నేడు జిల్లాలోని 26 కేంద్రాలలో పంపిణీ

ABN , First Publish Date - 2021-01-16T06:30:40+05:30 IST

తొలివిడత కరోనా వ్యాక్సినేషన్‌కు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు జిల్లాలోని 26 కేంద్రాలలో పంపిణీ
అనంతపురంలోని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాట్లు..

వ్యాక్సినేషన్‌కు.. సర్వం సిద్ధం!

తొలి విడతలో  30,747 మందికి టీకా

ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్యశాఖ

అనంతపురం వైద్యం, జనవరి 15 : తొలివిడత కరోనా వ్యాక్సినేషన్‌కు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్‌ల సిబ్బందితో పాటు ఐసీడీఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కరోనా టీకా వేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో వైద్యశాఖ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తల సమాచారం సేకరించారు. తొలి విడతలో శనివారం నుంచి 30,747 మందికి కరోనా టీకా వేయనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. వారి వివరాలను కరోనా టీకా పోర్టల్‌లో నమోదు చేశారు. వారికి మాత్రమే కరోనా టీకా వేస్తారు.


26 ఆస్పత్రులలో వ్యాక్సిన్‌ పంపిణీ

జిల్లాలో తొలి దశలో 26 ఆస్పత్రులలో కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఇందిరాగాంధీనగర్‌ అర్బన్‌ ఆస్పత్రి(అనంతపురం) జిల్లా సర్వజనాస్పత్రి, కిమ్స్‌ సవీరా ఆస్పత్రి, గార్లదిన్నె పీహెచ్‌సీ, మలకవేముల పీహెచ్‌సీ, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, కురుగుంట పీహెచ్‌సీ, యాడికి పీహెచ్‌సీ, పెద్దవడుగూరు పీహెచ్‌సీ, గుత్తి సీహెచ్‌సీ, ఎద్దులపల్లి పీహెచ్‌సీ, ఉరవకొండ సీహెచ్‌సీ, వజ్రకరూరు పీహెచ్‌సీ, శెట్టూరు పీహెచ్‌సీ, ముద్దినాయనపల్లి పీహెచ్‌సీ, ఎర్రగుంట పీహెచ్‌సీ, శాంతినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, పట్నం పీహెచ్‌సీ, పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కొత్తచెరువు పీహెచ్‌సీ, గుట్టూరు పీహెచ్‌సీ, రొద్దం పీహెచ్‌సీ, హిందూపురం జిల్లా ఆస్పత్రి, లేపాక్షి పీహెచ్‌సీ, రొళ్ల పీహెచ్‌సీ, కల్లుమర్రి పీహెచ్‌సీ ఆస్పత్రులలో కరోనా టీకా అందించనున్నారు. 



ఏర్పాట్లు సిద్ధం చేసిన వైద్యశాఖ

జిల్లాలో కరోనా టీకా అందించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే 22 ఆస్పత్రులకు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని కోల్డ్‌ స్టోరేజ్‌లో భద్రపరిచిన కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేశారు. ఆయా ఆస్పత్రులలో ప్రత్యేక కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాట్లు చేసి ఉంచారు. జిల్లా సర్వజనాస్పత్రి, జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, రూరల్‌ పరిధిలోని కురుగుంట పీహెచ్‌సీతో పాటు కిమ్స్‌ సవీరా ఆస్పత్రికి ఏరోజుకారోజు అవసరమైన కరోనా టీకా మందును జిల్లా వైద్య శాఖ కార్యాలయంలోని కోల్డ్‌ స్టోరేజ్‌ నుంచి అందించనున్నారు. టీకా నిబంధనల మేరకు వ్యాక్సిన్‌ అందించేందుకు 26 ఆస్పత్రుల్లో అవసరమైన వసతులు  ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ జేసీ సిరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీఐఓ డాక్టర్‌ గంగాధర రెడ్డితో పాటు ప్రత్యేక బృందాలు వ్యాక్సిన్‌ ఇచ్చే కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా సర్వజనాస్పత్రిలో దాదాపు 3 వేల మందికి వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఇందుకోసం 4 వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కేంద్రంలో వంద మందికి చొప్పున రోజుకు 400 మంది వరకు కరోనా టీకా వేయనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌ తెలిపారు. మరోవైపు ఏదైనా రియాక్షన్‌ అయితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య సిబ్బంది మందులను ఏర్పాటు చేశారు. పరి స్థితి విషమిస్తే ఎమర్జెన్సీ విభాగానికి తరలించి వైద్య సేవలు అందించేందుకు అక్కడ కూడా ప్రత్యేక బెడ్లు సిద్ధంగా ఉంచారు. 


ఓవైపు ఆనందం... మరోవైపు ఆందోళన

ఇప్పటి వరకు కరోనా టీకా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. శాస్త్రవేత్తల కృషి ఫలించి వ్యాక్సిన్‌ కళ్లముందుకు వచ్చింది. టీకా వేయడానికి సిద్ధమయ్యారు. తొలి విడతలో వైద్యులు, వైద్య సిబ్బంది అంగన్‌వాడీ వర్కర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇది ఓవైపు ఆనందం కలిగిస్తున్నా మరోవైపు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుందా అనే భయం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి విడతలో టీకా వేయించుకోవాల్సిన వైద్య వర్గాలే ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  కొందరు టీకాకు దూరంగా ఉండాలని కూడా సిద్ధమైనట్టు చెబుతున్నారు.  తొలి విడతలో ఎంత మంది  కరోనా టీకాకు దూరంగా ఉంటారో వారం గడిస్తే తెలుస్తుంది.


అపోహాలు వద్దు 

కరోనా టీకా పంపిణీకి అన్ని సిద్ధం చేశారు. తొలి దశ లో వైద్య వర్గాలు, అంగన్‌వాడీ వర్కర్లకు టీకా వేస్తున్నాం. ఇందుకోసం జిల్లాలో 26 ఆస్పత్రుల్లో టీకా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. రోజుకు ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకా వేస్తాం. అయితే  ఏరోజు ఎవరికి టీకా వెయ్యనున్నామో వారి ఫోన్‌ నంబర్‌కు ముందు రోజే మెసేజ్‌ పంపిస్తాం. వారు మాత్రమే టీకా వేసుకోవడానికి ఆయా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా రిజిస్టర్‌లో నమోదై ఉన్నాడా, మెసేజ్‌ పంపారా, ఆయనే వచ్చారా లేదా అన్ని పరిశీలించిన తర్వాతే వ్యాక్సిన్‌ ఇస్తాం.  కరోనా టీకాపై అపోహపడాల్సిన అవసరం లేదు. అన్ని పరీక్షించిన తర్వాతే టీకా తీసుకొచ్చారు. ఏదైనా రియాక్షన్‌ అయినా వెంటనే చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశాం. గర్భిణులు, బాలింతలు, 18 సంవత్సరాలు లోపు ఉన్న వారికి టీకా వేయడంలేదు. ఒక సారి ఏ టీకా తీసుకుంటారో రెండో సారి అదే టీకాను వేయించుకోవాలి. అప్పటి వరకు కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

- డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీఎంహెచ్‌ఓ

Updated Date - 2021-01-16T06:30:40+05:30 IST