ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-21T06:54:36+05:30 IST

ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా క లెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పంపిణీని ప్రారంభిస్తామన్నారు.

ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా క లెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పంపిణీని ప్రారంభిస్తామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ నిశాంత్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇస్తున్న పెన్షన్‌ తరహాలోనే ఇంటి వద్దకే బియ్యం, ఇతర రేషన్‌ సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంటి వద్దకే సరుకుల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లాలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌నారాయ ణ ప్రారంభించనున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని తపోవనం సమీపాన జాతీయ రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సరుకుల పంపిణీ నిమిత్తం జిల్లాకు 754 మినీ ట్రక్కులు వచ్చాయన్నారు. జిల్లాలో 3012 రేషన్‌షాపుల పరిధిలో 11,75,552 రేషన్‌కార్డుల కుటుంబాలకు సరుకులు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పంపిణీ సజావుగా సాగేలా మినీ ట్రక్కు ఆపరేటర్‌కు ఒక వీఆర్‌ఓను అనుసంధానం చేస్తున్నామన్నారు. వీఆర్వో, ఆపరేటర్లకు 26వ తేదీ వరకూ సరుకుల పంపిణీపై శిక్షణ ఇస్తామన్నారు. 27 నుంచి 31వ తేదీ వరకూ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు. ఏ రోజు ఎవరికి రేషన్‌ ఇస్తామనేది ముందుగానే తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎ్‌సఓ రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:54:36+05:30 IST