నిబంధనలకు నై.. సిఫార్సులకే సై !

ABN , First Publish Date - 2021-01-16T06:32:12+05:30 IST

అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఓ సబ్‌ డివిజనల్‌ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు.

నిబంధనలకు నై.. సిఫార్సులకే సై !

ఓ డీఎస్పీ అత్యుత్సాహం...

అధికార పార్టీ ముఖ్య నేత సిఫార్సులతో ఇసుక ట్రాక్టర్లను వదిలేసిన వైనం

ఎస్పీ సీరియస్‌ కావటంతో కేసు నమోదు

అనంతపురం, జనవరి 15(ఆంధ్రజ్యోతి): అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఓ సబ్‌ డివిజనల్‌ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పదేపదే తన సమీక్షల్లోనూ... టెలీ కాన్ఫరెన్సుల్లోనూ ఆదేశిస్తున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలని, సిఫార్సులకు తలొగ్గొద్దని సూచిస్తున్నారు. అయినప్పటికీ... కొందరు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార పార్టీ ముఖ్య నేతల సిఫార్సులకే పెద్దపీట వేస్తున్నారు. అందుకు ఓ సబ్‌ డివిజనల్‌ అధికారి తీరే నిదర్శనం. జిల్లాలో సీఐ గా పనిచేసిన అనుభవం ఉన్న ఆ అధికారి అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఓ సబ్‌ డివిజన్‌కు డీఎస్పీగా వచ్చారు. అయితే  ఆ అధికారి వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ సీరియ స్‌ అయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ సబ్‌ డివిజన్‌ కేంద్రంలోని అధికార పార్టీ ముఖ్య నేత సిఫార్సులతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను ఆ డీఎస్పీ వదిలేయడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆ సబ్‌ డివిజన్‌ కేంద్రానికి... రూరల్‌ మండలంలోని ఓ గ్రామ సమీపంలోని వంక నుంచి ఐదు రోజుల కిందట ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 15 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.  వాటి యజమానులు ఆ విషయాన్ని స్థానిక అధికార పార్టీ ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ ముఖ్య నేత నేరుగా డీఎస్పీకి ఫోన్‌ చేసి ట్రాక్టర్లను వదిలేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ ముఖ్య నేత సిఫార్సులు అందుకున్నాడో లేదో ఆ డీఎస్పీ ఆగమేఘాల మీద 15 ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆ ట్రాక్టర్లను వదిలేశారు. ఈ విషయం ఎస్పీ సత్య ఏసుబాబు దృష్టికి వెళ్లటంతో ఆయన డీఎస్పీపై సీరియస్‌ అయినట్లు  సమాచారం. జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో ఇసుక, మద్యం అక్రమ రవాణా ఆ ప్రాంతంలో అధికంగా జరుగుతున్నా ఎందుకు అరికట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఒకానొక దశలో ఉద్యోగానికి వచ్చావా.... లేదా ఎవరేమీ చెబితే ఆ పని చేసేకొచ్చావా...? చట్ట పరిధిలో పనిచేయాలని తెలియదా.. అంటూ డీఎస్పీని మందలించినట్లు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.  ఎస్పీ సీరియస్‌ కావడంతో ఆ డీఎస్పీ బెంబేలెత్తిపోయి తా ను వదిలిపెట్టిన ట్రాక్టర్లపై తిరిగి కేసు నమోదు చేశారు.  ఆ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-01-16T06:32:12+05:30 IST