రాత్రి వేళ.. తలుపులు పగలగొట్టి పట్టాభి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-21T08:08:33+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం రాత్రి హైడ్రామా మధ్య పోలీసులు అరెస్టు చేశారు.

రాత్రి వేళ.. తలుపులు పగలగొట్టి పట్టాభి అరెస్టు

  • నా శరీరంపై ఏ గాయాలూ లేవు చూడండి
  • చిన్న గీత పడినా సీఎం, డీజీపీదే బాధ్యత
  • అరెస్టుకు ముందు పట్టాభి వీడియో విడుదల


విజయవాడ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి):  టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం రాత్రి హైడ్రామా మధ్య పోలీసులు అరెస్టు చేశారు. తలుపులు పగులకొట్టి మరీ లోపలకు వెళ్లి భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేశారు. ఉదయం నుంచి పట్టాభి బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. తన ఇంటి వద్ద మధ్యాహ్నం వరకు పదిమంది ఉన్న పోలీసుల సంఖ్య సాయంత్రానికి ఒక్కసారిగా పెరగడంతో కచ్చితంగా అరెస్టు చేస్తారని పట్టాభి అనుమానించారు. పోలీసులు పలుమార్లు తలుపులు తట్టినా, కాలింగ్‌ బెల్‌ మోగించినా ఆయన నుంచి స్పందన రాలేదు. అయినా పోలీసులు అక్కడి నుంచి కదల్లేదు. ప్రతి నిమిషానికి బలగాల సంఖ్య పెరిగింది. రాత్రి 9గంటల సమయంలో పోలీసులు పట్టాభి ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అటువైపు రాకుండా ఆంక్షలను కఠినం చేశారు. రహదారికి రెండువైపులా రోప్‌పార్టీలు సిద్ధం చేశారు. పోలీసు వాహనాలను ఒక క్రమంలో పెట్టుకున్నారు. పట్టాభి ఇంటివద్ద ఉన్న మీడియాను అర కిలోమీటరు దూరానికి పంపేశారు. ఆ తర్వాత యాక్షన్‌ ప్రారంభించారు. గేటు దాటుకుని లోపలకు వెళ్లి ఇంటి తలుపులను పగులగొట్టారు. బలంగా ఉన్న గడియలను విరగ్గొట్టి చకాచకా లోపలకు ప్రవేశించి పట్టాభిని అరెస్టు చేస్తున్నట్టు వెల్లడించారు. 


కొద్దిసేపు పట్టాభితో పోలీసులు మాట్లాడారు. పట్టాభి వద్దకు వెళ్తున్న ఆయన భార్య చందనను మహిళా పోలీసులు అడ్డుకున్నారు. గవర్నరుపేట పోలీసులు ఇచ్చిన సీఆర్పీసీ 50(2) నోటీసును చందనకు అందజేశారు. అందులో పట్టాభిపై నమోదైన కేసులతో పాటు, ఆయనను అరెస్టు చేసి విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చుతున్నట్టు పేర్కొన్నారు. అనంతరం భారీ కాన్వాయ్‌ మధ్య పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.   సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పీఎ్‌సలో కేసు నమోదైంది. ఈ విషయాన్ని పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టాభిపై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు. 


అంతమొందించడానికి సీఎం కుట్ర: పట్టాభి

తనను అరెస్టు చేయడం ఖాయమని గ్రహించిన పట్టాభి ముందుగా ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు.  ‘‘పోలీసులు అర్ధరాత్రి అయినా నన్ను అరెస్టు చేస్తారు. బ్లూ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి జిమ్మిక్కులైనా చేస్తుంది. ఆధారాలను ఎలాగైనా మార్పు చేస్తుంది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు ఉదంతం చూసిన తర్వాత ఈ వీడియోను విడుదల చేయాల్సి వస్తోంది.  నన్ను పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టడానికి సీఎం కుట్ర పన్నాడు. అందుకే నా శరీరం మొత్తాన్ని చూపిస్తున్నాం’’ అని ఆ వీడియోలో పట్టాభి పేర్కొన్నారు.   మరోవైపు... ‘‘పట్టాభికి హాని తలపెట్టాలని పోలీసులు చూస్తున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, డీజీపీదే బాధ్యత. తక్షణం పట్టాభిని కోర్టు ముందు హాజరుపర్చాలి. బోస్‌డీకే అనేది రాజద్రోహం అయితే... వైసీపీ నేతల అసభ్య భాష ఏ ద్రోహం కిందకు వస్తుందో డీజీపీ చెప్పాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.


మా ఇంట్లో విధ్వంసం చేసిన వారిని ఇప్పటివరకు పట్టుకోలేదు. ఏ కారణం లేకుండా నా భర్తను అరెస్టు చేశారు. ఆయనకు ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిది, డీజీపీదే బాధ్యత. ఉదయం నుంచి తలుపులు వేసుకుని ఉన్నాం. పోలీసులు వచ్చి పెన్‌డ్రైవ్‌ కావాలన్నారు. తర్వాత ఇంత దారుణంగా తలుపులు పగలగొట్టి లోపలకు వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం ఎఫ్‌ఆర్‌ఐ కాపీ చూపించలేదు. ఇంత దౌర్జన్యంగా అరెస్టు చేయడానికి ఆయన ఏమైనా టెర్రరిస్టా? కచ్చితంగా దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ఆయన జీవితానికి చాలా థ్రెట్‌ ఉంది. ఆయన జీవితం కోసం కాపలా కాసుకుని ఉండాలి. మాకు నోటీసు ఏమీ ఇవ్వలేదు. నేను వెళ్తుంటే మహిళా పోలీసులు ఆపేశారు. 

- చందన, పట్టాభి సతీమణి

Updated Date - 2021-10-21T08:08:33+05:30 IST