పల్స్‌ చూస్తుండగానే ప్రాణాలొదిలిన బాధితుడు..

ABN , First Publish Date - 2021-05-08T06:36:42+05:30 IST

జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్‌ ఓపీ కేంద్రంలో బాధితుల ఆర్తనాదాలు కలవరపెడుతున్నాయి.

పల్స్‌ చూస్తుండగానే ప్రాణాలొదిలిన బాధితుడు..
రోదిస్తున్న కుంటన్న కుటుంబ సభ్యులు

పల్స్‌ చూస్తుండగానే ప్రాణాలొదిలిన బాధితుడు..

బెడ్ల కోసం తప్పనిపడిగాపులు

్డ్ఠకాపాడండి అంటూ బంధువుల వేడుకోలు

నిర్ధారణ పరీక్షల ఆలస్యంపై అనుమానితుల ఆగ్రహం

ధర్మాస్పత్రి కొవిడ్‌ సెంటర్‌లో మారని దుస్థితి

 అనంతపురం వైద్యం, మే 7: జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్‌ ఓపీ కేంద్రంలో బాధితుల ఆర్తనాదాలు కలవరపెడుతున్నాయి. రోజూ ఇక్కడ రోగులు అనేక కష్టాలు పడుతున్నా.. పరిస్థితులు మాత్రం మారలేదు. కనీసం ఈ కేంద్రంలో తగిన చర్యలు తీసుకుని, బాధితుల బాధలు తీర్చాలని ఆలోచించే వారే కరువయ్యారు. శుక్రవారం కూడా ఇక్కడ ఘటనలు అందరినీ చలింపజేశాయి. కళ్లారా చూసిన వారందరూ అయ్యో..! అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు. కంబదూరు మండలం కర్తనపర్తికి చెందిన మంగళ కుంటన్న అయాసంతో బాధపడుతూ సూర్యనగర్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. అక్కడ సీటీ స్కాన్‌ చేసి, కరోనా లక్షణాలున్నాయని చికిత్స అందించారు. రోజుకు రూ.15 వేల చొప్పున ఐదు రోజులపాటు బిల్లులు వేశారు. శుక్రవారం కుంటన్న పరిస్థితి విషమించడంతో డిశ్చార్జ్‌ చేసి, పంపించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బెడ్లు లేవని చెప్పడంతో జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ వద్దకొచ్చారు. అంబులెన్స్‌లోనే ఉండగా వైద్య సిబ్బంది వెళ్లి పల్స్‌ రేట్‌ చూస్తుండగానే అక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలాడు. దీంతో ఆ బాధితుడి భార్య ఆస్పత్రి ఓపీ వద్ద ఏడవడం అందరినీ కలచివేసింది. మరో మహిళ తమ్ముడికి సీరియ్‌సగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. బెడ్లు లేక పట్టించుకోలేదు. దీంతో అక్క తన తమ్ముడిని కాపాడండి అంటూ వేడుకుంటూ ఏడవడం మరింత ఆవేదన కలిగించింది. ఇంకొకరు ఆటోలోనే ఉంటూ గంటల తరబడి బెడ్డు కోసం వేచిచూస్తూ ఇబ్బంది పడుతూ కనిపించారు. కొవిడ్‌ ఓపీలో మంచాలు లేక నేలపైనే పడుకోబెట్టి, వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా మందికి అవి కూడా అందక ఆర్తనాదాలు పెట్టడం అందిరినీ కలచివేసింది. అధికారులు, పాలకులు జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ వద్ద బాధితులు పడుతున్న కష్టాలు తీర్చాలన్న ఆలోచన చేయకపోవటం విమర్శలకు దారితీస్తోంది.















Updated Date - 2021-05-08T06:36:42+05:30 IST