జిల్లాలో 1,99,370 మందికి ‘చేయూత’ లబ్ధి

ABN , First Publish Date - 2021-06-23T06:52:34+05:30 IST

: జిల్లాలో వైఎ్‌సఆర్‌ చేయూత పథకం లబ్ధిని 1,99,370 మందికి చేకూర్చారు.

జిల్లాలో 1,99,370 మందికి ‘చేయూత’ లబ్ధి
మెగా చెక్కును అందజేస్తున్న మంత్రి, ఎంపీ, కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

అనంతపురం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైఎ్‌సఆర్‌ చేయూత పథకం లబ్ధిని 1,99,370 మందికి చేకూర్చారు. ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున రూ.373.82 కోట్లు మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బటన్‌ నొక్కి, రెండో విడత వైఎ్‌సఆర్‌ చేయూత లబ్ధిని మహిళల ఖాతాల్లో జమ చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్‌నారాయణ, కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహమ్మద్‌ ఇక్బాల్‌, ఎమ్మెల్యేలు సిద్దారెడ్డి, ఉషశ్రీచరణ్‌, జొన్నలగడ్డ పద్మావతి, వై. వెంకటరామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మే యర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతిసాహిత్య, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగన్న హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేయకుండా అమలు చేస్తున్నామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎ్‌సఆర్‌ చేయూత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మల్టీనేషనల్‌ కంపెనీల ద్వారా హోల్‌సేల్‌ ధరలకే ఉత్పత్తులు అందించి, లాభసాటి వ్యాపారాలు చేసుకునే అవకాశం ఈ పథకం ద్వారా కల్పిస్తున్నామన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల ద్వారా అందుతున్న సొమ్మును మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వినియోగిస్తుండటం అభినందనీయమన్నారు. ఎక్కువ మంది మహిళలు పశువుల పెంపకం, పాడిపరిశ్రమ, కిరాణాషాపులు, గార్మెంట్‌ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ తరహా వ్యాపారాలే కాకుండా మరింత పెద్దఎత్తున వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలు ముందుకు వస్తే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామన్నారు. అనంతరం వైఎ్‌సఆర్‌ చేయూత లబ్ధికి సంబందించిన మెగాచెక్కును మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌ గౌడ్‌, డీఆర్‌డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:52:34+05:30 IST