ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో ఎంతో మంది నటులు, కళాకారులు, రచయితలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేశాను. అది తలచుకుంటేనే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

 

ఆర్కే: ఎక్కడా అసంతృప్తి లేదా?

అశ్వనీదత్: పెద్దగా లేదు. పూర్తిగా లేదని అనను. అక్కడక్కడా ఉంది. నా కళ్లెదుటే పెద్ద పెద్ద బ్యాగులతో వచ్చి డబ్బులన్నీ పోగొట్టుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారు చాలా మంది ఉన్నారు.

 

ఆర్కే: వారిని చూస్తే మీకు భయమనిపించలేదా?

అశ్వనీదత్: చాలా భయంగా ఉండేది. ఏదో గుండె ధైర్యం నడిపించింది. ఎన్టీరామారావుగారు పేరు పెట్టడం, ఆయన చేతుల మీదుగా వైజయంతి మూవీస్‌ ప్రారంభం కావడం, నాగేశ్వరరావుగారు తరువాత జనరేషన్‌ కృష్ణగారు, శోభన్‌బాబుగార్లతో చేయడం, ఒడిదొడుకులు ఉన్నా ముందుకెళ్లాను. ఇంకా వయసుంది కదా పెద్ద దెబ్బ తగిలినా మళ్లీ నిలదొక్కుకుంటాంలే అనే మొండి ధైర్యం.

 

ఆర్కే: సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనే ఆలోచన ఎలా వచ్చింది?

అశ్వనీదత్: ఇంజనీరింగ్‌ చదవాలని వెళ్లి సినిమా పిచ్చి వల్ల చదవకుండానే వెనక్కి వచ్చేసి బీఎస్సీ పూర్తిచేశా. మా నాన్నగారు బిజినెస్‌ వ్యవహారాలు చూసుకునే వారు. ఏ1 కాంట్రాక్టర్‌గా ఉండేవారు. కళింగ డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా మాదే. ఎలాగూ నేను వ్యాపారం చూసుకోవాలి కదా, సినిమాను కూడా వ్యాపారంగానే చేద్దాం అని మా నాన్నను కన్విన్స్‌ చేశాను. మద్రాసు రైలెక్కిందే ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని. ‘ఓ సీతకథ’ సినిమా తీసిన తరువాత ఎన్టీఆర్‌ను కలిసాను. డబ్బులొచ్చాయి కదా, ఇక సినిమా వద్దు ఇంటికెళ్లిపో అన్నారు.

 

ఆర్కే: ఎన్టీఆర్‌ను ఎవరు పరిచయం చేశారు?

అశ్వనీదత్: ఎన్టీఆర్‌తో మాకు కొద్దిగా బంధుత్వం కూడా ఉంది. అదే విషయాన్ని ఆయనకు కలిసినపుడు చెబితే సంతోషంగా ఫీలయ్యారు. తరువాత మనవాడివి వచ్చావు, సంతోషం. నాలుగు డబ్బులు మిగిలినాయి కదా. ఇక సినిమాలు వద్దు, ఇంటికెళ్లిపో అన్నారు. పైగా నాతో సినిమా అంటున్నావు. నేను మేకప్‌ వేసుకోక చాలా రోజులవుతోంది అన్నారు. నేను మీతో సినిమా తీసి కాని వెళ్లను అని నేను చెప్పాను. దాంతో ఎంఎస్‌రెడ్డిని పిలిచి మీ ఆఫీస్‌కు దగ్గరలో ఒక ఆఫీస్‌ చూసికాస్త ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉండండి అని చెప్పారు. తరువాత సినిమాకు డేట్స్‌ ఇస్తూ బ్యానర్‌ పేరేంటి అన్నారు. ఇంకా ఏమనుకోలేదు. మీరే పెడితే బాగుంటుంది అన్నాను. కృష్ణుడి మెడలో వైజయంతి మాల.. వైజయంతి మూవీస్‌ అని పెట్టు అన్నారు. అలా మా బ్యానర్‌ మొదలయింది.

 

ఆర్కే: నిర్మాతగానే ఉండాలనుకున్నారా? నటన, దర్శకత్వం ఆలోచన కూడా ఉండేదా?

అశ్వనీదత్: సెకండ్‌ థాటే లేదు. నిర్మాత అవ్వాలనే వచ్చాను. అలానే కంటిన్యూ అయ్యాను.

