ఓ తరం జ్ఞాపకం.. అట్లాస్‌ ప్రస్థానం ఇదీ!

ABN , First Publish Date - 2020-06-06T22:25:58+05:30 IST

అట్లాస్‌ సైకిల్‌‌‌ చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయింది. తన చివరి కర్మాగారాన్ని మూసేస్తున్నట్టు అట్లాస్‌ సైకిల్ తయారీ సంస్థ ప్రకటించడంతో

ఓ తరం జ్ఞాపకం.. అట్లాస్‌ ప్రస్థానం ఇదీ!

ఇంటర్నెట్‌ డెస్క్: అట్లాస్‌ సైకిల్‌‌‌ చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయింది. తన చివరి కర్మాగారాన్ని మూసేస్తున్నట్టు అట్లాస్‌ సైకిల్ తయారీ సంస్థ ప్రకటించడంతో ఒక తరం తన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. ఆ సైకిల్‌తో భారతీయులకు విడదీయలేని బంధముంది. 70 యేళ్ల క్రితం 1951లో హర్యానాలోని సోనెపాట్‌లో అట్లాస్ సైకిల్స్‌ తయారీ ప్రారంభమైన నాటి నుంచి దాదాపు ప్రతి ఇంటితో ఆ అనుబంధం పెనవేసుకుపోయింది. తాజాగా సాహిదాబాద్‌లోని తన చివరి కర్మాగారాన్ని మూసివేస్తున్నట్టు అట్లాస్ సంస్థ ప్రకటించడంతో అట్లాస్‌ చర్చనీయాంశమైంది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌ నోబెల్‌ మ్యూజియంలో అట్లాస్‌ సైకిల్‌ ఉందంటే... దాని ప్రత్యేకత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నోబెల్ మ్యూజియం గోడపై నల్ల అట్లాస్ సైకిల్ వేలాడుతూ కనపడుతుంటుంది. ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తొక్కిన సైకిల్‌ అది.


కోట్లమంది భారతీయులతో ముడిపడిన అట్లాస్‌ సైకిల్‌ చక్రం ముడిపదార్థాలు కూడా కొనలేని స్థితికి చేరింది. తాజాగా అట్లాస్‌ యాజమాన్యం భారత్ ట్రస్ట్ ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత సంక్షోభంలో కర్మాగారాన్ని నడిపించలేమని తెలిపింది. ఈ మేరకు అట్లాస్‌ యాజమాన్యం ఫ్యాక్టరీ గేటుకు నోటీసు అంటించింది. ప్రస్తుతం సంస్థకు గిరీష్‌ కపూర్‌, గౌతమ్‌ కపూర్‌ యజమానులుగా ఉన్నారు. 1951లో అట్లాస్‌ సంస్థను ప్రారంభించిన జానకిదాస్‌ కపూర్‌ స్థాపించారు. 12 నెలల్లొనే 25 ఎకరాల ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌గా రూపకల్పన చేశారు. మొదటి సంవత్సరమే 12వేల సైకిళ్లు విక్రయించిన అట్లాస్‌.. 1958 నుంచి విదేశాలకూ అట్లాస్ సైకిళ్లు ఎగుమతి చేసింది. ఈ జనరేషన్‌లో సైకిల్‌ వాడకం తగ్గడంతో డిమాండ్ పడిపోయింది. డిమాండ్‌ తగ్గడంతో 2004 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. 2014లో మధ్యప్రదేశ్‌లోని మలన్పూర్‌ కర్మాగారం మూసివేసిన సంస్థ..  2018లో తొలి యూనిట్‌ అయిన సోనిపట్‌ కర్మాగారం మూసివేసింది. చివరి యూనిట్‌ కూడా మూసేయడంతో అట్లాస్ ప్రస్థానానికి బ్రేక్ పడినట్టైంది.   

Updated Date - 2020-06-06T22:25:58+05:30 IST