అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపాలి

ABN , First Publish Date - 2021-03-07T07:17:59+05:30 IST

అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, మార్చి6(ఆంధ్రజ్యోతి): అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఉపాధి హామీ పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి పనుల కల్పనలో జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబానికి వంద రోజుల పని తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఇంతకు ముందు ఒకేరోజు 6.39 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉపాధిహామీ కింద 6 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయన్నారు. అందులో వందరోజులపాటు 74696 కుటుంబాలకు మాత్రమే పని కల్పించినట్లు వివరించారు. ఈనెల 16వ తేదీలోపు 1.74 లక్షల కుటుంబాలకు వందరోజుల పని కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. హిందూపురం, మడకశిర, ఉరవకొండ క్లస్టర్లలో ఉన్న కుటుంబాల్లో పదిశాతం కన్నా తక్కువ మందికి పని కల్పించారన్నారు. నెలాఖరులోపు 30 శాతానికిపైగా కుటుంబాలకు వందరోజులు పనులు కల్పించాలని ఆయా క్లస్టర్ల ఎంపీడీఓలు, ఏపీఓలను ఆదేశించారు. 

ధర్మవరం, కదిరి, గుత్తి క్లస్టర్లలో ఉపాధి పనులు బాగా జరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు కల్పించడంలో రెండుసార్లు చివరిస్థానాల్లో నిలిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి పనుల కల్పనలో బాగా పనిచేసిన పెద్దపప్పూరు, యల్లనూరు, పామిడి ఎంపీడీఓలను ఆయన అభినందించారు. ‘తెలుసుకో.. ఎదుగు’ అనే నినాదంతో కలెక్టర్‌ చేపట్టిన కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. సమావేశానికి అనంతపురం రూరల్‌ పరిధిలోని పాపంపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఆఖరుగా సమావేశంలో ఎలాంటి అంశాలు గమనించారో ఆ విద్యార్థులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌ గౌడ్‌, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డీఈఓ శామ్యూల్‌, సమగ్రశిక్ష ఏపీసీ విద్యాసాగర్‌, ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు.

హిజ్రాలకు గుర్తింపు కార్డుల పంపిణీ

రాష్ట్రంలో మొదటిసారిగా అనంతపురం జిల్లాలోనే హిజ్రాలకు గుర్తింపు కార్డులు అందజేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హిజ్రాలకు గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో హిజ్రాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. హిజ్రాలకు ఇంటి స్థలాలివ్వటం, ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామన్నారు. వారికి చదువుకు తగ్గట్టు ఉద్యోగం, రేషన్‌ ఇవ్వటంతోపాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌, బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్‌కార్డులు అందజేస్తామన్నారు. హిజ్రాలకు గుర్తింపు కార్డులు మంజూరు కాకపోతే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో అర్హులైన 61 మంది హిజ్రాలకు గుర్తింపు కార్డులు అందజేశామన్నారు. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌ గౌడ్‌, సంక్షేమ శాఖ ఏడీ రసూల్‌, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి పలువురు హిజ్రాలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T07:17:59+05:30 IST