 

ఆర్కే: మొదట్లో మీ నాన్నగారి దగ్గరి నుంచి ఎంత తీసుకెళ్లారు?

అశ్వనీదత్: నాకు బాగా గుర్తు. ఒక ప్యాకెట్‌గా ఏడు లక్షలిచ్చారు. అది 1974లో. ఆ డబ్బులు తీసుకుని మద్రాసు వెళ్లాక ఎంఎస్‌రెడ్డి గారితో మాట్లాడుతూ ఇలా ఏడు లక్షలు తీసుకొచ్చానని చెప్పాను. దాంతో ఆయన ‘నీ దుంపతెగ. టీనగర్‌లో గ్రౌండ్‌ఎంతో తెలుసా? 4800 రూపాయలు. నువ్వు తెచ్చిన డబ్బులతో ఎంత భూమి వస్తుందో తెలుసా’ అన్నారు. అప్పటికి ఆయన రియల్‌ ఎస్టేట్‌ చేసేవారు. నిజంగానే ఆ డబ్బులతో కొంటే 125 గ్రౌండ్స్‌ వచ్చుండేవి. ఇప్పుడు దాని విలువ 400 కోట్లుండేది (నవ్వులు)


ఆర్కే: ఆ ఏడు లక్షలు తిరిగి మీ నాన్నకిచ్చేశారా?

అశ్వనీదత్: ఇచ్చేశాను. చాలా ల్యాండ్స్‌ డెవలప్‌ చేశాం. గన్నవరం దగ్గర నేను 30 ఎకరాలు కొన్నాను. మా ఆవిడకు పుట్టింటి నుంచి వచ్చింది ఒక 20 ఎకరాలు ఉండేది. మొత్తం గన్నవరం ఎయిర్‌పోర్టు కింద పోయింది.


ఆర్కే: ఎయిర్‌పోర్టుకు పోగా ఏమైనా మిగిలిందా?

అశ్వనీదత్: ఏమీలేదు. మొత్తం ఇచ్చేశాను. ప్రైమ్‌ల్యాండే నాది. ఇప్పుడు క్యాపిటల్‌లో ఇస్తామన్నారు. ప్రైమ్‌ ఏరియాలో కమర్షియల్‌ ల్యాండ్‌ ఇస్తే మల్టీప్లెక్స్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టాలని ఆలోచన ఉంది.


ఆర్కే: నిర్మాతగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. పెద్ద పెద్ద నిర్మాతలు ఒకవెలుగు వెలిగి ఠక్కున ఆరిపోయిన వారున్నారు. అంత రిస్క్‌ తీసుకుంటున్నప్పుడు మధ్యమధ్యలో జంకేవారు కాదా?

అశ్వనీదత్: అనిపించేది. ఉదాహరణకు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు పెద్ద పెద్ద సెట్‌లు వేస్తుంటే కృష్ణగారు వచ్చి ఎంతవుతుందో నీకు తెలుస్తోందా? అంతెందుకు ఖర్చు పెడుతున్నావు అన్నారు. నాగిరెడ్డి గారయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్లోర్‌లో నా తరువాత రామానాయుడు సెట్స్‌ వేయించారు. తరువాత నిన్నే చూస్తున్నాను. జాగ్రత్తగా ఉండు అన్నారు. ఆయనే దగ్గరుండి కొన్ని సెట్స్‌ వేయించారు. కొన్నిసార్లు పరిధిదాటి వెళ్లినపుడు భయమేసేది. డిసి్ట్రబ్యూటర్‌ ఆఫీస్‌ కూడా ఓపెన్‌ చేశాక కొంచెం ధైర్యంగా ఉండేది.

 

ఆర్కే: ఒక సక్సెస్‌ వచ్చాక ఇక చాలు అని ఎందుకనుకోలేదు?

అశ్వనీదత్: యంగ్‌ఏజ్‌లో వచ్చి నిర్మాతగా వ్యాపారం మొదలుపెట్టాం. ఇప్పుడు ఇదికాకుండా మరో వ్యాపారం చెద్దామని ఆలోచన రాదు. నిజానికి నాకు హైదరాబాద్‌కు షిప్ట్‌ అవడం అసలు ఇష్టం లేదు. కానీ షిప్ట్‌ కావడం వల్లనే నాకు మేలు జరిగింది. హైదరాబాద్‌కొచ్చాకే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగాను.

