కరెంటు సమస్యలకు కనిపించని పరిష్కారాలు..

ABN , First Publish Date - 2021-08-01T06:49:44+05:30 IST

కరెంటు కష్టాలు తీరనివిగి మిగిలిపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వాటికి పరిష్కారం దక్కట్లేదు. జిల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

కరెంటు సమస్యలకు కనిపించని పరిష్కారాలు..

తీరని కష్టాలు..!

కరెంటు సమస్యలకు కనిపించని పరిష్కారాలు..

వ్యవసాయానికి నిరంతర 

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు

హై, లో ఓల్టేజీతో అవస్థలు

కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు

పనుల నిర్వహణలో సంబంధిత 

శాఖల అలసత్వం

పట్టించుకోని ప్రజాప్రతినిధులు


= ఇటీవల రాయదుర్గం పరిధిలో విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయనీ, స్థానిక ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని విద్యుత్‌ శాఖ సిబ్బందితో ఓ రైతు ఫోన్‌లో ఆవేదన వెల్లగక్కాడు. ఈ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ రైతు, లైన్‌మన్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విద్యుత్‌ సమస్య ఎంతలా ఉంటే ఆ రైతు ఆ స్థాయిలో ఆవేదన చెందాడో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ రైతు ఒక్కడి ఆవేదనే కాదు, జిల్లాలోని చాలాప్రాంతాల్లో రైతులు ఇలాగే విద్యుత్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.


=  ఇక్కడ కనిపిస్తున్న చిత్రం జిల్లాకేంద్రంలోని బాళ్లారి రోడ్డులోని సబ్‌స్టేషన్‌ వద్దది. కూడేరు మండలానికి చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతులకు రావడంతో ట్రాక్టర్‌లో తీసుకొచ్చాడు. ఆరు రోజుల కిందట విద్యుత్‌ సరఫరాలో నెలకొన్న సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. స్థానిక అధికారులు వచ్చి చూసి, మరమ్మతులు చేసినట్లు రైతు చెప్పుకొచ్చాడు. తిరిగి మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ను ట్రాక్టర్‌లో మరమ్మతుల కోసం తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విద్యుత్‌ సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


అనంతపురంరూరల్‌, జూలై31: కరెంటు కష్టాలు తీరనివిగి మిగిలిపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వాటికి పరిష్కారం దక్కట్లేదు. జిల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. హై, లో ఓల్టేజీ వల్ల చాలాప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్తులోనూ కోతలు అమలవుతున్నాయి. సరఫరా అయ్యే తొమ్మిది గంటల్లోనూ అర గంట నుంచి గంట వరకు కోతలు పెడుతున్నారు. సమ్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి సకాలంలో సంబంధిత శాఖల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కరెంటు కోసం వ్యవసాయ బోర్ల వద్ద అన్నదాతలు పడిగాపులు కా స్తున్నారు. దీనికితోడు నిరంతరం విద్యుత్‌ సరఫరాకు చేపడుతున్న పనుల్లో అలసత్వం రాజ్యమేలుతోంది. ఫలితంగా అన్నదాత కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన తెలిపిన రైతులపై కేసులు నమోదైనా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఏదేమైనప్పటికీ కరెంటోళ్ల నిర్లక్ష్యం.. రైతులపై పోలీసు కేసులు నమోదు వరకు తీసుకొస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


జిల్లాలో 2.93 లక్షల వ్యవసాయ కనెక్షన్లు

జిల్లాలో విద్యుత్‌ శాఖ పరిధిలోని ఐదు డివిజన్లలో 2.93 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అనంతపురంలో 87252, గుత్తిలో 50339, హిందుపురంలో 37539, కదిరిలో 46323, కళ్యాణదుర్గంలో 71946 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా మొత్తంగా 2,93,399 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. అనంతపురం, కళ్యాణదుర్గం, కదిరి డివిజన్‌ ప్రాంతాల్లో వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్‌లో ఎక్కువగా సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 13 నుంచి 14 మిలియన్‌ యూనిట్ల మధ్య రోజువారీ విద్యుత్‌ వినియోగం ఉంటోంది. ఇందులో వ్యవసాయానికి 3 నుంచి 4 మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ వినియోగం ఒకటి నుంచి రెండు యూనిట్లు పెరిగింది.


