హైతీలో ఘోర దుర్ఘటన.. పెట్రోలు ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

ABN , First Publish Date - 2021-12-15T02:09:18+05:30 IST

కరీబియన్ కంట్రీ హైతీలో ఘోర దుర్ఘటన జరిగింది. పెట్రోలు ట్యాంకర్ పేలిన ఘటనలో 50 మంది సజీవ

హైతీలో ఘోర దుర్ఘటన.. పెట్రోలు ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

పోర్టౌ ప్రిన్స్: కరీబియన్ కంట్రీ హైతీలో ఘోర దుర్ఘటన జరిగింది. పెట్రోలు ట్యాంకర్ పేలిన ఘటనలో 50 మంది సజీవ దహనమయ్యారు. కేప్-హైతియెన్ నగరంలో జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడిన మరికొందరు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.


సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో తాను 50కిపైగా కాలిబూడిదైన మృతదేహాలను చూసినట్టు చెప్పారు. ప్రధానమంత్రి ఏరియెల్ హెన్రీ మాత్రం చనిపోయిన వారి సంఖ్య 40 వరకు ఉండొచ్చని సంఘటన జరిగిన తర్వాత చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


‘‘మంటల్లో కాలిపోతున్న 50-54 మందిని నేను చూశాను’’ అని డిప్యూటీ మేయర్ తెలిపారు. వారిని గుర్తించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఓ మోటార్ సైకిల్ ట్యాక్సీని తప్పించే క్రమంలో ట్యాంక్ అదుపుతప్పి బోల్తా పడినట్టు పేర్కొన్నారు. ట్యాంకర్ నుంచి చిందిన పెట్రోలును పట్టుకునేందుకు పాదచారులు, స్థానికులు పోటెత్తారు.


ఈ క్రమంలో ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. కాగా, రోడ్డు పక్కన చిందిన పెట్రోలు కారణంగా దాదాపు 20 ఇళ్లు కూడా కాలిబూడిదైనట్టు అల్మోనోర్ తెలిపారు. ఆ ఇళ్లలో ఎంతమంది ఉన్నారన్న విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-15T02:09:18+05:30 IST