రాత్రి వరకూ పోలీసు స్టేషన్‌లోనే..

ABN , First Publish Date - 2022-09-02T06:13:34+05:30 IST

డోన్‌ మండలంలో మరో టీడీపీ ముఖ్య నాయకుడిని అధికార వైసీపీ నాయకులు టార్గెట్‌ చేశారు.

రాత్రి వరకూ పోలీసు స్టేషన్‌లోనే..
డోన్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అర్జున్‌రెడ్డితో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి

సిమెంటు కొనుగోలు అక్రమమంటూ కమలాపురం సర్పంచ్‌ నిర్బంధం
టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం


డోన్‌, సెప్టెంబరు 1: డోన్‌ మండలంలో మరో టీడీపీ ముఖ్య నాయకుడిని అధికార వైసీపీ నాయకులు టార్గెట్‌ చేశారు. కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌రెడ్డిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని రాత్రివరకు స్టేషన్‌లోనే ఉంచారు. టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డోన్‌ మండల టీడీపీలో కమాపురం సర్పంచ్‌ అర్జున్‌ రెడ్డి కీలకనేతగా ఉన్నారు. పట్టణంతో పాటు మండలంలోని  వివిధ గ్రామాల్లో మంచి పట్టు ఉంది. అదే విధంగా మండలంలో ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు అర్జున్‌ రెడ్డి చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఒక  సంస్థ పేరుతో బనగానపల్లెలో ఉన్న సిమెంటు ఫ్యాక్టరీ ద్వారా కృష్ణ అనే సివిల్‌ కాంట్రాక్టరు నుంచి 120 సిమెంటు బస్తాలను అర్జున్‌ రెడ్డి కొనుగోలు చేశారు. శుభమ్‌ హోమ్‌ డెవలపర్స్‌ పేరుతో జీఎస్టీతో కలిపి రూ.36,480 చెల్లించి బిల్లు కూడా తీసుకున్నారు. టీడీపీ నేత అర్జున్‌రెడ్డిని టార్గెట్‌ చేసిన వైసీపీ ముఖ్య నాయకులు పోలీసులను రంగంలోకి దించారు. సిమెంటుకు బిల్లులు లేకుండా తరలిస్తున్నారని ఒక ఎస్‌ఐకి సమాచారం ఇచ్చారు. అంతేగాక అధికార పార్టీ నాయకులు పట్టణ సీఐని రంగంలోకి దించారు. సిమెంటును లోడు చేస్తున్న స్థలంలో ఉన్న లారీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సిమెంటు కొనుగోలు సంబంధించిన బిల్లులు ఏవైనా ఉంటే తీసుకురావాలని అర్జున్‌రెడ్డికి ఆదేశించారు. దీంతో కమలాపురంలో వినాయక విగ్రహానికి సర్పంచ్‌గా అర్జున్‌ రెడ్డి పూజ చేయాల్సి ఉంది. పోలీసులు సిమెంటు కొనుగోలు బిల్లులు తీసుకురావాలని చెప్పడంతో బుధవారం ఉదయం ఆయన పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సిమెంటు కొనుగోలుకు సంబంధించిన బిల్లులు చూసిన సీఐ మల్లికార్జున విచారణ చేయాలని, అంతవరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉండాలని అర్జున్‌ రెడ్డిని ఆదేశించారు. పోలీసు స్టేషన్‌లో నిర్బంధించినట్లు తెలుసుకున్న టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు పార్టీ శ్రేణులు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు భారీగా తరలివచ్చారు.

 పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అర్జున్‌రెడ్డి ఏం తప్పు చేశారని ధర్మవరం సుబ్బారెడ్డి పోలీసు అధికారులను ప్రశ్నించారు. స్టేషన్‌ వద్ద ధర్నాకు దిగడంతో పట్టణ సీఐ బెదిరింపు ధోరణితో మాట్లాడడం సరికాదని టీడీపీ శ్రేణులు అన్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో సుబ్బారెడ్డి మాట్లాడారు. సిమెంటు కొనుగోలుకు సంబంధించి బిల్లులను చూపించిన తర్వాత 10 గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌లోనే ఎలా నిర్బంధిస్తారని ప్రశ్నించారు. అర్జున్‌రెడ్డిని ఇంటికి పంపించాలని డీఎస్పీని ఆయన కోరారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా టీడీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్‌ వద్దనే భీష్మించి కూర్చున్నారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో సర్పంచ్‌ అర్జున్‌ రెడ్డిని పోలీస్‌స్టేషన్‌ బెయిల్‌ మీద సీఐ మల్లికార్జున ఇంటికి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

జీఎస్‌టీ తక్కువ చెల్లిస్తున్నారట

టీడీపీ నేత, కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి సిమెంటు కొనుగోలులో జీఎస్టీ తక్కువ చెల్లిస్తున్నారని పట్టణ సీఐ మల్లికార్జున వాదిస్తున్నారు. నాన్‌ ట్రేడర్‌ వద్ద సిమెంటు కొనుగోలు చేశారని సీఐ విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి శుభమ్‌ హోమ్‌ డెవలపర్స్‌ పేరుతో కొనుగోలు చేసిన బిల్లులు కేంద్ర పన్ను జీఎస్టీ కింద 14 శాతం, రాష్ట్ర పన్ను జీఎస్టీ కింద 14 శాతం చెల్లించినట్లు  వివరాలు ఉన్నాయి. అంతేగాక కృష్ణ అనే సివిల్‌ కాంట్రాక్టరు నుంచి సిమెంటును కొనుగోలు చేసినట్లు బిల్లులో వివరాలు నమోదయ్యాయి. అయినప్పటికీ టీడీపీ నేత అర్జున్‌రెడ్డిని టార్గెట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి వరకు నిర్బంధించిన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Updated Date - 2022-09-02T06:13:34+05:30 IST