ఏటీఎంలలో నయా చోరీలు

ABN , First Publish Date - 2021-11-17T16:43:43+05:30 IST

ఏటీఎంలలోని సాంకేతిక, బ్యాంకుల సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకున్న ఎనిమిది మంది సభ్యుల హరియాణా గ్యాంగ్‌ భారీ గా దోపిడీలకు పాల్పడింది. ట్రై కమిషనరేట్ల పరిధులతో పాటు, ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లలో వందల

ఏటీఎంలలో నయా చోరీలు

డబ్బు డ్రా చేస్తారు.. రాలేదని బ్యాంకులకు ఫిర్యాదు చేస్తారు.. 

చోరీకి ‘ఎర్రర్‌’ టెక్నిక్‌

రెండేళ్లుగా వందల ఏటీఎంల నుంచి విత్‌డ్రాలు

ముఠా సభ్యుల అరెస్ట్‌తో వెలుగులోకి..


హైదరాబాద్‌ సిటీ: ఏటీఎంలలోని సాంకేతిక, బ్యాంకుల సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకున్న ఎనిమిది మంది సభ్యుల హరియాణా గ్యాంగ్‌ భారీ గా దోపిడీలకు పాల్పడింది. ట్రై కమిషనరేట్ల పరిధులతో పాటు, ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లలో వందల ఏటీఎంలను దోచుకుంది. మూడు నెలలుగా నగరంలో తిష్ట వేసిన గ్యాంగ్‌ 42 ఏటీఎం ల నుంచి డబ్బు తస్కరించింది. చార్మినార్‌ పీఎస్‌ పరిధిలో వెలుగుచూసిన మోసం కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ గ్యాంగ్‌ గుట్టు రట్టు చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, సౌత్‌జోన్‌ డీసీపీ గజరావు భూపాల్‌లు ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో వివరాలు వెల్లడించారు. 


అనుమానం..

ఓ బ్యాంక్‌ హుస్సేనీఆలం బ్రాంచ్‌ ఏటీఎంలో డబ్బు విత్‌డ్రాలో అవకతవకలు జరిగినట్లు గత నెల 26న బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పలుమార్లు ఇదే విధంగా జరిగినట్లు గుర్తించారు. పేరున్న బ్యాంక్‌ ఏటీఎంలలో ఇతర బ్యాంకుల కార్టులు వినియోగించినట్లు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు పలు కార్డుల ద్వారా రూ.53 వేలు డ్రా చేశారు. అకౌంట్‌లో కట్‌ అయింది కానీ ఖాతాదారులకు డబ్బు రాలేదని, వాపస్‌ చేయాలని సంబంధిత బ్యాంకు అధికారులు ఏటీఎం ఏర్పాటు చేసిన బాం్యకును కోరారు. ఆ బ్యాంకుల చార్జ్‌బ్యాక్‌ ఫిర్యాదుతో ఆ ఇద్దరు వ్యక్తులపై అనుమానించిన బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


అదుపులోకి నిందితులు

దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. నిందితులను గుర్తించి ఈ నెల 15న అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ముఠాలోని మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. విచారణలో 8 మంది సభ్యులు గల ఈ హరియాణా గ్యాంగ్‌కు మహ్మద్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ గ్యాంగ్‌లీడర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అతడితో పాటు ఆసిమ్‌ ఖాన్‌, రిజ్వాన్‌ ఖాన్‌, ముస్తాక్‌ ఖాన్‌, ఆసి్‌ఫఖాన్‌ పోలీసులకు చిక్కారు. ముబీన్‌ అహ్మద్‌, ఆబిద్‌ఖాన్‌, జాబిద్‌ఖాన్‌ పరారీలో ఉన్నారు. విచారణలో మోసాల తీరును నిందితులు వివరించారు. 


బ్యాంకులోని లొసుగులతోనే..

నిందితులందరూ పేరున్న బ్యాంక్‌ మినహా హరియాణాలోని ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు తీసుకున్నారు. బంధువులు, స్నేహితుల ఏటీఎం కార్డులు కూడా సంపాదించి సదరు బ్యాంక్‌ ఏటీఎంల వద్దకు చేరుకుంటారు. ఏటీఎం నుంచి డబ్బు బయటకు వచ్చే సమయంలో ఆ డబ్బును పట్టుకుంటారు. టైమ్‌ ఔట్‌ అయ్యేదాకా వెయిట్‌ చేస్తారు. టైమ్‌ లోపల డబ్బు తీసుకోలేదని మిషన్‌ గుర్తించి ఆ డబ్బును తిరిగి లోపలకు తీసుకునే సమయం వరకూ డబ్బును అలాగే పట్టుకుంటారు. దీంతో యంత్రంలో ఎర్రర్‌ అని చూపిస్తుంది. అనంతరం డబ్బును వీరు తీసుకుంటారు. ఎవరైనా వస్తున్నారేమోనని ఒకరు పరిశీలిస్తారు. సీసీ కెమెరా కంటికి కనిపించకుండా మరొకరు చేతిని అడ్డం పెడతారు. డబ్బు చేతికి వచ్చినా ఎర్రర్‌ వచ్చింది కనుక దాని ఆధారంగా డబ్బు విత్‌డ్రా కాలేదని ఖాతా ఉన్న బ్యాంకుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేస్తారు. నిబంధనల ప్రకారం ఆ బ్యాంకు నాలుగు పని దినాల్లోపు డబ్బును వాపస్‌ చేస్తుంది. డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాత ఏటీఎం అమర్చిన వద్దకు ఫిర్యాదు వెళ్తుంది. హుస్సేనీఆలం బ్రాంచిలో డబ్బులు విత్‌డ్రా అయినట్లు సీసీ ఫుటేజీ లభించడంతో వారి బండారం బయట పడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 5లక్షలు ఇలా కాజేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఓ ద్విచక్ర, 3 త్రిచక్ర వాహనాలు, 5 మొబైల్‌ ఫోన్‌లు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు, రూ. 2000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.

Updated Date - 2021-11-17T16:43:43+05:30 IST