చేతులెత్తేశారు..!

ABN , First Publish Date - 2021-05-14T06:35:34+05:30 IST

కరోనా విషయంలో జిల్లా యంత్రాంగం చేతులెత్తేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చేతులెత్తేశారు..!
నేలపైనే బాధితులకు చికిత్స అందిస్తున్న నర్సులు

అడ్మిషన్లు బంద్‌

సూపర్‌ స్పెషాలిటీ, 

కేన్సర్‌ ఆస్పత్రుల్లో మూత

రెండు రోజులుగా ఇదే తంతు

ఉన్నతాధికారి 

ఆదేశాలంటూ ప్రచారం

కరోనా బాధితుల

ప్రాణాలతో ఆటలు

జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీనే గతి

సరైన వైద్యం, బెడ్లు, 

ఆక్సిజన్‌ దొరక్క అవస్థలు

సీరియ్‌సగా ఉన్నోళ్ల ప్రాణాలు హరీ

గురువారం అర్ధ గంటలోనే 

ముగ్గురు బలి

ఆస్పత్రి ఓపీ వద్ద

 బంధువుల ఆర్తనాదాలు

బెడ్లు లేక బాధితుల 

అవస్థలు దుర్భరం

అనంతపురం వైద్యం, మే13: కరోనా విషయంలో జిల్లా యంత్రాంగం చేతులెత్తేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా బారిన పడిన బాధితుల పట్ల అధికార యంత్రాంగం కనికరం చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బాధితుల తాకిడి పెరగడంతో వసతులు కల్పించలేక, ఆక్సిజన్‌ అందించలేక యంత్రాంగం తప్పించుకునే యత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ ఆస్పత్రులకు బాధితుల ఒత్తిడి పెరగడంతో వైద్యం అందక మృతుల సంఖ్య పెరిగిపోయింది. బాధితులకు రోజూ సరిపడా ఆక్సిజన్‌ అందించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నా రు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ, హిం దూపురం వంటి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక పలువురి ప్రాణాలు పోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రోజూ కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌, వైద్యం అందించటం కష్టతరంగా మారింది. దీంతో ఆస్పత్రులకు బాధితుల తాకిడి తగ్గించి, కేవలం కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వా రిని పరిమితం చేయాలని ప్ర యత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అడ్మిషన్లను ఆపేయటమే ఇందుకు నిదర్శనం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్‌ యూ నిట్లు, జిల్లా ఆస్పత్రిలో అడ్మిషన్లు దాదాపుగా నిలుపుదల చేశారు. రెండు రోజులుగా సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్స ర్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ బాధితు లను చేర్చుకోవడం లేదు. అక్కడికి వెళ్లిన వారు బతిమలాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదేమని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలనీ, తామేమీ చేయలేమం టూ చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. వచ్చిన వారిని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాలని పంపిస్తున్నారు. సీరియ్‌సగా ఉంటే జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీకి పంపి, మౌనంగా ఉంటూ బాధితుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.


