ఆస్పత్రిలో కలియదిరిగిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-13T06:26:02+05:30 IST

జిల్లా సర్వజనాస్పత్రిలో కలెక్టర్‌ గంధం చంద్రుడు బుధవారం కలియదిరిగారు. గంటన్నరపాటు ఆస్పత్రిలో ఉంటూ ప్రతి విభాగాన్నీ పరిశీలించారు.

ఆస్పత్రిలో కలియదిరిగిన కలెక్టర్‌
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌

ఆక్సిజన్‌ సమస్యపై సుదీర్ఘంగా ఆరా

ఫిర్యాదులు లేకుండా పనిచేయాలని డాక్టర్లు, నర్సులకు హెచ్చరిక

అస్తవ్యస్త పార్కింగ్‌పై మరింత సీరియస్‌

అనంతపురం వైద్యం, మే12: జిల్లా సర్వజనాస్పత్రిలో కలెక్టర్‌ గంధం చంద్రుడు బుధవారం కలియదిరిగారు. గంటన్నరపాటు ఆస్పత్రిలో ఉంటూ ప్రతి విభాగాన్నీ పరిశీలించారు. ప్రధానంగా ఆక్సిజన్‌ సమస్యపై దీర్ఘంగా ఆరా తీశారు. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్‌ మ్యాన్‌ఫోల్డ్‌ యూనిట్లను తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ వద్ద ఉన్న మెయిన్‌ ఆక్సిజన్‌ మ్యాన్‌ఫోల్డ్‌ నుంచి ఫిమేల్‌ సర్జికల్‌ ఒకటి, రెండు, మూడు వార్డులకు సైనిక్‌ వార్డు, లేబర్‌ రూమ్‌కు, ఆర్థో మెయిన్‌ ఓటీలకు ఆక్సిజన్‌ సరఫరా అవుతుందన్నారు. మ్యాన్‌ఫోల్డ్‌ యూ నిట్ల నుంచి వార్డులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేలా మ్యాన్‌ఫోల్డ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో యూనిట్‌కు ఐదుగురు చొప్పున వర్కర్లను వెంటనే నియమించుకోవాలని సూచించారు. అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్ల తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మ్యాన్‌ఫోల్డ్‌ యూనిట్ల నుంచి నిరంతరంగా ఆక్సిజన్‌ సరఫరా సాగేలా అవసరమైన సిలిండర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఇం దుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీరియ్‌సగా ఆదేశించారు. ఆస్పత్రి నుంచి ఫిల్లింగ్‌ స్టేషన్‌కు ఖాళీ సిలిండర్లు వెళ్లిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారానే గతంలో వెం టిలేటర్లకు ఆక్సిజన్‌ సరఫరా జరిగేదని ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బాధితులకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. చికిత్స పొందే బాధితులను ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చూడాలని గట్టిగా ఆదేశించారు.


ఫిర్యాదులు రాకుండా పని చేయండి

ఆస్పత్రుల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా డాక్టర్లు, సిబ్బంది పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆస్పత్రిలోని కొవిడ్‌ విభాగాలను ఆయన పరిశీలించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ నర్సులు సరిగా పనిచేయడం లేదని తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. డాక్టర్లు.. బాధితుల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయన్నారు. డాక్టర్లు, నర్సులు బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి, బాధితులకు వైద్య సేవలందించాలన్నారు. ఆక్సిజన్‌ వినియోగం మనిషికి రోజుకు సగటున 18 నుంచి 21 లీటర్లు ఉంటుందన్నారు. అనంత ఆస్పత్రిలో మాత్రం 34 లీటర్లు వినియోగిస్తున్నారన్నారు. ఆక్సిజన్‌ వృథా కాకుండా చూడాలని సూచించారు.


పార్కింగ్‌ తీరుపై ఆగ్రహం

ఆస్పత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్‌ చేసి ఉండడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలబెట్టడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. లోపలికి వాహనాలను అనుమతించకుండా చూడాలని ఆదేశించారు. కరోనా సమయంలో వాహనాల పార్కింగ్‌ సక్రమంగా నిర్వహించాలనీ, రోగులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కొవిడ్‌ ఓపీ విభాగాన్ని పరిశీలించి, పలు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-05-13T06:26:02+05:30 IST