నిరంతర విద్యుత్‌లో కోతలు..

జిల్లాలో 733 ఫీడర్ల ద్వారా వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా అవుతోంది. 243 ఫీడర్లలో నిరంతరం, 400 ఫీడర్లలో రెండు విడతలుగా సరఫరా అవుతోంది. మరో 90 ఫీడర్లలో ఏపీఎస్పీడీసీఎల్‌, ఏపీట్రాన్స్‌కో సమన్వయలోపం కారణంగా అంతరాయాలు నెలకొంటున్నాయి. ఇందులో ట్రాన్స్‌కో అధికారులు 64 ఫీడర్ల పరిధిలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లైన్‌లాగాల్సి ఉంది. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో 26 ఫీడర్లలో లైన్లులాగడం, కండక్టర్ల ఏర్పాటు తదితర పనులు చేయాల్సి ఉంది. ఆ శాఖ ఉద్యోగుల్లో సమన్వయంలేక ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న వాదనలున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయితే చాలావరకు సమస్యలు తగ్గిపోయే ఆస్కారం ఉంది. సంబంధిత అధికారులు మాత్రం ఆ దిశగా చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తితే సంబంధిత శాఖల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో అరగంట నుంచి గంటపాటు విద్యుత్‌ సరఫరాలో కోతలు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఫలితంగా కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక పొలాల వద్ద రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.


హెచ్‌వీడీఎస్‌ పనుల్లోనూ జాప్యమే..

వ్యవసాయానికి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా కోసం జిల్లా హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (హెచ్‌వీడీఎస్‌) పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో దాదాపు రూ.600కోట్లతో వీటిని చేపడుతున్నారు. ఇందులో ప్రపంచబ్యాంకు నిధులతో 341 పనులకు సంకల్పించారు. ఇందులో 180 ఫీడర్లలో పనులు పూర్తవగా.. మరో 161 ఫీడర్లలో కొనసాగుతున్నాయి. రూరల్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నిధులతో 121 ఫీడర్లలో పనుల చేయాల్సి ఉండగా 95 ఫీడర్లలో పూర్తయ్యాయి. 26 ఫీడర్లలో పనులు కొనసాగుతున్నాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై) కింద 19 ఫీడర్లలో పనులు చేయాల్సి ఉండగా.. 5 ఫీడర్లలో మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 14 ఫీడర్లలో కొనసాగుతున్నాయి.


హై, లోఓల్టేజీతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు

జిల్లాలో హై, లోఓల్టేజీ సమస్యలతో చాలాప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. ఈ ఏడాది మే నెలలో త్రీఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 393, సింగిల్‌ఫేజ్‌వి 105 పాడైపోయాయి. జూన్‌లో త్రీఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 526, సింగిల్‌ ఫేజ్‌వి 121, జూలైలో త్రీఫేజ్‌వి 389, సింగిల్‌ ఫేజ్‌వి 83 మరమ్మతులకు వచ్చాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే విద్యుత్‌ సమస్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వర్షాలు కురవడంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవటం కొంత వరకు తగ్గాయని సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తోంది. వర్షాలు కురవకపోతే పరిస్థితులు మరోలా ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



మోటార్ల వద్దే కాపలా ఉంటున్నాం

గ్రామ సమీపంలో 15 ఎకరాలు కౌలుకు సాగు చేసుకుంటున్నా. పొలంలో పత్తి, వంకాయ, మిరప సాగు చేశా. ప్రస్తుతం కరెంటు సమస్యతో బోర్ల ద్వారా పంటను తడపడానికి ఇబ్బందికరంగా ఉంది. కరెంటు ఎప్పుడోస్తుందో తెలియని పరిస్థితి. దీంతో కరెంటు కోసం బోర్ల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. రోజూ మూడు ఎకరాలు తడవాల్సిన పంట.. కరెంటు కోతల కారణంగా ఎకరం కూడా తడవడం లేదు.

వెంకటేశులు, రైతు, డీ.హీరేహాళ్‌


Updated Date - 2021-08-01T06:49:44+05:30 IST