ఘనంగా జరిగిన ‘ఆటా’ ఉగాది సాహిత్య సదస్సు

ABN , First Publish Date - 2021-04-19T06:13:54+05:30 IST

‘ఆటా ఉగాది సాహిత్య సదస్సు’ కార్యక్రమాన్ని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏప్రిల్ 17న అంతర్జాలం వేదికగా

ఘనంగా జరిగిన ‘ఆటా’ ఉగాది సాహిత్య సదస్సు

వాషింగ్టన్: ‘ఆటా ఉగాది సాహిత్య సదస్సు’ కార్యక్రమాన్ని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏప్రిల్ 17న అంతర్జాలం వేదికగా ఘనంగా జరిగింది. అధ్యక్షుడు భువనేశ్ బూజాల, ఆటా కార్యవర్గ బృందం ఆధ్వర్యంలో సాహిత్య వేదిక కమిటి అధిపతి శారద సింగిరెడ్డి, సహ బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.


ముందుగా శారద సింగిరెడ్డి మాట్లాడుతూ.. ఉగాది శుభాకాంక్షల తెలియజేస్తూ సభకి స్వాగతం పలికారు. సాహిత్యం కేవలం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా వ్యక్తి వ్యక్తిత్వంలో వికాసానికి కూడా తోడ్పడుతుందన్నారు. అనంతరం ఆటా సాంస్కృతిక విభాగం ఉపాధిపతి యామిని స్ఫూర్తి మేడూరు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భువనేశ్ బూజాల ప్రసంగిస్తూ తెలుగు వారందరికి ఆటా సంస్థ తరఫున ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆటా సంస్థ మన సంస్కృతిని గౌరవిస్తూ, మన సంప్రదాయాన్ని ప్రేమిస్తూ, మన విలువలని కాపాడుకుంటూ, మన పండగలను బంధు మిత్రులతో జరుకుంటూ వీటన్నింటినీ ముఖ్యంగా బావి తరాలకు అందిస్తూ ముందుకు వెళుతోంది’ అని అన్నారు. ఆటా ఎప్పటికీ మన భాషకి, సాహిత్యానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. 



శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు డా.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి.. పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం.. మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు ‘ఆశావాది-ఉగాది’ అనే అంశంపై అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు పలు సూచనలు చేశారు. ప్రముఖ సినీగేయ రచయిత వనమాలి.. మారుతున్న కాలంలో సినీగేయ రచయితల పరిస్థితులు, తెలుగు భాష ప్రాధాన్యతోపాటు పలు అంశాలపై కవితను వినిపించారు. హాస్య అవధాని డా.శంకర్ నారాయణ ‘ఖతర్నాక్ మన్మధ కాస్త జాగ్రత్త’ అంటూ తనదైన శైలిలో కవితలను చదివి వినిపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రముఖ కవి డా. అఫ్సర్ కరోనా సమయంలో ఏర్పడుతున్న పరిస్థితుల గురించి వివరిస్తూనే మరోవైపు ప్లవ సంవత్సరంలో ‘భావి అశలుగా భ్రాతగా ఉండాలి’ అనే చక్కటి కవితను చదివి వినిపించారు. పాత్రికేయులు ముని సురేష్ పిళ్లై.. ‘ఎందుకు’ అనే కథా శీర్షికతలో ఓ కవితను వినపించారు. చివరగా.. సాహిత్య వేదిక కమిటి ఉపాధిపతి పవన్ గిర్ల.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆటా కార్యవర్గ సభ్యులకు, సాంకేతిక నిపుణులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 


Updated Date - 2021-04-19T06:13:54+05:30 IST