Abn logo
Jul 8 2021 @ 00:22AM

అసమాన నటుడు

సీనియర్‌ నటుడు దిలీప్‌కుమార్‌ మృతితో భారతీయ సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. హిందీ సినిమా స్వర్ణయుగంలో  దిలీప్‌కుమార్‌ది ప్రత్యేకమైన ముద్ర. మన దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న వేళ పాకిస్థాన్‌లోని పెషావర్‌ నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన పఠాన్‌ యువకుడైన మొహమ్మద్‌ యూసుఫ్‌ఖాన్‌ తన శైలీ అభినయం (మెథడ్‌ యాక్టింగ్)తో నటనకు సరికొత్త నిర్వచనమిస్తూ, తెర మీద విషాదాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి నింపుతూ దిలీప్‌కుమార్‌గా మారడం ఒక చరిత్ర. 


హిందీ సినిమా దిలీప్‌కుమార్‌ ఆగమనంతోనే భావోద్వేగాలను బలంగా చెప్పడం నేర్చుకుందనేది వాస్తవం. వినోదం ప్రధానమైన చోట విషాదం కూడా విలువైనదేనని... ఆ విషాదవదనంతోనే ‘ట్రాజెడీ కింగ్‌’గా ప్రఖ్యాతిని దక్కించుకోవడం ఒక్క దిలీప్‌కుమార్‌కే సాధ్యమైంది. తొలి సినిమా ‘జ్వర్‌ భాటా’తో పాటు కెరీర్‌ తొలినాళ్లలోని ‘జుగ్ను’, ‘షాహీద్‌’లను వదిలేస్తే... ‘అందాజ్‌’లో భగ్న ప్రేమికుడిగా ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రాజ్‌కపూర్‌, నర్గీస్‌ వంటి ఉద్ధండులు ఉన్నప్పటికీ అప్పుడప్పుడే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన దిలీప్‌ బరువైన పాత్రను అవలీలగా మోయడం ఆయనను స్టార్‌ను చేసింది. ప్రసిద్ధ దర్శకుడు బిమల్‌రాయ్‌ తీసిన ‘దేవ్‌దాస్‌’, ‘మధుమతి’... ఆసిఫ్‌ తీసిన చారిత్రాత్మక చిత్రం ‘మొఘల్‌ ఏ ఆజామ్‌’లు దిలీప్‌కుమార్‌పై ‘ట్రాజెడీ కింగ్‌’ ముద్ర వేశాయి. గుండెల్నిండా విషాదాన్ని నింపుకుని, ఏ మాత్రం నాటకీయత లేకుండా మెథడ్‌ యాక్టింగ్‌ పద్ధతిలో బరువైన డైలాగులు చెప్పడం ఆయనకు మాత్రమే చేతనైన విద్య. ఆయన సహనటులు రాజేంద్రకుమార్‌, మనోజ్‌కుమార్‌, ధర్మేంద్రల నుంచి ఆ తర్వాతి తరమైన అమితాబ్‌బచ్చన్‌, షారుక్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ఖాన్‌ల దాకా... తెరమీద విషాదాన్ని చూపాల్సిన సందర్భాల్లో అందరికీ దిలీప్‌కుమారే ఆదర్శం. 50, 60 దశకాల్లో తెరపై దిలీప్‌ నటనను చూసి బయట అనేకమంది యువకులు ఆయనను అనుకరించేవారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్వాతంత్ర్యానంతరం 50వ దశకంలో మారుతున్న భారత సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని ఆయన నటించిన ‘ఫుట్‌పాత్‌’, ‘నయాదౌర్‌’, ‘గంగా జమున’, ‘లీడర్‌’ సినిమాలు స్పష్టంగా చూపాయి. కమ్యూనిజం, సోషలిజం గురించి తెర మీద కథానాయకుడిగా దిలీప్‌కుమార్‌ పలికే డైలాగులు విని యువతరం ఊగిపోయేది. సాదాసీదా యువకుడిగా కనిపించే ఆయన పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకునేవారు. రొమాంటిసిజం కన్నా... విషాదం ఎంత బలంగా ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోతుందో తెలియజేసిన మహానటుడాయన. 


పాత్ర పోషణలో దిలీప్‌కుమార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఆయనను మిగతా నటులకు భిన్నంగా నిలబెట్టింది. దర్శకుడు ఆయనకు 30 ఏళ్ల యువకుడి పాత్ర ఇస్తే, అంతకుముందు 29 ఏళ్లలో అతడు ఎలా ఉండి ఉంటాడో కూడా ‘క్యారెక్టర్‌ స్టడీ’ చేయడం దిలీప్‌కు అలవాటు. అందుకే ఆయన ఏ పాత్ర వేసినా... అది మెచ్యూర్డ్‌గా కనిపిస్తుంది. భావోద్వేగాలతో గుండెను బరువెక్కిస్తుంది. అయితే దిలీప్‌కుమార్‌ను అందరూ ట్రాజెడీ కింగ్‌గానే చూస్తారు గానీ కెరీర్‌లో ఆయన చేసిన ప్రయోగాలు చాలా ఉన్నాయి. ‘మధుమతి’లో పునర్జన్మల ట్రెండ్‌, ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’లో ట్విన్స్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇప్పటికీ పలు భాషల్లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. తొలి ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు అందుకున్నది కూడా ఆయనే. భారత, పాకిస్తాన్‌ అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా దిలీప్‌ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అమితాబ్‌ వ్యాఖ్యానించినట్లుగా ‘చిత్రసీమ గురించి చెప్పుకోవాలంటే దిలీప్‌కుమార్‌ ముందు... దిలీప్‌కుమార్‌ తర్వాత’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


కాలానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నవాడే ఏ రంగంలోనైనా ఎక్కువ కాలం మనగలుగుతాడు. ఈ నిజాన్ని గ్రహించాడు కాబట్టే ‘దిలీప్‌ సాబ్‌’ ప్రతీ మజిలీని అర్థవంతంగా ముగించాడు. అది కెరీర్‌ అయినా, పెళ్లయినా, రాజకీయాలైనా. తెరమీద తిరుగులేని ట్రాజెడీ కింగ్‌గా కనిపించినప్పటికీ... ఒక సాధారణ వ్యక్తిగా సైరాబానుతో 55 ఏళ్ల వైవాహిక బంధాన్ని, 98 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని చూసి అద్భుతంగా నిష్క్రమించిన అసమాన నటుడు దిలీప్‌కుమార్‌.

ప్రత్యేకంమరిన్ని...