 

ఆర్కే: సాధారణంగా ఒక నిర్మాత ఒక హీరోను ఓన్‌ చేసుకుంటారు. మీరు అలాకాకుండా అందరు హీరోలతో తీశారు. ఎందుకు?

అశ్వనీదత్: ఒకే హీరోతో సినిమా అంటే ఆ రోజుల్లో రెండు, మూడు సంవత్సరాలు వెయిట్‌ చేయాల్సి వచ్చేది. 75లో ఎదురులేని మనిషి తీస్తే 78లో యుగపురుషుడు తీశాను. మళ్లీ ఎన్టీఆర్‌తో తీయాలంటే మరో రెండేళ్లు పడుతుంది. అందుకే నాగేశ్వరరావుతో స్టార్ట్‌ చేశాను. రాజేంద్రప్రసాద్‌లా ఒక్క నాగేశ్వరరావుతోనే కాకుండా రామానాయుడు మాదిరిగా చిన్నా, పెద్దా అందరితో తీయాలని అనుకున్నాను. చిన్న సినిమాలే నాకు చాలా సార్లు హెల్ప్‌ చేశాయి. ఇంద్ర సినిమాకు వచ్చిన ప్రాఫిట్స్‌ చాలా చిన్న సినిమాల్లో చూశాను.

 

ఆర్కే: ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో ఎన్ని సినిమాలు చేశారు?

అశ్వనీదత్: రామారావుగారితో రెండు , నాగేశ్వరరావుగారితో నాలుగు తీశా.

 

ఆర్కే: ఇద్దరి మధ్య తేడా ఉండేదా?

అశ్వనీదత్: ఏముండేది కాదు. ఇద్దరిదీ ఒకే మెంటాలిటీ. నాగేశ్వరరావుగారితో ఫ్రీగా ఉండేవాళ్లం. ఎన్టీఆర్‌ దగ్గర రెస్పెక్ట్‌తో కూర్చుండేవాళ్లం.

 

ఆర్కే: పెద్ద హీరోలతో చేశారు. వాళ్ల అబ్బాయిలతోనూ చేశారు. మహేష్‌బాబు, రాంచరణ్‌, అల్లుఅర్జున్‌, జూ.ఎన్టీఆర్‌లకు మంచి టేకాఫ్‌ ఇచ్చారు కదా?

అశ్వనీదత్: కారణం ఏమీ లేదు. థాంక్స్‌ టు కృష్ణగారు. నేనంటే ఇష్టం ఆయనకు. మహేష్‌బాబును నువ్వే లాంచ్‌ చేయాలని అడగడంతో చేశాను. చిరంజీవిగారు కూడా అరవింద్‌ బ్యానర్‌ ఉన్నా కూడా రాంచరణ్‌ను నువ్వే లాంచ్‌ చేయాలని అడిగారు. దాంతో కాదనలేకపోయాను. హరికృష్ణ అడగడంతో జూ.ఎన్టీఆర్‌తో స్టూడెంట్‌నెం1 తీశాను. అల్లు అర్జున్‌తో గంగోత్రి తీశాను.

 

ఆర్కే: చిరంజీవి గారితో ఎక్కువ స్నేహంగా ఉంటారు. ఎందుకు?

అశ్వనీదత్: 1988 నుంచి మేం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి ఇంకా ఎక్కువ బంధం ఏర్పడింది. మద్రాసు నుంచి ఇద్దరం ఒకేసారి షిఫ్ట్‌ అయ్యాం. ఆయనతో సినిమాలు తీయడం సంతోషాన్నిస్తుంది.

 

ఆర్కే: సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ఎలా వెళ్లారు? మీకు అది సూటయ్యే లక్షణం కాదు కదా?

