Abn logo
Sep 20 2021 @ 17:23PM

భారత్‌లో ‘అటోస్’...

న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ అటోస్... భారత్‌లొ 15 వేల మంది ఉద్యోగులను నియమించుకోనుంది. సంవత్సరంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలో... ఉద్యోగులపై ఏటా 400 మిలియన్ పౌండ్లను వెచ్చించనుంది. ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా... అత్యంత అధునాతనమైన, భారీ సామర్ధ్యమున్న కంప్యూటర్ల తయారీ, వాటిని  పరీక్షించడం వంటి అంశాలను భారత్‌లో ‘అటోస్’ నిర్వహించనుంది.


సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న అటోస్ సంస్థకు... భారత్ లో ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులున్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలవాలన్న లక్ష్యం దిశగా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎలీ గిరాండ్ ఓ ఇంటర్యూలో భాగంగా పేర్కొన్నారు. పబ్లిక్ సెక్టార్, రక్షణ రంగాల్లో కూడా తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు గిరాండ్ వెల్లడించారు. కాగా... భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి పలు అవకాశాలుండడమే కాకుండా, అందుకు తగిన నైపుణ్యాలు కూడా అందుబాటులో ఉంటాయని,  అంతేకాకుండా... డిమాండ్ అండ్ సప్లై విషయంలో కూడా ఎటువంటి ఉత్కంఠ అవసరం లేదని కూడా సంస్థ భావిస్తోంది.