అర గంటలో ముగ్గురి మృతి

జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్‌ ఓపీ వద్ద బాధితుల కష్టాలు చెప్పనక్కరలేదు. పగవాడికి కూడా ఇలాంటి క ష్టాలు రాకూడదని చూసిన ప్రతి ఒక్కరూ బాధపడుతూ కనిపిస్తున్నారు. మిగిలిన ఆస్పత్రుల్లో అడ్మిషన్లు ఆపేయటంతో జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీకి బాధితులు క్యూ కట్టారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే రద్దీ సాగింది. అక్కడ బెడ్లు లేక బాధితులు నేలపైన, కట్లపైన, వాహనాల్లో ఉం టూ పడిగాపులు కాస్తూ కనిపించారు. ఆక్సిజన్‌ అం దక సీరియ్‌సగా ఉన్న కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తుండడంతో బాధితులు వారి బంధువుల ఆందోళన, అరుపులు అందరినీ మరింత టెన్షన్‌కు గురి చేశాయి. సాయంత్రం 4 గంటల నుంచి అరగంట సమయంలో కొవిడ్‌ ఓపీలో మహమ్మద్‌ రఫీ, కదరక్క, అక్కులప్ప వెనువెంటనే ప్రాణాలు వదిలారు. అనంతపురం నగరం మారుతినగర్‌కు చెందిన 29 ఏళ్ల మహమ్మద్‌ రఫీ మరణించడాన్ని అతడి భార్య, తండ్రి జీర్ణించుకోలేకపోయారు. భార్య రోదన అందరినీ కలచివేసింది. రఫీ తండ్రి ఖాజావలి బుధవారం వచ్చామనీ, అయాసపడుతున్నాడని చెప్పినా సూదేసి మాత్రలు ఇచ్చి పంపించారనీ, ప్రాధేయపడినా ఏమీ కాదని చెప్పి పంపారంటున్నాడు. రాత్రికి మరింత సీరియస్‌ అ యిందనీ, గురువారం ఉదయమే రాగా.. సకాలంలో పట్టించుకోలేదని వాపోయాడు. దీంతోనే తన కొడుకు చనిపోయాడంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా మిగిలిన బాధితుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


బత్తలపల్లిలో ఒక్క రోజులోనే పది మంది..? 

బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఒక్క రోజులోనే పది మంది మరణించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కరోనా బాధితులు అక్కడ కూడా చాలామంది చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటలలోపు దాదాపు 10 మంది చికిత్స పొందుతున్నవారు చనిపోయారని తెలిసింది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ సంఖ్య ఎంత మేరకు ఇస్తారో చూడాలి.


ప్రణాళిక లోపమే ప్రజలకు శాపమా..?

కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో అధికారులు ముందస్తు ప్రణాళిక లోపమే ప్రజలకు శాపంగా మారిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మార్చిలో రెండో వేవ్‌ వైరస్‌ జిల్లాలో మొదలైంది. ఏప్రిల్‌లో కేసులు గణనీయంగా పెరుగుతూ రావడం మరణాలు సంభవిస్తూ వస్తున్నాయి. అధికారులు.. బాధితులకు ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించి, వారికి భరోసా కల్పించడంలో అలసత్వం చేస్తున్నారు. దీంతో సాధారణ లక్షణాలతో బాధపడుతున్న బాధితులు భయపడి చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రులకు వస్తున్నారు. ఇక్కడ సకాలంలో బెడ్లు, వైద్య సేవలు, ఆక్సిజన్‌ అందక చనిపోతున్నారు. వాటిని చూసిన ఎందరో బాధితులు మరింత ఆందోళన చెందుతూ బాగున్న వారు కూడా మళ్లీ భయంతో ఆరోగ్యం క్షీణించి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి నియోజకవర్గంలో అనుకూలమైన మండలాల్లో పెద్దఎత్తున కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, వైద్యులు, సిబ్బందిని నియమించి అవసరమైన మందులు అందించి ఉంటే సాధారణ బాధితుల్లో ఇంత టెన్షన్‌ ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుండా ఉన్న ఆస్పత్రులకు బాధితుల తాకిడి తగ్గించుకోవాలని అడ్మిషన్లు నిలుపుదల చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ శాఖల అధికారులే ఆ ఉన్నతాధికారి చెప్పిన మాటలు మాట్లాడుకుంటూ ప్రజల ప్రాణాలు అంటే ఇంత చులకనా... తమకు వచ్చినా ఇదే గతేనా అంటూ చర్చించుకుంటూ బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు.. బాధితుల పట్ల మానవత్వంతో ఆలోచించాలి. జిల్లాలో అవసరమైన వసతులు, వైద్య సేవలు, ఆక్సిజన్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకుని, బాధితుల ప్రాణాలకు భరోసా కల్పించాలి. ఇలాగే వ్యవహరిస్తే ఎందరో బలైపోయే ప్రమాదం లేకపోలేదు.








Updated Date - 2021-05-14T06:35:34+05:30 IST