అశ్వనీదత్: హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిన తర్వాత చంద్రబాబుగారి కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పబ్లిసిటీ చేశాను. అప్పుడే ఆయన్ను బాగా అబ్జర్వ్‌ చేశాను. ఈ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి కూడా ఉంటాడా. ఇంత కష్టపడుతున్నాడు. ఇంత చేస్తున్నాడు. గ్రేట్‌ అనిపించింది. అప్పుడే నాకూ పాలిటిక్స్‌పై ఇంట్రస్ట్‌ కలిగింది. ఆయనతో ఇన్వాల్వ్‌ కావాలి, ఇలాంటి వాళ్లతో కలిసి నడవాలి అనిపించింది. నాకు చాలా అడ్మిరేషన్‌ ఆయనంటే. తెలుగుదేశం పార్టీకి పబ్లిసిటీ చేయడం మాత్రం ఆపను.

 

ఆర్కే: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి మిమ్మల్ని రమ్మన్నట్టున్నారు కదా?

అశ్వనీదత్: రమ్మని డైరెక్టుగా అడగలేదు. 2004లో నేను ఎలక్షన్లలో కంటెస్ట్‌ చేయడానికి కారణం చిరంజీవిగారే. నేను చంద్రబాబు గారితో ఉన్నా కూడా, పార్టీ తరఫున పబ్లిసిటీ చేస్తున్నా.. విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆయన్ను అడగడానికి మొహమాట పడ్డాను. నా ఆలోచనలను రాఘవేంద్రరావు, చిరంజీవికి చెప్పేవాడిని. ఈ విషయంపై చంద్రబాబుగారిని చిరంజీవి అడగ్గానే ఆయన అంగీకరించారు. అందుకే నా అంతట నేను వస్తే తప్ప పీఆర్పీలోకి రమ్మని అడగడం బాగోదని చిరంజీవిగారు నన్ను అడగలేదు.

 

ఆర్కే: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌ కింద రామ్‌చరణ్‌, శ్రీదేవి కూతురిని పెట్టి తీసే ఆలోచన ఏదైనా ఉందా?

అశ్వనీదత్: వీళ్లతోనే తీయాలనే ఆలోచన అయితే లేదు. సీక్వెల్‌ ఎలా తీయలో రెండు మూడు కథలు అనుకున్నా కుదరలేదు. దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కథ ప్రకారం దానికి ఎవరు సూటయితే వాళ్లతో తీస్తాం.

 

ఆర్కే: ఒక సీనియర్‌ ప్రొడ్యూసర్‌గా మీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్తవాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటి?

అశ్వనీదత్: ఇది వ్యాపారంగా చేస్తే తప్పు లేదు. అయితే ఏదైనా ఒక వ్యాపారం చెయ్యడానికి దానిపై కొంతైనా అవగాహన ఉండాలి. సినిమా తీద్దామనుకుంటే కొంత మ్యూజిక్‌ టేస్ట్‌ ఉండాలి. సినిమా లెంగ్త్‌ విషయంలో వెయిటింగ్‌ సెన్స్‌, ఈస్తటిక్‌ సెన్స్‌ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా కామన్‌సెన్స్‌ అవసరం. పగలంతా పనిచేసి వచ్చే సామాన్యుడికి ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలీఫ్‌ ఇవ్వగలగాలి.


ఆర్కే: మీరు చేపట్టే కొత్త ప్రాజక్టుల్లో మీ ఫ్రెండ్‌ రాఘవేంద్రరావు గారున్నారా?

అశ్వనీదత్: లేరు. నేను అనుకున్న దాంట్లో ఆయన ఎక్కడా లేరు. జగదేకవీరుడు సీక్వెల్‌ కుదిరితే ఆయనతోనే చేస్తాను. దీనిపై ఆయనతో చర్చించాను కూడా. ఆయనంటే నాకు చాలా గౌరవం.


ఆర్కే: సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌గా మార్కులు ఇవ్వాల్సి వస్తే మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు?

అశ్వనీదత్: నాకంటే చాలా ఎక్కువ డబ్బులతో ఇండస్ట్రీలోకి వచ్చి, ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయిన వాళ్లతో పోలిస్తే నేను చాలా లక్కీ. నేను 60 శాతం సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌నే అనుకుంటాను.


ఆర్కే: మరి ఒక ఫాదర్‌గా..?

అశ్వనీదత్: తండ్రిగా నూరు శాతం సక్సెస్‌ అయ్యాననే అనుకుంటాను. నాకంటే వాళ్ల మదర్‌గా నా భార్య ఎక్కువ గర్వపడుతుంది. తనే వాళ్లను బాగా చదివించింది. అన్నీ దగ్గరుండి చూసుకుంది.

