అథ్లెట్‌ కుటుంబం ఆకలి కేకలు

ABN , First Publish Date - 2020-05-14T10:12:28+05:30 IST

ఆమె అథ్లెట్‌. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అసలే పేద కుటుంబం. దానికితోడు కరోనాతో లాక్‌డౌన్‌...

అథ్లెట్‌ కుటుంబం ఆకలి కేకలు

నాగ్‌పూర్‌: ఆమె అథ్లెట్‌. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అసలే పేద కుటుంబం. దానికితోడు కరోనాతో లాక్‌డౌన్‌. దాంతో ఆ క్రీడాకారిణి కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. నాగ్‌పూర్‌లోని సిరా్‌సపేట్‌ మురికివాడలో నివసించే 24 ఏళ్ల ప్రజక్త గోడ్‌బోలె గత ఏడాది ఇటలీలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో 5వేల మీటర్ల పరుగులో పోటీపడింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఆమె తండ్రి విలాస్‌ గోడ్‌బోలె ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దాంతో కేటరింగ్‌ సంస్థలో వంటమనిషిగా పనిచేస్తూ తల్లి అరుణ సంపాదించే రూ. 6 వేలే ఆ కుటుంబానికి ఆధారం. కానీ లాక్‌డౌన్‌తో తల్లికి పని లేకపోవడంతో ప్రజక్త కుటుంబం అల్లాడుతోంది. ‘మా కాలనీ చుట్టుపక్కలవారు బియ్యం, పప్పు ఇతర నిత్యావసరాలు ఇవ్వడంతో అన్నం తినగలుగుతున్నాం. మరో మూడు రోజుల తర్వాత మా పరిస్థితి ఎలానో’ అని ఆమె ఆవేదన చెందింది. ‘లాక్‌డౌన్‌లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ప్రాక్టీస్‌ సంగతి అటుంచి..జీవించడమే సవాలుగా మారింది’ అని ప్రజక్త కంటతడిపెట్టింది. 

Updated Date - 2020-05-14T10:12:28+05:30 IST