 

ఆర్కే: గత రెండేళ్లుగా సినిమాలు తీయడం లేదు కదా. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

అశ్వనీదత్: ట్రావెలింగ్‌లోనే ఎక్కువ ఉంటాను. బెంగళూరులో 2006లో 27 కోట్లు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పెట్టుబడి పెట్టాను. వారంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కోయంబత్తూరు, చెన్నై వెళ్తుంటాను. నాకు ఫ్రెండ్స్‌ సర్కిల్‌ చాలా ఎక్కువ. శని, ఆదివారాల్లో వాళ్లతో గడుపుతుంటాను.

 

ఆర్కే: మీ మైనస్‌, ప్లస్‌లు ఏంటి?

అశ్వనీదత్: బాగా యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు కొద్దిగా కోపం ఉండేది. అది నాకు మైనస్‌ అనుకునేవాడిని. అయితే ఆ కోపం ఇప్పుడు లేదు. అవగాహన ఎక్కువుంది. అందరితోనూ సరదాగా ఉంటాను. నా జడ్జిమెంటే నాకు బలం. సినిమా ఆడుతుందో, పోతుందో ముందే తెలిసిపోతుంది.

 

ఆర్కే: నిర్మాతగా, తండ్రిగా చేదు అనుభవాలు ఉన్నాయా?

అశ్వనీదత్: అనుకున్న విధంగా ఆడకుండా సినిమా బాగా డిజప్పాయింట్‌ చేయడం నిర్మాతగా చేదు అనుభవం. ఇక తండ్రిగా అంటే... మా పెద్దమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటానన్నప్పుడు ఒకటిన్నర నెల వరకూ మూడ్‌ అవుట్‌ అయిపోయాను. రెండో అమ్మాయి విషయానికి వచ్చేసరికి అలవాటయిపోయింది. మూడో అమ్మాయి మాత్రం పెళ్లి విషయం నా ఇష్టానికే వదిలేసింది.

 

ఆర్కే: 2017, 18లో సినిమాలు తీస్తామన్నారు. మరి ఈ రెండేళ్ల తర్వాత ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

అశ్వనీదత్: ఇంకా ఏం అనుకోలేదు. 2019 ఎలక్షన్లలో టీడీపీకి పబ్లిసిటీ చేస్తాను. నా లైఫ్‌ యాంబిషన్‌ ఏమిటంటే... అమరావతిలో ఒకపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టిస్తాను. అక్కడే ఒక మల్టీప్లెక్స్‌, హోటల్‌ కట్టించి, వాటిని చూసుకుంటూ ఎంజాయ్‌ చేస్తాను.

 

ఆర్కే: సమీప భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ అమరావతికి విస్తరించే అవకాశం ఉందా?

అశ్వనీదత్: నాకు తెలిసి ఎప్పటికీ ఉండదు. ఇదే మాట చంద్రబాబుగారికి కూడా చెప్పాను. మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కి రావడానికే చాలా సంవత్సరాలు పట్టింది. సంవత్సరంలో తొమ్మిది నుంచి పది నెలలు చల్లగా ఉండటం ఇక్కడ గ్రేటెస్ట్‌ అడ్వాటేజ్‌. చక్కటి ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో పాటు రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణా స్టూడియోస్‌ ఉన్నాయి. ఇంతకంటే గొప్ప స్టూడియోలు ఇక రావు. భవిష్యత్తులో స్టూడియోలతో కూడా పెద్ద పనుండదు. వైజాగ్‌, ఈస్ట్‌ గోదావరిలో అవుట్‌డోర్‌ షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్‌ మంచి సూటబుల్‌ ప్లేస్‌.

 

ఆర్కే: మీ సినిమాల్లో పాటల సెలక్షన్‌ విషయంలో ఏవైనా డిస్పూట్స్‌ వచ్చాయా?

అశ్వనీదత్: ఒక ట్యూన్‌ బాగుంటుంది అనుకుంటే ఇక ఎవరు చెప్పినా వినను. ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ పాటను ఇళయరాజాగారు కంపోజ్‌ చేసినప్పుడు డిస్కషన్‌ వచ్చింది. అది సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని అప్పుడే చెప్పాను. ‘చూడాలని ఉంది’ సినిమాలో ‘రామ్మా చిలకమ్మా’ పాట విషయంలో కూడా ఇదే చర్చ జరిగింది. ఏ ట్యూన్‌ అయినా నేను సెలక్ట్‌ చేశానంటే ఇక మార్చడానికి ఇష్టపడను.

 

- నా పిల్లలు స్వప్న, ప్రియాంక, స్రవంతి ముగ్గురూ అమెరికాలో ఎంబీఎ పూర్తిచేశారు. ప్రియాంకకు మ్యూజిక్‌ టేస్ట్‌ ఎక్కువ. స్వప్నకు సినిమా సెన్స్‌ బాగా ఉంది. వాళ్లు ఇక్కడకు వచ్చాక ఒకటి రెండు సినిమాలు తీశారు. పేరు, అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు మాత్రం రాలేదు.

 

- ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తీయడానికి పిల్లలు చాలా కష్టపడ్డారు. ఆ సినిమా విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. సినిమాను కూడా రిలీజైన తర్వాత థియేటర్‌లోనే చూస్తానని చెప్పాను. తర్వాత ఆ సినిమా చూసి షాక్‌ అయ్యాను. మరో 20 ఏళ్ల తర్వాత కూడా నేనైతే ఇలాంటి సినిమా తీయను, చాలా ధైర్యంగా తీశారు అని చెప్పాను. మ్యూజిక్‌, పబ్లిసిటీ విషయాల్లో వాళ్లకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటాను.

 

- చిరంజీవి, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌తో సినిమాలు తీయాలని ప్లాన్‌ చేస్తున్నాను. 2017, 2018లో ఆరేడు సినిమాలు తీస్తాను. 2018 చివరినాటికి రిటైర్‌ అవుతాను. ఆ తర్వాత వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నా పిల్లలే చూసుకుంటారు.

 

- డీమానిటైజేషన్‌ ప్రభావంతో కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ కొంత తగ్గే అవకాశం ఉంది. ఏదో ఒక సినిమా తీసేద్దాం అనుకునే వారి సంఖ్య తగ్గి, మంచి సినిమాను, డిఫరెంట్‌గా తీద్దాం అనుకునేవాళ్లకు అవకాశం వస్తుంది. క్యాష్‌ అందుబాటులో లేకపోవడం వల్ల బెనిఫిట్‌ షోల సంఖ్య తగ్గుతుంది. టికెట్‌ రేటును ఒకేసారి విపరీతంగా పెంచడం వంటివన్నీ ఉండవు. చాలా మార్పులు వస్తాయి. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది.

 

- చిన్నప్పుడు కేవీ రెడ్డి, విఠలాచార్య నాఅభిమాన దర్శకులు. కొద్దిగా వయసు వచ్చాక ఆదుర్తి సుబ్బారావు గారంటే అభిమానం. నేను ఇండస్ట్రీకి వచ్చాక నా స్ట్రాంగ్ ఫీలింగ్‌ ఏంటంటే ఆ ముగ్గురి కలబోత రాఘవేద్రరావుగారు. ఆయన అన్నీ చేయగలరు. మా జనరేషన్‌లో చూసిన గొప్ప డైరెక్టర్‌ ఆయన. సెల్యులాయిడ్‌ మీద గొప్ప వ్యక్తి.

 

మహానటి సావిత్రి గారి బయోపిక్‌ మా అమ్మాయి స్వప్న ప్లాన్‌ చేసింది. ఈ సినిమాలో లీడ్‌ క్యారెక్టర్‌ను కీర్తి సురేష్‌ చేస్తోంది. కథను, కథనాన్ని నడిపించే మరో మెయిన్‌ క్యారెక్టర్‌ సమంత చేస్తోంది. రామారావు, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారవు, గుమ్మడి, జెమినీ గణేశన్‌ అందరి క్యారెక్టర్లు ఇందులో ఉంటాయి. అయితే ఈ పాత్రలకు సరిపోయే నటులను ఎక్కడనుంచి తెస్తారో చూడాలి. ఇది సాహసమే అయినా వాళ్లు గ్యారెంటీగా సక్సెస్‌ అవుతారు.

 

రాఘవేంద్రరావుతో 14 సినిమాలు చేశాను. అవి ఎప్పుడు పూర్తయ్యాయో కూడా తెలియదు. కెవి. మహదేవన్‌, ఆత్రేయ, సుందరరామ్మూర్తి, ఇళయరాజా లాంటివారితో పయనం నాకు లభించిన గొప్ప వరం.

 

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు 35 లక్షలు లాభం వచ్చింది. ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇంద్ర. ఆరేడు కోట్ల వరకు లాభం వచ్చింది.

 

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. 10 శాతం సక్సెస్‌ ఉంటే 90 శాతం పరాజయాలే ఉంటాయి. ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతలు ఐదారుగురు మాత్రమే కనిపిస్తారు.

 

ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు నిర్మాతకు చాలా గౌరవం ఇచ్చే వారు. ఎంతో డబ్బు తెచ్చిపెడుతున్నారని రెస్పెక్ట్‌ ఇచ్చేవారు.

 

అశ్వమేధం, గోవిందా గోవిందాతో పూర్తిగా పోగొట్టుకున్న సమయంలో శుభలగ్నం సినిమా నన్ను ఆదుకుంది. అలాగే పెళ్లిసందడి, పెళ్లాం ఊరెళితే.. ఇలా చాలా సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

 

రామకృష్ణసిద్ధాంతి అని మా నాన్నకు ఫ్రెండ్‌ ఉండేవారు. ఆయనకు జ్యోతిషంలో బాగా పట్టుంది. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్‌కు ముందు ఒకసారి ఆయన దగ్గరకు వెళ్లాను. సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నావు అడిగితే మే 9న అని చెప్పాను.

 

ఆ సమయంలో తుపాన్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే తుపాన్‌కు మించిన డబ్బులు కూడా నీకొస్తాయి రిలీజ్‌ చేయి అన్నాడు. రిలీజ్‌ తరువాత ఒకసారి కనిపించు అన్నాడు. నిజంగానే తుపాన్‌ వచ్చింది, అంతకు మించి డబ్బులు వచ్చాయి.

 

సిద్ధాంతి దగ్గర మరోసారి వెళితే రోజూ బ్యాంకుకు వందరూపాయలు పంపించి రూపాయి నోట్లు తెప్పించుకో. వాటిని రోజంతా చించుతూ కూర్చో. ఒక ఏడాది అలా చేయి అన్నాడు. ఎందుకంటే ఈ సమయంలో నీవు వ్యాపారం చేస్తే అంతకన్నా ఎక్కువ నష్టం వస్తుంది అన్నాడు.(నవ్వులు) బాగానే చెప్పారు కానీ, మనం వ్యాపారం చేయకుండా ఎలా ఉంటాం అని వెళ్లిపోయా. కొద్ది రోజులకే బ్రహ్మర్షివిశ్వామిత్ర విడుదలయితే కొన్నా. భారీ నష్టం వచ్చింది. ఆ తరువాత ఆశ్వమేధం.. గోవిందా గోవిందాలతో భారీ నష్టాలు వచ్చాయి. తరువాత మళ్లీ సిద్ధాంతి దగ్గరకు వెళితే పర్లేదు. ఇప్పుడు తీయి బాగానే ఉంటుంది అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డితో శుభలగ్నం తీశా. సూపర్‌డూపర్‌ హిట్టయింది.

 

2009లో సిద్ధాంతి ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే వెళ్లా. ‘‘నీకిప్పుడు ఏలినాటి శని నడుస్తోంది. సినిమాలు ఏమీ తీయమాకు. జాగ్రత్తగా ఉండు. నాన్నగారు కూడా కాలం చేస్తారు’’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టే 2010 జనవరి 30లో నాన్న చనిపోయాడు. ఆయన మాట వినకుండా శక్తి సినిమా తీశాను. 25 కోట్లు లాస్‌. అందరూ కష్టపడ్డారు.

కానీ రాంగ్‌ సబ్జెక్ట్‌. శక్తిపీఠాలు, అమ్మవారితో సినిమా తీయడం మంచిది కాదని రజనీకాంత్ గారు కూడా చెప్పారు. వినకుండా తీశాను.


ఆర్కే: అమరావతిలో మీరు అద్భుతమైన కట్టడం నిర్మించాలని కోరుకుంటూ.. సెలవు.


Updated Date - 2020-02-08T08:06:14+05:30 IST